జ్వరం వచ్చినప్పుడు కోడిగుడ్డు తినొచ్చా..? తింటే ఏమౌతుంది?
జ్వరం వచ్చినప్పుడు కోడిగుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిదేనా? ఒకవేళ తింటే ఏమౌతుంది?

కోడిగుడ్డు తింటున్నారా?
కోడిగుడ్డు మన ఆరోగ్యానికి చాలా మంచిది. మన శరీరానికి ప్రోటీన్ చాలా అవసరం. మన ప్రోటీన్ అవసరం తీర్చడంలో కోడిగుడ్డు సహాయపడుతుంది. అందుకే.. చిన్న, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రోజుకి ఒక్క కోడి గుడ్డు అయినా తినాలని వైద్యులు కూడా చెబుతుంటారు. మనకు ఎన్నో ప్రయోజనాలు అందించే కోడి గుడ్డును జ్వరం వచ్చినప్పుడు తినొచ్చా? తింటే ఏమౌతుంది? దీనిగురించి పోషకాహార నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..
జ్వరంతో ఉన్నప్పుడు కోడిగుడ్డు తింటే ఏమౌతుంది?
ఒక గుడ్డులో ఆరు గ్రాముల ప్రోటీన్‌తో సహా అన్ని రకాల పోషకాలు ఉంటాయి.అయినా కూడా వేసవి కాలంలో, జ్వరం వచ్చినప్పుడు గుడ్డుకు దూరంగా ఉండాలని చాలా మంది నమ్ముతుంటారు. వేసవిలో గుడ్లు తినడం వల్ల వాటి కొవ్వు శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీర వేడి పెరుగుతుందని... దాని వల్ల హాని కలుగుతుందని చాలా కాలంగా ఒక అపోహ ఉంది. వేసవిలో గుడ్లు తినడం వల్ల మొటిమలు, కడుపు సమస్యలు వస్తాయని కూడా చాలా మంది నమ్ముతారు. అంతేకాదు.. జ్వరం సమయంలో గుడ్లు తినడం వల్ల శరీరానికి హానికరం అని భావిస్తారు. కానీ.. ఇవి కేవలం అపోహ మాత్రమే. వీటికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.
కోడి గుడ్డులో పోషకాలు..
మనం ప్రతి రోజూ కోడిగుడ్డు తినవచ్చు. ఒకటి కాదు, రోజుకు రెండు గుడ్లు తినడం మంచిది. జ్వరం వచ్చినప్పుడు మాత్రం కోడిగుడ్లను ఉడికించి తినాలి. వాటిలో విటమిన్లు B6, B12, జింక్ ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని , బలాన్ని ఇస్తాయి. గుడ్లు తినడం వల్ల శరీర రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఆమ్లెట్ రూపంలో తినడానికి బదులుగా.. బాగా ఉడికించిన గుడ్లు తినండి.
జ్వరం వచ్చినప్పుడు మన శరీరం బలహీనంగా మారుతుంది. జ్వరం వచ్చినప్పుడు సగం ఉడికించిన, పచ్చి గుడ్లు తినకుండా ఉండండి. దీనివల్ల ప్రేగులలో జీర్ణక్రియ ఇబ్బందికరంగా ఉంటుంది. సాల్మొనెల్లా బ్యాక్టీరియాతో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా ఉంది.
జ్వరం వచ్చినప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
చాలా సంవత్సరాలుగా, జ్వరం వచ్చినప్పుడు కేవలం గంజి , ఇడ్లీలు వంటి సులభంగా జీర్ణమయ్యే ఆహారాలు తీసుకోవాలని మన ఇంట్లో పెద్దలు చెబుతూ ఉండేవారు. కానీ జ్వరం సమయంలో తక్కువ భోజనం, ఎక్కువ కేలరీలు, ఎక్కువ ప్రోటీన్ , ఎక్కువ ద్రవాలు తీసుకోవాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. మీరు జ్వరంతో బాధపడుతుంటే, మీ శరీర రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దాన్ని సరిచేయడానికి, మీరు ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి.