- Home
- Feature
- Peacock: ఎన్నో పక్షులు ఉండగా మనదేశ జాతీయ పక్షిగా నెమలినే ఎందుకు ఎంపిక చేశారు? ఎవరు ఎంపిక చేశారు?
Peacock: ఎన్నో పక్షులు ఉండగా మనదేశ జాతీయ పక్షిగా నెమలినే ఎందుకు ఎంపిక చేశారు? ఎవరు ఎంపిక చేశారు?
Peacock: భారతదేశ జాతీయ పక్షి నెమలి. అయితే మనదేశంలో వందలకొద్దీ పక్షులు ఉండగా నెమలినే ఎందుకు ఎంపిక చేశారు? ఈ నిర్ణయం ఎప్పుడు తీసుకున్నారు? ఇలాంటి ఆసక్తికరమైన అంశాల గురించి ఇక్కడ చదివేయండి.

జాతీయ పక్షిగా నెమలి ఎందుకు?
భారతదేశంలో ఎన్నో రకాల పక్షులు ఉన్నాయి. ఒక్కో పక్షికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అయితే దేశంలోని పక్షులన్నింటిలో నెమలికి మాత్రం ప్రత్యేక స్థానం ఉంది. అందుకే మన జాతీయ పక్షిగా నెమలిని ఎంచుకున్నారు. వర్షం పడే సమయంలో రంగురంగుల ఈకలను విప్పి నాట్యం చేసే నెమలిని చూస్తే ఎవరైనా ముగ్ధులవుతారు. అయితే అందం ఒక్కటే నెమలిని జాతీయ పక్షిగా ఎంపిక చేయడానికి కారణం కాదు. దీని వెనుక చారిత్రక, సాంస్కృతిక కారణాలు కూడా ఉన్నాయి. 1961లో భారత వన్యప్రాణి బోర్డు జాతీయ పక్షి ఎంపికపై చర్చించింది. ఈ సమయంలో నెమలితో పాటు సారస్ కొంగ, హంస, బ్రాహ్మణీ గద్ద, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ వంటి పక్షుల పేర్లు కూడా పరిశీలనకు వచ్చాయి. చివరకు 1963 ఫిబ్రవరి 1న భారత ప్రభుత్వం నెమలిని అధికారికంగా జాతీయ పక్షిగా ప్రకటించింది.
దేశమంతటా కనిపించే పక్షి
నెమలిని ఎంపిక చేయడానికి ప్రధాన కారణాల్లో దేశవ్యాప్తంగా దాని ఉనికి. జమ్మూకశ్మీర్ నుంచి తమిళనాడు, కేరళ వరకు, అసోం సహా దేశంలోని చాలా ప్రాంతాల్లో నెమళ్లు కనిపిస్తాయి. అంటే ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా దేశంలోని చాలా ప్రాంతాల ప్రజలకు ఈ పక్షి పరిచయమే. జాతీయ పక్షిగా ఎంపిక చేసే పక్షి అందరికీ తెలిసి ఉండాలనే నిబంధనకు నెమలి సరిపోయింది. మరో ముఖ్యమైన కారణం భారతీయ సంస్కృతితో దానికి ఉన్న అనుబంధం. శ్రీకృష్ణుడి తలపై నెమలి పింఛం కనిపిస్తుంది. అలాగే కుమారస్వామి వాహనంగా కూడా నెమలికి గుర్తింపు ఉంది. మన పురాణాలు, చిత్రకళ, ఆలయాల శిల్పాల్లో నెమలికి ప్రత్యేక స్థానం ఉంది. అందం, గౌరవం, శుభానికి గుర్తుగా కూడా నెమలిని భావిస్తారు.
ప్రత్యేక గుర్తింపు తెచ్చిన రూపం
నెమలిని జాతీయ పక్షిగా ఎంచుకోవడానికి మరో కారణం దాని ప్రత్యేక రూపం. తలపై ఉండే అందమైన కలికి, పొడవైన రంగురంగుల ఈకలు దానికి ప్రత్యేక గుర్తింపును ఇస్తాయి. ప్రభుత్వ పత్రాలు, తపాలా బిళ్లలు, అధికారిక గుర్తుల్లో నెమలి బొమ్మను సులభంగా చూపించవచ్చు. దూరం నుంచి చూసినా ఇది నెమలి అని గుర్తుపట్టడం సులువు. ఆ సమయంలో ఇతర పెద్ద దేశాలు నెమలిని జాతీయ పక్షిగా ప్రకటించకపోవడం కూడా భారత్కు ప్రత్యేక గుర్తింపును ఇచ్చింది. ఇలా అందం, దేశవ్యాప్త ఉనికి, భారతీయ సంప్రదాయాలతో అనుబంధం, ప్రత్యేక రూపం వంటి కారణాలు నెమలిని జాతీయ పక్షిగా నిలబెట్టాయి. ప్రస్తుతం నెమలి వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద రక్షణ పొందుతోంది. దానిని వేటాడటం, చంపడం చట్టరీత్యా నేరం.















