పాలు ఎప్పుడు తాగితే మంచిది?
పాలు మన ఆరోగ్యానికి చాలా మంచివి. పాలను తాగితే ఎముకలు, దంతాలు బలంగా ఉండటంతో పాటుగా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. కానీ చలికాలంలో పాలను ఎలా, ఎప్పుడు తాగితే మంచిదో తెలుసా?
చలికాలం వచ్చిందంటే చాలు.. లేనిపోని అనారోగ్య సమస్యలు చుట్టుముడుతూనే ఉంటాయి. ఎందుకంటే ఈ సీజన్ లో వీచే చల్లని గాలులు మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అందులోనూ ఈ కాలంలో ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గుతుంది. దీంతో దగ్గు, జలుబు, జ్వరం వంటి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.
చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే వెచ్చని దుస్తులను వేసుకోవడంతో పాటుగా హెల్తీ ఫుడ్ ను ఖచ్చితంగా తినాలి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. చలికాలంలో పాలు తాగడం చాలా మంచిది. ఇది మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంచుతుంది.
పాలను పిల్లలే కాదు పెద్దలు కూడా రోజూ తాగొచ్చు. ఇవి ప్రతి ఒక్కరికీ ప్రయోజనకరంగా ఉంటాయి. పాలలో ప్రోటీన్లు, కాల్షియం,పొటాషియం, మెగ్నీషియంతో పాటుగా ఎన్నో రకాల విటమిన్లు మెండుగా ఉంటాయి. ఇవన్నీ మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.
సాధారణంగా చాలామందికి ఉదయాన్నే, రాత్రిపడుకునే ముందు ఒక గ్లాస్ వేడి వేడి పాలను తాగడం అలవాటు. కానీ పాల ప్రయోజనాలను పొందాలంటే మాత్రం వీటిని సరైన పద్దతిలోనే తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే పాలను ఎలా తాగాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
చలికాలంలో పాలు తాగే పద్ధతి
చలికాలంలో పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
- చలికాలంలో క్రమం తప్పకుండా పాలను తాగితే మీ ఎముకలు బలంగా ఉంటాయి.
- అలాగే చలికి తట్టుకునే శక్తి మీ శరీరానికి లభిస్తుంది. ఇది మీ శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. మీ ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది.
- చలికాలంలో పాలను తాగితే మీ జుట్టుకు, చర్మానికి మేలు జరుగుతుంది.
- చలికాలంలో ప్రతిరోజూ పాలు తాగే వారి కండరాలు బాగా పెరుగుతాయి.
- ప్రతిరోజూ వేడి వేడి పాలను తాగితే గొంతు నొప్పి తగ్గుతుంది. అలాగే దగ్గు నయమవుతుంది. అలాగే సీజనల్ వ్యాధులు కూడా తగ్గిపోతాయి.
- అంతేకాదు పాలు మీ జీర్ణ వ్యవస్థను కూడా ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.
చలికాలంలో పాలను ఎప్పుడు తాగాలి?
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. చలికాలంలో పాలను ఉదయం లేదా రాత్రి తాగొచ్చు. కానీ రాత్రిపూట పడుకోవడానికి రెండు మూడు గంటల ముందే తాగాలి.
రోజూ ఉదయం ఒక గ్లాసు వేడి పాలను తాగితే మన శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, శక్తి అందుతాయి. అలాగే పాలు మీ ఆకలిని తగ్గిస్తాయి. ఎందుకంటే పాలు జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. అలాగే రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు వేడి పాలు తాగితే మీకు బాగా నిద్రపడుతుంది. పాలను చలికాలం, ఎండాకాలం అని తేడా లేకుండా ఏ సీజన్ లోనైనా తాగొచ్చు.
చలికాలంలో పాల వినియోగం
చలికాలంలో పాలను ఎలా తాగితే మంచిది?
పాలలో మీరు నల్ల మిరియాలు, పసుపు, లవంగాలు, దాల్చిన చెక్క వంటి మసాలా దినుసులలో ఏదో ఒకదాన్ని మిక్స్ చేసి తాగొచ్చు. ఇది మీ ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది. అలాగే చలికి తట్టుకునే శక్తిని ఇస్తుంది. మీ శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది.