- Home
- Feature
- World population day: నువ్వు పుట్టకపోయుంటే ఈ భూమికి ఎంత మంచి జరిగేదో తెలుసా.? అసలు సమస్య ఏంటంటే..
World population day: నువ్వు పుట్టకపోయుంటే ఈ భూమికి ఎంత మంచి జరిగేదో తెలుసా.? అసలు సమస్య ఏంటంటే..
ప్రపంచవ్యాప్తంగా భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని దేశాల్లో జనాభా పెరుగుదల ఇబ్బందిగా మారుతుంటే, మరికొన్ని దేశాల్లో జననాలు లేకపోవడం సమస్యగా మారుతోంది. నేడు అంతర్జాతీయ జనాభా దినోత్సవం సందర్భంగా ఆసక్తికరమైన కథనం మీకోసం.

జనాభా తగ్గితేనే పర్యావరణానికి మంచిదా.?
సౌకర్యాల పేరుతో మనం చేస్తున్న కార్యకలాపాలు ప్రకృతిని, జీవవైవిధ్యాన్ని అతి వేగంగా ధ్వంసం చేస్తున్నాయి. ఇవి సహజమైన పరిణామ క్రమం కంటే 100 నుంచి 1000 రెట్లు వేగంగా జరిగిపోతున్నాయి. వనరుల దుర్వినియోగం, చెట్ల నరికివేత, సముద్రాలు కలుషితం కావడం, నేల దెబ్బతినడం, గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో మంచు కరిగిపోతుండడం ఇవన్నీ మన భూమికి ముప్పుగా మారుతున్నాయి.
మనుషుల కారణంగా జరిగిన జీవవైవిధ్య నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి మిలియన్ల సంవత్సరాలు పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. డైనోసార్లు అంతరించిపోయిన సమయంలో కంటే కూడా ఇప్పుడు మూడు రెట్లు ఎక్కువగా జీవజాతులు అంతరించిపోతున్నాయని వారు హెచ్చరిస్తున్నారు.
జనాభా ఎక్కడ పెరుగుతోంది.?
ప్రస్తుత జనాభా 8 బిలియన్లు దాటింది. 2050 నాటికి 9.6 బిలియన్లు, 2100 నాటికి 11.1 బిలియన్లు అవుతుందని అంచనాలు ఉన్నాయి. అయితే అభివృద్ధి చెందిన దేశాల్లో పిల్లల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ముఖ్యంగా మహిళలు ఉద్యోగాలపై దృష్టి పెట్టడం, విద్య, రుణ భారం వంటి అంశాల వల్ల మిల్లెనియల్స్ తక్కువ పిల్లలకే మొగ్గు చూపుతున్నారు. కానీ అభివృద్ధి చెందుతున్న దేశాలు ముఖ్యంగా చైనా, భారతదేశం వంటి పెద్ద జనాభా కలిగిన దేశాలు జనాభా పెరుగుదలకు ప్రధాన కారణమవుతున్నాయి.
జనాభాను కంట్రోల్ చేయడమే పరిష్కారామా.?
2017లో వెలువడిన ఒక అధ్యయనం ప్రకారం అభివృద్ధి చెందిన దేశాల్లో ఒక బిడ్డ భూమిపైకి రాకపోతే ఏడాదికి 58 టన్నుల కార్బన్ ఉద్గారం తగ్గించవచ్చని తేలింది. అంటే ఒక వ్యక్తికి అవసరమయ్యే ఆహారం, విద్యుత్ వినియోగం వంటివి తగ్గుతాయని అర్థం. అయితే ఇది ఒక్క దేశానికి మాత్రమే పరిమితం కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సమానంగా పాటిస్తే ప్రభావం ఉంటుందని నిపుణులు అంటున్నారు.
జనాభా తగ్గితే ఏం జరుగుతుంది.?
అయితే జనాభా తగ్గడం అనేది అంత సులభంగా జరగదని నిపుణులు అంటున్నారు. అదే విధంగా పరిసరాలను ప్రేమించే వారు లేకపోతే, ప్రకృతిని పరిరక్షించే విలువలను తదుపరి తరాలకు చేర్చే వారు ఉండరని, దీంతో పర్యావరణ బాధ్యత తగ్గుతుందని అభిప్రాయపడుతున్నారు. ఇది భూమికి అంత మంచిది కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే జనాభా పెరుగుదల చివరికి పర్యావరణ విపత్తుకు కారణమవుతుందని ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ స్టీఫెన్ డోవర్స్, కాన్‌బెర్రా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ కాలిన్ బట్లర్ తమ నివేదికలో తెలిపారు.
అంతేకాకుండా కొత్తగా జన్మించే వారు లేకపోతే వృద్ధుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉంటుంది. దీంతో ఆ దేశం వర్క్ ఫోర్స్ తగ్గుతుంది. పని చేసే వారి సంఖ్య తగ్గి, పెన్షన్లపై ఆధారపడే వారి సంఖ్య ఎక్కువైతే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయనే వాదన కూడా ఉంది. జపాన్‌లో ప్రస్తుతం ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు.
జనాభా మాత్రమే సమస్య కాదు
అయితే జనాభా ఎంత ఉందన్నది ముఖ్యం కాదని ఆ జనాభా వనరులను ఎలా ఉపయోగిస్తుందనేది ముఖ్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో జీవనశైలి కారణంగా ఒక్కో వ్యక్తి పరంగా చాలా ఎక్కువ వనరులు ఖర్చవుతున్నాయి. ఇతర దేశాల్లో ఇది తక్కువగా ఉంది.
ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలు వ్యక్తిగతంగా తక్కువ వనరులు వాడే మార్గాలను అమలు చేస్తూ 4.7 - 5 హెక్టార్లలో తమ అవసరాలను తీరుస్తున్నాయి. అయితే ఖతార్ వంటి దేశాల్లో ఇది 15.7 హెక్టార్లుగా ఉంది.

