Reheat: ఈ ఫుడ్స్ ని రీహీట్ చేసి అస్సలు తినకూడదు, ఎందుకో తెలుసా?
Reheat: మీకు మిగిలిపోయిన ఆహారాన్ని ఉదయాన్నే మళ్లీ వేడి చేసి తినే అలవాటు మీకు ఉందా? అలా అయితే, మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే... కొన్ని ఆహారాలను వేడి చేసి తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ముఖ్యంగా జీర్ణ సమస్యలను తెచ్చి పెడుతుంది.

Food Reheat
మనలో చాలా మందికి చల్లగా మారిన ఆహారం తినడం నచ్చదు. మరీ ముఖ్యంగా చలికాలంలో వేడి వేడిగా ఉండే ఫుడ్ తినాలని అనుకుంటారు. అలా అని.. వండుకున్న ఆహారాన్ని పారేయలేరు కదా... కాబట్టి... వాటిని వేడి చేసుకొని వేడి వేడిగా ఆరగిస్తూ ఉంటారు. దీని వల్ల మిగిలిపోయిన ఆహారం వృథా కాకుండా ఉంటుంది. కానీ, ఇలా వేడి చేసి తినడం ఆరోగ్యానికి మంచిదేనా? పదే పదే వేడి చేసి తినడం వల్ల ఆహారంలోని పోషకాలు కూడా తగ్గిపోతాయని మీకు తెలుసా? అంతేకాదు.. చాలా రకాల ఆరోగ్య సమస్యలు రావడానికి కూడా కారణం అవుతుందని మీకు తెలుసా? అసలు, వేటిని వేడి చేసి తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం...
ఏ ఆహారాలను మళ్లీ మళ్లీ వేడి చేయకూడదు..?
మిగిలిపోయిన అన్నం, సాంబార్ లాంటి వాటిని మళ్లీ మళ్లీ వేడి చేసి తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ, ఇలా తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ కి కూడా దారి తీయవచ్చు. దీని ప్రధాన కారణం ఏమిటంటే, వేడి చేసినప్పుడు, ఆహారంలో లభించే అనేక పోషకాలు నాశనం అవుతాయి. కొన్ని సమ్మేళనాలు విషంగా మారే అవకాశం ఉంది.
బంగాళదుంప వంటకాన్ని వేడి చేయడం....
పోషకాహార నిపుణుల ప్రకారం, బంగాళదుంపలను మళ్లీ మళ్లీ వేడి చేసి తినకూడదు. బంగాళ దుంపలలో విటమిన్ బి6, పొటాషియం, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ మళ్లీ వేడి చేసినప్పుడు పోతాయి. అదనంగా ఒక రకమైన బాక్టీరియా పెరిగే అవకాశం ఉంది. ఇది శరీరానికి చాలా హానికరం.
ఉడికించిన కోడిగుడ్డు...
కోడి గుడ్లను ఉడికించిన వెంటనే తినేయాలి. వాటిని ఎల్లప్పుడూ వేడి చేయకూడదు. గుడ్డు ప్రోటీన్లలో అధిక మొత్తంలో నైట్రోజన్ ఉంటుంది. వేడి చేసినప్పుడు... నైట్రోజన్ క్యాన్సర్ కారక పదార్థాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది మిమ్మల్ని క్యాన్సర్ ప్రమాదాన్ని కలిగిస్తుంది. అందువల్ల, గుడ్లను ఉడికించిన తర్వాత మళ్లీ వేడి చేయకూడదు.
చికెన్ ని వేడి చేయకూడదా..?
చికెన్ ని ఒకసారి వండిన తర్వాత, రెండోసారి వేడి చేయకూడదు. దీని వల్ల ప్రోటీన్లు తగ్గిపోతాయి. వాటి రూపం కూడా మారిపోతుంది. ఫలితంగా ఇది ఆరోగ్యానికి హాని చేస్తుంది. చాలా సందర్భాలలో వంట తర్వాత కూడా హానికరమైన బాక్టీరియా కోడి మాంసంలోనే ఉంటుంది. వండిన చికెన్ ను మైక్రోవేవ్ లో పెడితే, ఆ బాక్టీరియా మాంసం అంతటా వ్యాపిస్తుంది.
టీ వేడి చేసి మళ్లీ తాగొచ్చా..?
టీ ప్రియులు ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే, టీ ని మళ్లీ మళ్లీ వేడి చేయడం మంచిది కాదు. ఇలా వేడి చేస్తే ఆ టీ రుచి మారిపోతుంది. అధిక కెఫిన్ కంటెంట్ ఎసిడిటీ, నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. కాబట్టి, టీ ఎప్పుడూ ఫ్రెష్ గా చేసుకొని తాగడమే మంచిది.
మష్రూమ్స్...
మష్రూమ్స్ ను కూడా వేడి చేసి తినకూడదు. ఇలా చేసి తినడం వల్ల జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. ఇలా చేయడం వల్ల బాక్టీరియా పెరిగిపోతుంది. ఆరోగ్యానికి హాని చేస్తుంది.
పాలకూర..
పాలకూరలో నైట్రేట్లు కూడా ఉంటాయి, ఇవి మళ్ళీ వేడి చేసినప్పుడు నైట్రేట్‌లుగా మారుతాయి. దీన్ని తినడం వల్ల మెథెమోగ్లోబినిమియా వస్తుంది. దీని అర్థం ఎర్ర రక్త కణాలు ఆక్సిజన్‌ను సరిగ్గా తీసుకెళ్లలేవు, ఇది ప్రాణాంతకం కావచ్చు.

