- Home
- Life
- Food
- Malpua Recipe: తియ్యటి వేడుకలకు అద్భుతమైన స్వీట్ మాల్పువా.. నోట్లో వేసుకుంటే చాలు కరిగిపోతుంది, రెసిపీ ఇదిగో
Malpua Recipe: తియ్యటి వేడుకలకు అద్భుతమైన స్వీట్ మాల్పువా.. నోట్లో వేసుకుంటే చాలు కరిగిపోతుంది, రెసిపీ ఇదిగో
మాల్పువా చూస్తేనే నోరూరిపోతుంది. జ్యూసీగా ఉండే మాల్పువాను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీన్ని సింపుల్‌గా ఎలా తయారు చేయాలో ఇక్కడ రెసిపీ ఇచ్చాము. ఫాలో అయిపోండి.

మాల్పువా స్వీట్
పూరీలా కనిపించే స్వీట్ రెసిపీ మాల్పువా. దీనికి అభిమానులు ఎక్కువ. ఏ స్వీట్ షాపులోనైనా మాల్పువా కనిపించిందంటే నోరూరిపోతుంది. వెంటనే కొని తినేయాలనిపిస్తుంది. అందరూ ఈ స్వీట్ కొనే తెచ్చుకుంటారు. నిజానికి చాలా సింపుల్గా ఇంట్లోనే దీన్ని తయారు చేసుకోవచ్చు. మాల్పువా రెసిపీని ఇక్కడ మేము ఇచ్చాము ఇలా చేసేయండి.
మాల్పువా రెసిపీకి కావలసిన పదార్థాలు
మాల్పువా చేసేందుకు గోధుమ పిండిని వినియోగించవచ్చు. కాబట్టి ఒక కప్పు గోధుమపిండి, ఒక కప్పు పంచదారను పక్కన పెట్టుకోండి. అలాగే బాదం, పిస్తా, జీడిపప్పులు అన్ని కలిపి తరిగి గుప్పెడు తీసి పెట్టుకోండి. రుచికి సరిపడా ఉప్పు, యాలకుల పొడి, ఒక స్పూను నెయ్యి, రెండు స్పూన్లు పెరుగు, రెండు స్పూన్లు బేకింగ్ సోడా తీసి పక్కన పెట్టుకోండి.
మాల్పువా ఇలా తయారు చేయండి
మాల్పువా చేసేందుకు ముందుగా గోధుమ పిండిని ఉండలు లేకుండా జల్లించుకోండి. ఒక గిన్నెలో ఆ గోధుమ పిండిని వేయండి. ఇప్పుడు ఆ పిండిలోనే చిటికెడు ఉప్పు, బేకింగ్ సోడా, పెరుగు, చక్కెర వేసి బాగా కలపండి. తర్వాత నీళ్లు పోసి మెత్తగా కలుపుకోండి. చపాతీకి పిండి ఎంత గట్టిగా కలుపుతారో అంత గట్టిగా కాకుండా జారుడుగా వచ్చేలా కలుపుకోండి. పెనంపై అట్లు పోసేటప్పుడు ఎంత జారుడుతనం ఉంటుందో అలాగే ఇది కూడా ఉండాలి. ఇప్పుడు గోధుమపిండి మిశ్రమాన్ని పక్కన పెట్టేయండి. ఒక అరగంట పాటు అలా వదిలేయండి.
పాకం తీయండి
ఇప్పుడు వేరే ఒక గిన్నె స్టవ్ మీద పెట్టి నీళ్లు పంచదార పోసి పాకం తీయండి. అందులోనే యాలకుల పొడిని కూడా వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి ఈ గోధుమ పిండిని అట్టులాగా వేసుకోండి. రెండు వైపులా బాగా కాల్చుకోండి. దాని రంగు ముదురు రంగులోకి వచ్చే వరకు కాల్చాలి. లేదా గోధుమపిండి మిశ్రమాన్ని పూరీ పిండి లాగా మెత్తగా కలుపుకొని పూరీల్లా ఒత్తుకొని నూనెలో వేయించిన సరిపోతుంది. అలా కాల్చిన గోధుమపిండి అట్లు లేదా పూరీలను తీసి పంచదార పాకంలో వేయండి. ఆ పాకాన్ని అవి బాగా పీల్చుకుంటాయి. ఆ తర్వాత పైన తరిగిన బాదం పప్పులు, పిస్తాలు, జీడిపప్పులు వేయండి. అంతే మాల్పువా రెడీ అయిపోతుంది.
కోవా ముద్దతో
కోవా ముద్దతో మాల్పువాను మరింత టేస్టీగా మార్చుకోవచ్చు. మాల్పువాపై కొంచెం కోవా ముద్దను చల్లి పైన పిస్తాలు, జీడిపప్పులు, బాదం పప్పులు వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. దీని వాసన కూడా చాలా బాగుంటుంది. అయితే డయాబెటిస్ రోగులు మాత్రం తినకూడదు. దీనిలో చక్కెర కంటెంట్ చాలా అధికం. నిజానికి డయాబెటిస్ రోగులు మాత్రమే కాదు.. సాధారణ ప్రజలు కూడా మాల్పువాను ఎంత తక్కువగా తింటే అంత మంచిది. ఎందుకంటే చక్కెర కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో ఇన్ఫ్లమేషన్ ని పెంచేస్తుంది. చక్కెర ఎంత తక్కువ తింటే అంత మంచిది. అప్పుడప్పుడు వేడుకల సమయంలో మాల్పువాను చేసుకుంటే రోజుల్లో ఒకటి లేదా రెండు కన్నా ఎక్కువ తినకపోవడమే మంచిది.