పల్లీలు రోజూ తింటున్నరా? అయితే మీరు ఈ ముచ్చట తెలుసుకోవాల్సిందే
వేరుశెనగల్లో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. వీటిని తినడం వల్ల కొరోనరీ హార్ట్ డిసీజ్ ముప్పు తగ్గుతుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అలాగని వీటిని రోజూ తినొచ్చా?
peanuts
పల్లీలను రకరకాల వంటల్లో ఉపయోగిస్తారు. అంతేకాదు వీటితో తయారుచేసిన పల్లిపట్టీలు కూడా బలే టేస్టీగా ఉంటాయి. పల్లీలు పోషకాలకు మంచి వనరు. వీటిలో కొవ్వు, ప్రోటీన్, ఫైబర్, పొటాషియం, భాస్వరం, బి విటమిన్లు, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని హెల్తీ స్నాక్స్ గా పరిగణిస్తారు.
వేరుశెనగలో మోనోశాచురేటెడ్ కొవ్వులు, మొక్కల స్టెరాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. వేరుశెనగ మొక్కల ఆధారిత ప్రోటీన్ కు మంచి మూలం. వేరుశెనగలలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను నివారించడానికి సహాయపడతాయి. పల్లీల్లో ఐరన్, ఫోలేట్, కాల్షియం, జింక్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాలు పెరగకుండా ఆపడమే కాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలను నివారిస్తాయి.
మోనోశాచురేటెడ్, కొవ్వు ఆమ్లాలతో పాటుగా ఒలేయిక్ ఆమ్లాలు కూడా వేరుశెనగలో ఉంటాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. పాలీఫెనాలిక్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నందున ఈ పల్లీలు కడుపు క్యాన్సర్ ను నివారించడానికి సహాయపడుతుంది.
వేరుశెనగలను తింటే కొరోనరీ హార్ట్ డిసీజ్ ప్రమాదం తగ్గుతుందంటున్నారు నిపుణులు. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నిర్వహించిన ఒక అధ్యయనంలో వేరుశెనగ చెడు కొలెస్ట్రాల్ (ఎల్డిఎల్) స్థాయిలను తగ్గిస్తుందని కనుగొన్నారు. ఈ మధ్యకాలంలో చేసిన అధ్యయనంలో.. పాలీఫెనాల్స్ ఎక్కువగా ఉండే వేరుశెనగ చర్మం, గుండె జబ్బులకు కారణమయ్యే మంటను తగ్గిస్తుందని కనుగొన్నారు.
వేరుశెనగలను ఎక్కువగా తింటే?
వేరుశెనగలను ఎక్కువగా తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. వేరుశెనగను ఎక్కువగా తినడం వల్ల విరేచనాలు, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. అంతేకాదు అలెర్జీలు, దీర్ఘకాలిక జీర్ణ సమస్యలు ఉన్నవారు వేరుశెనగకు దూరంగా ఉండాలి. అలాగే డయాబెటిస్ పేషెంట్లు వేరుశెనగ తినడానికి ముందు ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి.