ఇదొక్కటి వేస్తే.. ఇడ్లీలు మెత్తగా, టేస్టీగా అవుతాయి
బోండాలు, పూరీల కంటే ఇడ్లీలే మన ఆరోగ్యానికి చాలా మంచివి. ఎందుకంటే వీటిలో నూనె అసలే ఉండదు. అందులోనూ వీటిని పులియబెట్టిన పిండితో తయారుచేస్తారు కాబట్టి ఆరోగ్యం కూడా బేషుగ్గా ఉంటుంది. కాబట్టి ఇడ్లీలను టేస్టీగా, మెత్తగా, స్పాంజిలా ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ప్రతిరోజూ మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో పూరీలు, దోశలు, చపాతీ, ఇడ్లీ, వడ, బోండా ఇలా ఏదో ఒకటి చేసుకుని తింటుంటారు. అయితే చాలా మంది నోటి రుచికి బదులుగా ఆరోగ్యానికి మేలు చేస్తుందనే ఉద్దేశంతో ఇడ్లీలను ఎక్కువగా చేసుకుని తింటుంటారు. నిజానికి ఇడ్లీల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.
కానీ చాలా మందికి వీటిని ఎలా తయారుచేయాలో తెలియదు. దీనివల్ల అవి టేస్ట్ లేకుండా అవుతాయి. అలాగే గట్టిగానో, మరీ పట్టుకుంటే చినిగిపోయే విధంగానో అవుతుంటాయి. దీనివల్లే ఇడ్లీలను చాలా మందికి తినాలనిపించదు. కానీ కొన్ని చిట్కాలను ఇడ్లీలను పర్ఫెక్ట్ గా చేయొచ్చు. వీటిని ఫాలో అయితే మీరు చేసే ఇడ్లీలు సాఫ్ట్ గా, టేస్టీగా అవుతాయి. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
వేడి నీళ్లు
ఇడ్లీలు చేయాలంటే ఇడ్లీ రవ్వను, మినపప్పును నీళ్లలో నాలుగైదు గంటల పాటు నానబెట్టాలి. అయితే పిండి సరైన స్థితిలోకి రావాలంటే ఇడ్లీ రవ్వను కానీ, పప్పును కానీ నార్మల్ వాటర్ కు బదులుగా వేడి నీళ్లలో నానబెట్టండి. దీనివల్ల ఇడ్లీలు సాఫ్ట్ గా వస్తాయి.
ఐస్ క్యూబ్స్
ఐస్ క్యూబ్స్ కూడా ఇడ్లీలు మెత్తగా రావడానికి సహాయపడతాయి. ఇందుకోసం ఇడ్లీ పిండిని గ్రైండ్ చేసేటప్పుడు అందులో నీళ్లను వేయడానికి ఐస్ క్యూబ్స్ ను వేసి గ్రైండ్ చేయండి. దీనివల్ల పిండి చాలా సాఫ్ట్ గా తయారవుతాయి.
ఆముదం నూనె
ఆముదం నూనె కూడా ఇడ్లీలు సాఫ్ట్ గా, మెత్తగా అయ్యేలా చేస్తుంది. ఇందుకోసం గ్రైండ్ చేసుకున్ని ఇడ్లీ పిండిలో కొంచెం ఆముదం నూనెను వేసి పులియబెట్టండి. ఆముదం నూనె వల్ల ఇడ్లీలు బాగా మెత్తగా ఉంటాయి. గట్టి పడనే పడవు. అలాగే టేస్టీగా ఉంటాయి. మీకు తెలుసా? నానబెట్టిన పెసరపప్పును ఎంత ఎక్కువగా గ్రైండ్ చేస్తే ఇడ్లీలు అంత స్పాంజ్ లా వస్తాయి.
మీరు ఇడ్లీ రవ్వతో కాకుండా.. బియ్యంతో ఇడ్లీలను చేసుకోవాలనుకుంటే.. బియ్యాన్ని మినప్పప్పు లా మెత్తగా కాకుండా కొంచెం ముతకగా గ్రైండ్ చేయండి. దీనివల్ల ఇడ్లీలు స్పాంజ్ లా మెత్తగా వస్తాయి. ఇక ఇడ్లీలను ప్లేటులోకి తీసుకోవడానికి ముందు ప్లేటుకు కొంచెం నూనె రాయండి. దీనివల్ల ఇడ్లీలు ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి.