- Home
- Life
- Food
- Moringa Chutney: మునగాకుతో చట్నీ ఇలా చేసుకొని తింటే, ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి..!
Moringa Chutney: మునగాకుతో చట్నీ ఇలా చేసుకొని తింటే, ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి..!
మునగాకులో చాలా పోషకాలు ఉన్నాయి. ఇన్ని పోషకాలు ఉన్న మునగాకును ఆహారంలో భాగం చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే... మునగాకును పచ్చడి రూపంలో తీసుకోవచ్చు. ఇది.. రుచికి రుచిని అందించడమే కాకుండా... ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది.

Moringa
మునగాకు పోషకాల ఖజానా. ఇందులో విటమిన్ ఏ, సి, ఈ, కాల్షియం, ఐరన్, పొటాషియం, ప్రోటీన్ వంటి అనేక ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. మునగాకు తినడం వల్ల రక్తహీనత తగ్గి.. రక్తంలో ఐరన్ స్థాయి పెరుగుతుంది. ఇందులోని కాల్షియం, ఫాస్పరస్ ఎముకలు దంతాలు బలంగా ఉండేందుకు సహాయపడతాయి. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి.
మునగాకులోని విటమిన్ ఈ, బీటా కెరోటిన్ చర్మానినిక సహజ కాంతి, జుట్టుకు మెరుగైన పోషణను అందిస్తాయి, ఇది రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది, మధుమేహ సమస్య ఉన్నవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మునగాకులోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది. పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు రక్త పోటును సమతుల్యం చేసి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. అదనంగా, మునగాకు పురుషుల సంతానోత్పత్తి శక్తిని పెంచి, వీర్యకణాల నాణ్యతను మెరుగుపరుస్తుంది. మరి... ఇన్ని పోషకాలు ఉన్న మునగాకును ఆహారంలో భాగం చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే... మునగాకును పచ్చడి రూపంలో తీసుకోవచ్చు. ఇది.. రుచికి రుచిని అందించడమే కాకుండా... ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. మరి, ఈ మునగాకుతో పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామా...
మునగాకు పచ్చడికి కావాల్సిన పదార్థాలు..
1.మునగాకు- ఒక కప్పు
2.పచ్చిమిర్చి 5నుంచి6
3.వెల్లుల్లి 4-5 రెబ్బలు
4.చింతపండు చిన్న నిమ్మకాయ పరిమాణం
5.ఉప్పు-తగినంత
6.నువ్వులు-2 టేబుల్ స్పూన్లు
7.నూనె-2 టేబుల్ స్పూన్లు
8.ఆవాలు-1 టీ స్పూన్
9. ఎండుమిర్చి-2
10.కరివేపాకు
పచ్చడి తయారీ విధానం...
ఈ పచ్చడి తయారీలో భాగంగా ముందుగా మునగాకును శుభ్రంగా కడుక్కొని.. నీరు మొత్తం వంపేయాలి. ఆ తర్వాత ఒక పాన్ లో టేబుల్ స్పూన్ నూనె వేసి.. మునగాకును వేయించాలి. తక్కువ మంట మీద కనీసం 5 నుంచి6 నిమిషాల పాటు ఈ మునగాకును వేయించాలి. ఈ ఆకు రంగు మారి, చేదు తగ్గే వరకు వేయించాలి. ఆ తర్వాత ఈ వేయించిన ఆకులను పక్కన పెట్టి.. నువ్వులు, పచ్చి మిర్చీని కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు వేయించిన నువ్వులను ముందుగా పొడి చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత వేయించిన పచ్చి మిర్చీ, వెల్లుల్లి, చింతపండు, ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.చివరగా వేయించుకున్న మునగాకు కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి. మరీ మెత్తని పేస్టులాగా కాకుండా రుబ్బుకోవాలి. అప్పుడు రుచి అద్భుతంగా ఉంటుంది.
టేస్టీ అండ్ హెల్దీ మునగాకు పచ్చడి..
ఇప్పుడు రుబ్బి పెట్టుకున్న పచ్చడికి తాళింపు వేయాలి. ఒక బాణలిలో రెండు, మూడు స్పూన్ల నూనె వేసి.. తాళింపు గింజలు, ఎండు మిర్చీ, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత పచ్చడి కూడా వేసి వేయించుకోవాలి. అంతే.. కమ్మని రుచికరమైన పచ్చడి తయారైనట్లే. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కలుపుకొని నెయ్యి వేసుకొని తింటే రుచి అదిరిపోతుంది. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి.