Fake Red Chilli Powder: ఆకర్షించే రంగుతో కారం పొడి... కల్తీని గుర్తించేదెలా?
Fake Red Chilli Powder:మార్కెట్లో చూడగానే ఆకట్టుకునేలా కారం పొడులు ఉన్నాయి. చూడటానికి బాగుంటాయి కానీ, అసలు మనం కొనేవి స్వచ్ఛమైనదేనా? లేక కల్తీ జరిగిందా? ఎలా తెలుసుకోవాలో తెలుసా?

కల్తీ కారం..
కూర రుచి పెరగాలంటే... ఉప్పు ఎంత ముఖ్యమో , కారం కూడా అంతే ముఖ్యం. కూరలో వేసే కారం చూడటానికి ఎర్రగా ఉంటే, ఆ కూర కూడా చూడటానికి కూడా చాలా బాగుంటుంది. కానీ, ఎర్రటి కారం పేరుతో మనకు మార్కెట్లో అమ్మేది నిజమైన కారమేనా? లేక ఏమైనా రంగులు కలుపుతున్నారా? ఈ విషయం గుర్తించేదెలా? కల్తీ కారాన్ని అసలు గుర్తించే పద్దతులు ఏమైనా ఉన్నాయా అనే విషయం ఇప్పుడు చూద్దాం...
మార్కెట్లో కల్తీ కారం...
ప్రస్తుతం మార్కెట్లో లభించే ప్యాకెట్ కారం పొడి లో చాలా మంది రంగులు కలిపి అమ్ముతున్నారని తెలుస్తోంది. అలాంటి కారం పొడులను ఎక్కువ కాలం నిల్వ చేయలేం. ఎందుకంటే అవి చాలా త్వరగా చెడిపోతాయి. అందులో వాడే రంగులు కూడా స్వచ్ఛమైనవి కావు. కృత్రిమ రంగులను వాడుతున్నారు. అవి కూడా మన ఆరోగ్యానికి ఎక్కువ నష్టం కలిగించేవే
1.కల్తీ కారం పొడిని గుర్తించాలంటే....
మనకు మార్కెట్లో దొరికే అన్ని కారం పొడులు స్వచ్ఛమైనవి కావు. అందుకే.. వాటిలో కల్తీ జరిగిందో లేదో చిన్న చిట్కాతో గుర్తించొచ్చు. దాని కోసం అయోడిన్ టింక్చర్ లేదా అయోడిన్ ద్రావణం వాడితే సరిపోతుంది. ముందుగా ఒక స్పూన్ కారం పొడి తీసుకొని అందులో కొన్ని చుక్కల అయోడిన్ కలపాలి. ఆ కారం పొడి..నీలం రంగులోకి మారితే అందులో కల్తీ జరిగిందని అర్థం. ఇలాంటి కారం పొడిని వంటకు వాడకపోవడమే మంచిది.
2.కారంలో ఇటుక పొడి కూడా కలుపుతారా?
చాలా మంది కారంలో ఇటుక పొడి కూడా కలిపి అమ్మేస్తూ ఉంటారు. మరి.. ఇలా ఇటుక పొడి ఉన్న కారాన్ని కూడా ఈజీగా గుర్తించవచ్చు. చూడటానికి మాత్రం అచ్చం ఎర్ర మిరపకాయల పొడిలానే కనపడుతుంది. ఇలాంటి కారాన్ని పరీక్షించడానికి ఒక గ్లాసు తీసుకొని దాని అడుగున కారం వేయాలి. ఆ కారాన్ని మీ వేలితో రుద్దాలి. మీకు గరుకుగా అనిపిస్తే.. అంది కల్తీ అని అర్థం.
3.కృత్రిమ రంగు గుర్తించడానికి....
మీరు కొన్న కారంలో ఏవైనా కృత్రిమ రంగులు కూడా కలిపే అవకాశం ఉంది. మీ కారం చాలా ముదురు ఎరుపు రంగులో లేదా ప్రకాశవంతంగా కనిపిస్తే అనుమానాపడాల్సిందే. అరగ్లాసు నీటిలో ఒక టీస్పూన్ ఎర్ర కారం పొడిని వేసి కలపాలి. ఆ నీరు కూడా ముదురు రంగులోకి మారితే.. అందులో రంగులు కలిసినట్లే. ఆ కారం కల్తీది అని తేలిపోతుంది. స్వచ్ఛమైన కారం పొడి నీటిలో కరగదు.