- Home
- Life
- Food
- Fish Pulusu: చిక్కటి గ్రేవీతో స్పైసీ చేపల పులుసు..ఇలా చేశారంటే మూడ్రోజులైనా సరే లాగించేస్తారు!
Fish Pulusu: చిక్కటి గ్రేవీతో స్పైసీ చేపల పులుసు..ఇలా చేశారంటే మూడ్రోజులైనా సరే లాగించేస్తారు!
Fish Pulusu: సండే వచ్చిందంటే నాన్‌వెజ్ ప్రియులకు స్పెషల్ ఉండాల్సిందే. ఈ వర్షాకాలంలో స్పైసీగా గొంతులో పడాల్సిందే. చికెన్, మటన్ కంటే చేపల పులుసు పక్కా పర్ఫెక్ట్. వేడి అన్నంలో అలా కలుపుకుని తింటుంటే.. నోట్లో నీళ్లూరాల్సిందే. మూడ్రోజులైనా టేస్ట్ మారదు.

ఈ వర్షాకాలానికి పక్కా పర్ఫెక్ట్ రెసిపీ చేపల పులుసు
ఆదివారం వచ్చిందంటే స్పైసీ నాన్ వెజ్ ఉండాల్సిందే. ఎప్పుడూ తినే చికెన్, మటన్ కంటే చేపల పులుసు..ఈ వర్షాకాలానికి పక్కా పర్ఫెక్ట్. ఆరోగ్యానికి కూడా మంచిది. వేడి అన్నంలో అలా కలుపుకుని తింటుంటే...నోట్లో నీళ్లూరాల్సిందే. మూడ్రోజులైనా టేస్ట్ మారదు. అయితే చేపల పులుసు రుచిగా రావాలంటే మసాలాల కాంబినేషన్‌తో పాటు వంట చేసే విధానం కూడా చాలా ముఖ్యం. చేపలకు మసాలా బాగా పట్టి, పులుసు చిక్కగా ఉండేలా ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది.
కావాల్సిన పదార్థాలు
చేప ముక్కలు – ½ కిలో, ఉల్లిపాయలు – 2, టమాటాలు – 2, పచ్చిమిర్చి – 3, చింతపండు – చిన్న నిమ్మకాయ సైజులో, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్, కారం – 1½ టేబుల్ స్పూన్లు, పసుపు – ½ టీస్పూన్, ధనియాల పొడి – 1 టీస్పూన్, జీలకర్ర పొడి – ½ టీస్పూన్, మెంతుల పొడి – చిటికెడు, ఉప్పు – తగినంత, నూనె – 4 టేబుల్ స్పూన్లు, కరివేపాకు – 2 రెమ్మలు, కొత్తిమీర – కొద్దిగా
చేపలను ముందుగా ఇలా సిద్ధం చేసుకోవాలి
చేప ముక్కలను శుభ్రంగా కడిగి నీరు పూర్తిగా పోయేలా ఉంచాలి. అందులో కొద్దిగా పసుపు, ఉప్పు వేసి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల చేపలకు రుచి బాగా పడుతుంది, వాసన కూడా తగ్గుతుంది.
చేపల పులుసు తయారీ విధానం
ముందుగా చింతపండును వేడి నీటిలో నానబెట్టి గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మందపాటి గిన్నె లేదా మట్టి పాత్రను స్టవ్‌పై పెట్టి నూనె వేయాలి. నూనె వేడయ్యాక మెంతులు, కరివేపాకు వేసి వేయించాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు మెత్తగా, లేత గోధుమరంగులోకి వచ్చే వరకు వేయించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు కలపాలి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.
ఇప్పుడు కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి. మసాలా నుంచి నూనె పైకి కనిపించే వరకు నెమ్మదిగా వేయించాలి. ఇప్పుడు చింతపండు గుజ్జు, అవసరమైనంత నీరు పోసి పులుసును మరిగించాలి. పులుసు బాగా మరిగిన తర్వాత మాత్రమే చేప ముక్కలను ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వేయాలి.
గరిటెతో ఎక్కువగా కలపకూడదు
చేపలు వేసిన తర్వాత గరిటెతో ఎక్కువగా కలపకూడదు. గిన్నెను చేతులతో మెల్లగా కదుపుతూ పులుసు చేపలకు బాగా పట్టేలా చేయాలి. మూత పెట్టి మీడియం మంటపై సుమారు 10–12 నిమిషాలు ఉడికించాలి. చివరగా చిటికెడు మెంతుల పొడి, కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. తయారైన వెంటనే కాకుండా కనీసం 20–30 నిమిషాలు పక్కన ఉంచితే మసాలా చేపలకు మరింత బాగా పడుతుంది.
మరుసటి రోజుకే టేస్ట్ అదిరిపోద్ది
వేడి వేడి అన్నంలో ఈ చేపల పులుసు, పక్కన ఉల్లిపాయ ముక్కలు పెట్టుకుని తింటే రుచి అదిరిపోతుంది. అంతేకాదు, చేపల పులుసు కొన్ని గంటలు లేదా మరుసటి రోజు ఉంచితే రుచి మరింత బాగా కలుస్తుంది. అప్పటికప్పుడు తినడం కంటే మరుసటి రోజు తింటే ఇంకా అదిరిపోద్ది.

