Almonds: బాదం పప్పు రోజూ తింటున్నారా? ఈ విషయాలు మీకు తెలుసా?
Almonds: 100 గ్రాముల బాదం పప్పుల్లో దాదాపు 258 మిల్లీ గ్రాముల మెగ్నీషియం, 503 మిల్లీ గ్రాముల భాస్వరం, 57 మైక్రోగ్రాముల బయోటిన్, 254 మిల్లీ గ్రాముల కాల్షియం, 21.4 గ్రాముల ప్రోటీన్, 600 కేలరీలు, 10.8 గ్రాముల ఫైబర్, 51.1 గ్రాముల కొవ్వు ఉంటుంది.

బాదం పప్పు...
ప్రకృతిలో మనకు లభించే పోషకవంతమైన ఆహారాలలో బాదం పప్పులు ప్రత్యేక స్థానం కలిగి ఉంటాయి. చూడటానికి చిన్నగా ఉండే ఈ బాదం పప్పులో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడానికి, అలాగే అనేక వ్యాధులను దూరం పెట్టడానికి రోజువారీ ఆహారంలో కచ్చితంగా బాదం పప్పు చేర్చుకోవాలి అని నిపుణులు చెబుతున్నారు.
బాదం పప్పులో పోషకాలు...
100 గ్రాముల బాదం పప్పుల్లో దాదాపు 258 మిల్లీ గ్రాముల మెగ్నీషియం, 503 మిల్లీ గ్రాముల భాస్వరం, 57 మైక్రోగ్రాముల బయోటిన్, 254 మిల్లీ గ్రాముల కాల్షియం, 21.4 గ్రాముల ప్రోటీన్, 600 కేలరీలు, 10.8 గ్రాముల ఫైబర్, 51.1 గ్రాముల కొవ్వు, 0.91 మిల్లీ గ్రాముల కాపర్ ఉంటుంది. వీటిని తినడం వల్ల శరీరానికి అవసరమైన ఎనర్జీ లభిస్తుంది.
చర్మ ఆరోగ్యానికి బాదం
బాదం పప్పులో విటమిన్ E ఎక్కువగా ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేసి చర్మాన్ని రక్షిస్తుంది. ముడతలు, మచ్చలు, పిగ్మెంటేషన్ తగ్గించడంలో సహాయపడుతుంది. బాదం తినడం వల్ల చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. అందుకే చర్మ సంరక్షణలో బాదం నూనె, బాదం పాలు ప్రత్యేక స్థానం సంపాదించాయి.
హృదయానికి మేలు చేసే బాదం
బాదం తినడం వల్ల “మంచి కొలెస్ట్రాల్” (HDL) పెరుగుతుంది, “చెడు కొలెస్ట్రాల్” (LDL) తగ్గుతుంది. దీని వలన హృదయ సంబంధిత వ్యాధుల ముప్పు తగ్గుతుంది. క్రమం తప్పకుండా బాదం తినేవారిలో పొట్ట చుట్టూ కొవ్వు తగ్గి, నడుము చుట్టుకొలత కూడా తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
రక్తంలో చక్కెర నియంత్రణ
ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే బాదం, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాలు తిన్నప్పుడు వాటి గ్లైసెమిక్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. షుగర్ సమస్య ఉన్నవారికి ఇది సహజమైన ఔషధంలా పనిచేస్తుంది.
బరువు తగ్గడానికి సహాయపడే బాదం..
బరువు తగ్గాలనుకునే వారికి బాదం ఒక ఉత్తమమైన స్నాక్. ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండటంతో, ఇది ఎక్కువసేపు ఆకలి రాకుండా చేస్తుంది. ఫలితంగా అతిగా తినే అలవాటు తగ్గుతుంది. అదే సమయంలో ఆరోగ్యకరమైన కొవ్వులు శక్తినిస్తాయి.
ఎముకలకు బలం
బాదం పప్పులో ఉండే కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం ఎముకలను బలపరుస్తాయి. చిన్నవారు నుండి పెద్దవారి వరకు అందరూ బాదం తింటే ఎముకల బలహీనత, ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు.
ఫైనల్ గా....
రోజూ నాలుగైదు బాదం తినడం ద్వారా శరీరానికి కావలసిన విటమిన్లు, ఖనిజాలు, శక్తి అన్నీ అందుతాయి. చర్మం కాంతివంతంగా మారడమే కాకుండా, హృదయ ఆరోగ్యం మెరుగుపడుతుంది, డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది, బరువు తగ్గడంలో సులభతరం అవుతుంది. అంతేకాదు ఎముకలు బలపడతాయి.