ఈ 5 రకాల వంట నూనెలు మంచివి కావు.. వీటితో వంట అస్సలు చేయకండి
మన రోజువారి ఆహారంలో నూనె ఒక ముఖ్యమైన భాగం. నూనె లేనిదే ఏ కూరా చేయలేం. కానీ రుచితో పాటుగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం మనం ఏ వంటనూనెలను ఉపయోగిస్తున్నామనేది చూసుకోవాలంటారు డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు.

కూరలు చేయాలంటే ఖచ్చితంగా నూనె అవసరం. వంట నూనె లేకుండా ఏం చేయలేం. నిజానికి వంటనూనె ఆహారాల్ని రుచిగా చేయడమే కాకుండా మన శరీరానికి కూడా అవసరమైన శక్తిని అందించడానికి సహాయపడుతుంది. అయితే ఒక్కొక్కరు ఒక్కోరకమైన నూనెలను వాడుతుంటారు. కానీ ఏవి మంచివి? ఏవి చెడువి? అని మాత్రం తెలుసుకోరు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కొన్ని రకాల నూనెలు మనల్ని ఎన్నో జబ్బుల బారిన పడేస్తాయి. అందుకే ఇలాంటి నూనెలను వాడకూడదని చెప్తారు. అసలు ఎలాంటి నూనెలను వాడకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఏ వంట నూనెలను వాడకూడదు
రిఫైన్డ్ ఆయిల్
శుద్ధి చేసిన వంట నూనెను చాలా మంది ఉపయోగిస్తుంటారు. ఇవి మంచివని అనుకుంటారు. కానీ ఇవి మన ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. ఎందుకంటే వీటిలో ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అంటే ఈ నూనెను వాడటం వల్ల ఊబకాయం, బరువు విపరీతంగా పెరిగిపోవడం, గుండె జబ్బులు, డయాబెటీస్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుందని డాక్టర్లు చెప్తున్నారు.
హైడ్రోజనేటెడ్ నూనెలు
హైడ్రోజనేటెడ్ నూనెలు కూడా ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. నిజానికి ఈ నూనెను తయారు చేయడానికి హైడ్రోజన్ వాయువును ఉపయోగిస్తారు. అంటే ఈ నూనె తక్కువ ఉష్ణోగ్రతల వద్ద కూడా ఘనంగా ఉంటుంది. అలాగే దీనిని ఎన్నో ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటమ్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే ఈహైడ్రోజనేటెడ్ ఆయిల్ మన శరీరంలో కొలెస్ట్రాల్ ను బాగా పెంచుతుంది. అలాగే గుండె సంబంధిత వ్యాధులొచ్చే ప్రమాదాన్ని కూడా పెంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
cooking oil
పామాయిల్
పామాయిల్ కూడా మంచిది కాదు. ఎందుకంటే దీనిలో సంతృప్త కొవ్వు ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దీనిని వాడటం వల్ల గుండె జబ్బులొచ్చే ప్రమాదం బాగా పెరుగుతుంది. అలాగే ఈ నూనె ఉత్పత్తిని పెంచడానికి అడవులను నరికేసి పర్యావరణానికి హాని కలిగిస్తున్నారు.
వెజిటబుల్ ఆయిల్
కూరగాయల నూనెను చాలా మంది ఉపయోగిస్తుంటారు. కానీ దీనిని వంట చేయడానికి అస్సలు ఉపయోగించకూడదని నిపుణులు చెబుతున్నారు. నిజానికి ఈ నూనె ఎన్నో రకాల నూనెల మిశ్రమం. దీనిలో సోయాబీన్ నూనె, మొక్కజొన్న నూనె, పొద్దుతిరుగుడు నూనె ఉంటాయి. ఈ నూనెల్లో ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కానీ ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు మాత్రం తక్కువగా ఉంటాయి. కానీ మన శరీరానికి ఒమేగా -6, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాల సరైన నిష్పత్తే అవసరం. కానీ ఇవి అసమతుల్యతంగా ఉండటం వల్ల మనకు శరీర మంటతో పాటుగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి.
వేరుశెనగ నూనె
వేరుశెనగ నూనె నూనె కూడా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వీటిలో సంతృప్త కొవ్వు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇది మనకు గుండె జబ్బులొచ్చే ప్రమాదాన్ని బాగా పెంచుతుంది. అంతేకాదు వేరుశెనగ నూనె వల్ల కూడా అలర్జీలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.