Paneer Sweet: పనీర్‌తో ఇలా బర్ఫీ స్వీ ట్ చేశారంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగో
పనీర్‌తో చాలా టేస్టీ స్వీట్ చేయవచ్చు. అందులో పనీర్ బర్ఫీ ఒకటి. దీన్ని వండడం చాలా సులువు. అరగంటలో ఇది సిద్ధమైపోతుంది. రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

పనీర్ స్వీట్ రెసిపీ
పనీర్ పేరు చెబితే పనీర్ బిర్యానీ, పనీర్ బటర్ మసాలా, పాలక్ పనీర్ వంటి కూరలే గుర్తొస్తాయి. నిజానికి పనీరుతో టేస్టీ స్వీట్లు కూడా తయారు చేయొచ్చు. కేవలం అరగంటలోనే పనీర్ బర్ఫీని తయారు చేయవచ్చు. ఇంటికి అతిధులు వచ్చినప్పుడు ఈ పనీర్ బర్ఫీ రెసిపీని వడ్డించండి. అందరికీ ఇది కచ్చితంగా నచ్చుతుంది. బయట నుంచి కొన్న స్వీట్లు కన్నా ఇలా ఇంట్లోనే పనీర్ బర్ఫీని చేసుకుని తింటే టేస్టీగానూ, సంతృప్తిగానూ ఉంటుంది.
పనీర్ బర్ఫీకి కావలసిన పదార్థాలు
పనీర్ బర్ఫీని చేసేందుకు తురిమిన పనీర్ 400 గ్రాములు అవసరం పడుతుంది. అలాగే పాలపొడి, అర కప్పు కండెన్స్ డ్ మిల్క్ 300 గ్రాములు, ఫుల్ క్రీమ్ పాలు, అరకప్పు యాలకుల పొడి, చిటికెడు చక్కెర పావు కప్పు సిద్ధం చేసుకోవాలి.
ఇలా చేయండి
స్టవ్ మీద కళాయి పెట్టి పాలు వేయండి. మీడియం మంట మీద మరిగించండి. అది బాగా మరిగిన తరువాత తురిమిన పనీర్ అందులో వేసి కలుపుతూ ఉండండి. చిన్న మంట మీద ఈ పనీరు పాలల్లో కలిసిపోయి బాగా ఉడుకుంది. అది చిక్కబడే వరకు కొన్ని నిమిషాల పాటు అలా ఉడికించండి. ఇప్పుడు కండెన్స్డ్ మిల్క్‌ని కూడా అందులో వేసి బాగా కలపండి. ఆ తర్వాత పాలపొడి, చక్కెర, యాలకుల పొడి కూడా వేసి బాగా కలపండి
ఫ్రిజ్ లో పెట్టి
ఈ మొత్తం మిశ్రమం గడ్డలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇది చిక్కగా, దగ్గరగా హల్వా లాగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఒక ప్లేట్ ని తీసుకొని అడుగున నెయ్యిని రాయండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఆ ప్లేట్ పై వేసి కాస్త చల్లారనివ్వండి. అది గోరువెచ్చగా మారాక చేతికి కొంచెం నెయ్యి రాసుకొని మందంగా ప్లేట్ మొత్తం ఆవరించేలా చేయండి. ఇప్పుడు దాన్ని అరగంట పాటు ఫ్రిజ్‌లో వదిలేయండి. తర్వాత దాన్ని బయటకు తీసి పైన పిస్తా పప్పును చల్లుకోండి. ముక్కలుగా కట్ చేసి గాలి చొరబడిన కంటైనర్లో నిల్వ చేయండి. అంతే పనీర్ బర్ఫీ రెడీ అయినట్టే. ఇది చాలా టేస్టీగా ఉంటుంది.
పండుగల స్పెషల్ స్వీట్
పనీర్ తో చేసే వంటకాలలో ఇది ఎంతో అద్భుతమైనది. పైగా దీపావళి, దసరా వంటి వేడుకలలో ఈ పనీర్ స్వీటు టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కూడా ఇది బాగా నచ్చుతుంది. కావాలనుకుంటే మీరు పంచదారకు బదులు బెల్లాన్ని కూడా ప్రయత్నించవచ్చు. బెల్లం వేయడం వల్ల స్వీట్ రంగు మారిపోతుంది. కానీ పోషకాలు మాత్రం పెరుగుతాయి. మీకు ఏది అందుబాటులో ఉంటే దానితో ఈ పనీర్ బర్ఫీని తయారు చేయవచ్చు.