స్పైసీగా ఏదైనా తినాలనిపిస్తోందా? మీల్ మేకర్ మంచూరియన్ ఇలా సులువుగా చేసేయండి
ఇంట్లో మీల్ మేకర్ ఉందా? అయితే పావుగంటలో మంచూరియన్ చేసేయవచ్చు. వర్షాలు పడుతున్నప్పుడు దీన్ని వేడి వేడిగా స్పైసీగా తింటే ఆ రుచే వేరు. రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

మీల్ మేకర్ మంచూరియన్ రెసిపీ
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. అలాంటి చల్లని వాతావరణంలో వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. బయటినుంచి తెచ్చుకునే బదులు ఇంట్లోనే శుచిగా, శుభ్రంగా చేసుకోవచ్చు. మీ ఇంట్లో మీల్ మేకర్ ఉందా? అయితే దాంతో మీల్ మేకర్ మంచూరియన్ ట్రై చేయండి. ముఖ్యంగా మీ మీల్ మేకర్... సోయాతో చేసినదై ఉండాలి. లేకపోతే నాణ్యత లేనిది అయితే మెత్తగా ముద్దగా మారిపోతుంది. అదే సోయాతో చేసిన మీల్ మేకర్ అయితే నాణ్యమైనది. ఇది ఉడికించాక కూడా ముక్కలుగా గట్టిగానే ఉంటుంది. ఇంకా మీల్ మేకర్ మంచూరియన్ చేయడం ఎలాగో తెలుసుకోండి.
మీల్ మేకర్ మంచూరియా రెసిపీకి కావలసిన పదార్థాలు
మీల్ మేకర్లో ఒక 50 గ్రాములు తీసుకోండి. ఇప్పుడు అందులో వేయడానికి ఉప్పు రుచికి సరిపడా పక్కన పెట్టుకోండి. ఉల్లికాడల తరుగు రెండు స్పూన్లు, మిరియాల పొడి అర స్పూను, వెనిగర్ ఒక స్పూన్, టమాటా సాస్ రెండు స్పూన్లు, సోయాసాస్ ఒక స్పూను, షెజ్వాన్ సాస్ ఒక స్పూను తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత పచ్చిమిర్చి నాలుగు, వెల్లుల్లి తరుగు అర స్పూను, అల్లం తరుగు అర స్పూన్, కార్న్ ఫ్లోర్ మూడు స్పూన్లు, మైదాపిండి రెండు స్పూన్లు రెడీ చేసుకోండి.
ఇలా చేసేయండి
మీల్ మేకర్ మంచూరియా రెసిపీ చేయడానికి ముందుగా ఒక గిన్నెలో వేడి నీళ్లు వేసి మీల్ మేకర్లను వేయండి. అవి పది నిమిషాల్లో మెత్తగా మారిపోతాయి. తర్వాత వాటిని చేత్తోనే పిండి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో ఉడకబెట్టిన ఈ మీల్ మేకర్లను వేయండి. అందులోనే ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, మైదాపిండి, షెజ్వాన్ సాస్, కార్న్ ఫ్లోర్, సోయాసాస్ వేసి బాగా కలపండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను వేయండి. ఆ డీప్ ఫ్రై లో ఈ మీల్ మేకర్లను వేసి రంగు మారేవరకు వేయించండి. ఆ తర్వాత తీసి పక్కన పెట్టుకోండి.
రుచిగా శుచిగా రెసిపీ
ఇప్పుడు మరొక కళాయిని స్టవ్ మీద పెట్టి రెండు స్పూన్ల నూనె వేయండి. ఆ నూనెలో వెల్లుల్లి తరుగును, అల్లం తరుగును వేసి వేయించండి. ఆ తర్వాత పచ్చిమిర్చి తరుగు, ఉల్లికాడలు తరుగు కూడా వేసి బాగా వేయించుకోండి. అందులోనే ఉప్పు, మిరియాల పొడి కూడా వేసి బాగా కలపండి. ఆ తర్వాత షెజ్వాన్ సాస్, టమోటా కెచప్, సోయా సాస్, వెనిగర్ కూడా వేసి బాగా కలపండి. ఈ లోపు చిన్న కప్పులో ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి, కాస్త నీళ్లు వేసి దాన్ని నీళ్ళల్లాగా కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని కూడా కళాయిలో వేసి బాగా కలపండి. ఇది చిక్కగా అయినప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మీల్ మేకర్లను ఇందులో వేసి బాగా కలపండి. ఈ మొత్తం మిశ్రమం దగ్గర లాగా అయ్యి మంచూరియా అవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. పైన కొత్తిమీర జల్లుకోండి. ఇప్పుడు ప్లేట్లో వేసి వేడివేడిగా సర్వ్ చేసుకోండి. రుచిగా శుచిగా చేసిన మిల్ మేకర్ మంచూరియా రెడీ అయినట్టే.
పావుగంటలో రెడీ
వానలు పడుతూ ఉంటే వేడి వేడి మంచూరియా తింటూ ఉంటే ఆ కిక్కే వేరు ఒక్కసారి మేము చెప్పిన పద్ధతిలో చేసి చూడండి మీకు ఎక్కువ సమయం పట్టదు మీల్ మేకర్లు చాలా త్వరగా డీప్ ఫ్రై అయిపోతాయి అంతేకాదు సొయాతో చేసిన మిల్ మేకర్ ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది ముఖ్యంగా మహిళలు సోయాతో చేసిన మిల్ మేకర్ తినాల్సిన అవసరం ఉంది