- Home
- Feature
- Hyderabad : హైదరాబాద్ ను పట్నం, సికింద్రాబాద్ ను లష్కర్ అని ఎందుకంటారు? ఈ పేర్ల వెనక ఇంత హిస్టరీ ఉందా..!
Hyderabad : హైదరాబాద్ ను పట్నం, సికింద్రాబాద్ ను లష్కర్ అని ఎందుకంటారు? ఈ పేర్ల వెనక ఇంత హిస్టరీ ఉందా..!
తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, సికింద్రాబాద్ పేర్లు విననివారు ఉండరు... ఈ జంట నగరాలు కోట్లాదిమందికి ఆశ్రయం కల్పిస్తున్నాయి. అయితే ఒకప్పుడు హైదరాబాద్ ను పట్నం, సికింద్రబాద్ ను లష్కర్ అనేవారు... ఈ పేర్ల వెనకున్న హిస్టరీ గురించి తెలుసుకుందాం.

పట్నం, లష్కర్ పేర్ల వెనక ఇంట్రెస్టింగ్ హిస్టరీ
హైదరాబాద్ (Hyderabad), సికింద్రాబాద్ (Secunderabad)... ప్రస్తుతం ఈ రెండు ప్రాంతాలు కలిసిపోయి ఒకే మహానగరంగా కనిపిస్తాయి. నగరం ఒక వైపు నుంచి మరో వైపుకు వెళ్లేవారికి ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రత్యేకమైన తేడా కూడా కనిపించకపోవచ్చు… కానీ ఒకప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేది. చార్మినార్, గోల్కొండ, పురానాపూల్ వంటి ప్రాంతాలతో విస్తరించిన హైదరాబాద్‌కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది. మరోవైపు బ్రిటిష్ సైనిక స్థావరాలు, కంటోన్మెంట్ ప్రాంతంగా అభివృద్ధి చెందిన సికింద్రాబాద్‌కు మరో ప్రత్యేకమైన చరిత్ర ఉండేది. అందుకే పాతతరం వారు హైదరాబాద్‌ను ‘పట్నం’, సికింద్రాబాద్‌ను ‘లష్కర్’ అని పిలిచేవారు. ఈ రెండు పేర్ల వెనుక హైదరాబాద్ నగర చరిత్రతో ముడిపడిన ఆసక్తికరమైన కథ ఉంది.
హైదరాబాద్‌ను ‘పట్నం’ అని ఎందుకు పిలిచేవారు?
గతంలో పెద్ద నగరం లేదా పట్టణాన్ని సూచించడానికి తెలుగు ప్రజలు ‘పట్నం’ అనే పదాన్ని ఉపయోగించేవారు... పట్టణం అనే పదమే తెలంగాణ యాసలో 'పట్నం' అన్నమాట. శతాబ్దాల క్రితమే హైదరాబాద్ నగరం ఏర్పడింది... దక్షిణ భారతదేశంలో ఒక ముఖ్యమైన నగరంగా అభివృద్ధి చెందడంతో స్థానికులు దీన్ని ‘పట్నం’ అని పిలిచేవారు. ముఖ్యంగా సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో నివసించే పాతతరం ప్రజలు హైదరాబాద్ వైపు వెళ్లడాన్ని ‘పట్నం పోతున్నా’ అనేవారు.
అప్పటి హైదరాబాద్ నగర జీవితం, వ్యాపార కేంద్రాలు, రాజకుటుంబానికి సంబంధించిన ప్రాంతాలు, బజార్లు, పురాతన కట్టడాలు వంటి అంశాలు దానికి ప్రత్యేకమైన నగర స్వరూపాన్ని ఇచ్చాయి. దీంతో హైదరాబాద్‌ను ప్రత్యేకంగా గుర్తించేందుకు ‘పట్నం’ అనే మాట వాడుకలో ఉండేది. ఇప్పటికీ తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో పెద్ద నగరాన్ని సూచించడానికి ఈ పదాన్నే ఉపయోగిస్తారు.
సికింద్రాబాద్‌ను ‘లష్కర్’ అని ఎందుకు అనేవారు?
హైదరాబాద్ ను 'పట్నం' అన్నట్లే సికింద్రాబాద్ ను ‘లష్కర్’ అనేవారు. ఇప్పటికీ కొన్ని సందర్భాల్లో ఈ ప్రాంతాన్ని లష్కర్ గానే పేర్కొంటారు... ఉదాహరణకు లష్కర్ బోనాలు. అయితే ఈ లష్కర్ పేరు వెనుక ఆసక్తికరం అర్థం ఉంది. ఉర్దూ-పర్షియన్ భాషలో లష్కర్ అంటే సైన్యం లేదా సైనిక శిబిరం అనే అర్థం ఉంది.
బ్రిటిష్ పాలన కాలంలో సికింద్రాబాద్ ప్రాంతం ప్రధానంగా సైనిక స్థావరాలు, కంటోన్మెంట్ కార్యకలాపాలతో అభివృద్ధి చెందింది. బ్రిటిష్ సైన్యానికి సంబంధించిన బలగాలు ఇక్కడ ఉండటంతో ఈ ప్రాంతాన్ని ‘లష్కర్’గా పిలిచే సంప్రదాయం ఏర్పడింది. ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో నివసించేవారు సికింద్రాబాద్ వైపు వెళ్లాలంటే 'లష్కర్ కు పోతున్నా' అనేవారు... కాలక్రమేణా ఈ పేరు బాగా పాపులర్ అయ్యింది.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతం కేవలం సైనిక శిబిరాలతో మాత్రమే కాకుండా సైనికులకు అవసరమైన నివాసాలు, కార్యాలయాలు, శిక్షణా ప్రదేశాలు, రవాణా సదుపాయాలు వంటి అనేక వ్యవస్థలతో క్రమంగా విస్తరించింది. అందువల్ల సికింద్రాబాద్ పేరు వినగానే సైనిక స్థావరాల ప్రాంతం అనే గుర్తింపు ఏర్పడింది... దీన్నే ఉర్దూ మాట్లాడే ప్రజలు లష్కర్ అనేవారు.
సులభంగా చెప్పాలంటే....
హైదరాబాద్ = పట్నం → పెద్ద నగరం అనే అర్థంలో ప్రజల వాడుకలో వచ్చిన పేరు
సికింద్రాబాద్ = లష్కర్ → సైనిక స్థావరాలు ఉన్న ప్రాంతం అనే గుర్తింపుతో వచ్చిన పేరు
పేర్లలోనే ఈ నగర చరిత్ర దాగివుందిగా..!
నేడు హైదరాబాద్, సికింద్రాబాద్ ఒక్కటైపోయి జంట నగరాలుగా గుర్తింపు పొందాయి... కానీ వాటి చారిత్రక నేపథ్యాలు మాత్రం ప్రత్యేకమైనవి. ఒకవైపు హైదరాబాద్ నగర జీవనం, వాణిజ్యం, రాజరిక సంస్కృతికి కేంద్రంగా ఎదిగితే... మరోవైపు సికింద్రాబాద్ బ్రిటిష్ సైనిక స్థావరాలు, కంటోన్మెంట్ వ్యవస్థ చుట్టూ అభివృద్ధి చెందింది. అందుకే పాతతరం ప్రజల నోట హైదరాబాద్ అంటే ‘పట్నం’, సికింద్రాబాద్ అంటే ‘లష్కర్’ అనే పేర్లు వినిపించేవి.
పట్నం, లష్కర్ అనేవి కేవలం ముద్దుపేర్లు కావు.. నగరం ఎలా అభివృద్ధి చెందిందో, ఏ ప్రాంతానికి ఎలాంటి చారిత్రక నేపథ్యం ఉందో చెప్పే గుర్తులు. కాలంతో పాటు ఈ నగరం మహానగరంగా మారినా... పాత పేర్లు, స్థానిక కథలు, రహదారులు, ప్రాంతాల పేర్ల రూపంలో ఆ చరిత్రలోని ఆనవాళ్లు ఇప్పటికీ కనిపిస్తూనే ఉన్నాయి. తెలుగు ప్రజలకు పూర్వ వైభవాన్ని తెలియజేస్తూనే ఉన్నాయి.

