- Home
- Life
- Food
- Kaju katli Recipe: జీడిపప్పుతో సులువుగా ఇంట్లోనే ఇలా కాజు కట్లీ చేసేయండి, తక్కువ ధరలో రెసిపీ రెడీ
Kaju katli Recipe: జీడిపప్పుతో సులువుగా ఇంట్లోనే ఇలా కాజు కట్లీ చేసేయండి, తక్కువ ధరలో రెసిపీ రెడీ
ఏ పండుగ వచ్చినా ఇంట్లో కచ్చితంగా స్వీటు ఉండాల్సిందే. కాజు కట్లీ స్వీట్ అంటే ఎందరికో ఇష్టం. కానీ కొనాలంటే అది అధిక ధరలో లభిస్తాయి. నిజానికి ఇంట్లోనే తక్కువ ఖర్చుతో కాజు కట్లీ స్వీట్ ను రెడీ చేసుకోవచ్చు. ఈ రెసిపీని ఫాలో అవ్వండి.

కాజు కట్లీ స్వీట్ తయారీ
కాజు కట్లీ స్వీటు నోట్లో పెడితే చాలు కరిగిపోయేలా ఉంటుంది. ఎన్ని తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది. ప్రతి స్వీట్ షాప్ లో కచ్చితంగా ఉండే తీపి పదార్థం ఇది. దీన్ని చేయడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు. చాలా సులువుగా దీన్ని వండేయచ్చు. మార్కెట్లో దీని ఖరీదు ఎక్కువ. కానీ మీరు ఇంట్లో సగం ఖర్చుతోనే కాజు కట్లీ స్వీట్లు తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్ పద్ధతుల్లో కాజు కట్లీ ఎలా చేయాలో చెప్పాము.
కాజు కట్లీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
కాజు కట్లీ స్వీట్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఇక్కడ జీడిపప్పులు 100 గ్రాములు, పంచదార ఒక కప్పు, నీరు అరకప్పు, నెయ్యి ఒకటిన్నర స్పూను, యాలకుల పొడి ఒక స్పూను.
కాజు కట్లీ రెసిపీ
ముందుగా జీడిపప్పులను మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. అలాగని మరీ ఎక్కువ రుబ్బకండి. జీడిపప్పులోంచి నూనె లాంటి పదార్థం వచ్చి ముతకగా మారుతుంది. కాబట్టి పొడిలాగా మెత్తగా అయ్యాక మిక్సీ ఆపేయండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి పంచదార, నీరు వేసి కలపండి. చక్కెర నీటిలో బాగా కరిగిపోయాక మంటను తగ్గించండి. ముందుగా రుబ్బి పెట్టుకున్న జీడిపప్పు పొడిని వేసి మెల్లగా కలుపుతూ ఉండండి. ఈ మిశ్రమం దగ్గరగా మృదువుగా అయ్యేవరకు కలపండి. తర్వాత నెయ్యిని వేయండి. చివరలో యాలకుల పొడిని కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి.
సిల్వర్ పూత కూడా
ఇప్పుడు జీడిపప్పు మిశ్రమాన్ని చల్లార్చి ఒక గిన్నెలోకి వేయండి. దీన్ని చేత్తోనే చపాతీ పిండిని ఎలా పిసుకుతారో అలా పిసకండి. ఆ ముద్దను చపాతి పీటపై పెట్టి మందంగా రుద్దుకోండి. ఇప్పుడు రోలింగ్ పిన్ తో కాజు కట్లీ ఆకారంలో కట్ చేసుకోండి. ఇలా మొత్తాన్ని వజ్రాల్లాగా కట్ చేసుకుంటే కాజు కట్లీ స్వీట్ రెడీ అయినట్టే. బయట మార్కెట్లో కాజు కట్లీపై సిల్వర్ పూత కనిపిస్తుంది. అది మీకు మార్కెట్లో లభిస్తుంది. నచ్చితే దాన్ని కూడా తీసుకొచ్చి పైన సిల్వర్ పూత జోడించుకోవచ్చు.
కాజు కట్లీ టేస్టీగా రావాలంటే
కొందరు నెయ్యికి బదులుగా కొబ్బరి నూనెను కూడా వినియోగిస్తారు. కేరళలో కాజు కట్లీలో వాడేది ఎక్కువగా కొబ్బరి నూనె. అలాగే పంచదార వాడడం ఇష్టం లేకపోతే స్టెవియాను వాడొచ్చు. మీకు సిల్వర్ పూత అవసరం లేదు అనిపిస్తే దాన్ని కూడా వాడాల్సిన అవసరం లేదు. మీకు ఇంకా రుచిగా కావాలి అనుకుంటే... కాజు కట్లీ మిశ్రమానికి కాస్త రోజ్ వాటర్ జోడించండి. ఇది మీ బర్ఫీలకు మంచి సువాసన వచ్చేలా చేస్తుంది.