DMart: అన్నీ వస్తువులు దొరికే డీమార్ట్‌లో చీరలు మాత్రం ఎందుకు అమ్మరు? అసలు నిజం ఇదే
DMart: మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ డీమార్ట్ లో ఉన్న క్రేజ్ వేరు. అన్ని రకాల సరుకులు అక్కడ తక్కువ ధరకే దొరుకుతుంటాయి. డీమార్ట్ లో అన్ని వస్తువులు అమ్ముతారు కానీ ఆడవారికి ఎంతో ఇష్టమైన చీరలు ఎందుకు అమ్మరు. సీక్రెట్ తెలిస్తే షాక్ అవుతారు.
డీమార్ట్ లో చీరలు ఎందుకు అమ్మరు..
ఇండియాలో మధ్యతరగతి కుటుంబాలకు నిత్యావసర సరుకులు, కిరాణా సామాగ్రి నుంచి బట్టలు, ప్లాస్టిక్ వస్తువుల వరకు తక్కువ ధరకే లభించే అతిపెద్ద రిటైల్ నెట్వర్క్ డీమార్ట్ (DMart). బడ్జెట్ ధరల్లో క్వాలిటీ వస్తువులను అందించడం వల్ల ప్రతి నెలా డీమార్ట్‌కు వెళ్లేవారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. అయితే, డీమార్ట్‌లో ఆడవారి, మగవారి బట్టలతో పాటు పిల్లల దుస్తులు, చెప్పులు, కుర్తీలు, నైటీలు, లెగ్గింగ్స్, టీ-షర్టులు వంటివన్నీ లభిస్తాయి కానీ, లేడీస్ ఎంతగానో ఇష్టపడే చీరలు (Sarees) మాత్రం దొరకవు ఎందుకని? డీమార్ట్‌లో చీరల ర్యాకులు అసలు కనిపించవు. దీని వెనుక ఒక బలమైన రిటైల్ బిజినెస్ స్ట్రాటజీ ఉంది.
డీమార్ట్ విజయ రహస్యం "హై ఇన్వెంటరీ టర్నోవర్" (High Inventory Turnover) పై ఆధారపడి ఉంటుంది. అంటే, షెల్ఫ్‌లో పెట్టిన స్టాక్ ఎంత స్పీడ్ గా అమ్ముడై క్యాష్‌గా మారితే, కంపెనీకి అంత లాభం చేకూరుతుంది. సరుకులు, టీ-షర్టులు, కుర్తీలు వంటివి కస్టమర్లు వెంట వెంటనే సెలెక్ట్ చేసుకుని కొనేస్తుంటారు. కానీ చీరలు అలా కాదు.. ఒక చీర అమ్ముడవ్వడానికి కొన్ని వారాలు లేదా నెలల సమయం కూడా పట్టవచ్చు.
సెల్ఫ్ సర్వీస్ సాధ్యం కాదు..
డీమార్ట్ ప్రధానంగా 'సెల్ఫ్ సర్వీస్' (Self Service) సూత్రంపై నడుస్తుంది. అంటే కస్టమర్లే స్వయంగా తమకు నచ్చిన వస్తువును ట్రాలీలో వేసుకుంటారు. కానీ చీరల షాపింగ్ అలా కుదరదు కదా. చీరలను మడతలు విప్పి చూడాలి, కలర్ చెక్ చేసుకోవడం, మ్యాచింగ్స్, లాంటివి ఉంటాయి. దీనికోసం ప్రత్యేకంగా చీరలు విప్పి చూపించే సేల్స్ స్టాఫ్ (Sales Staff) ఉండాలి, ఆ తర్వాత వాటిని మళ్లీ నలగకుండా మడతపెట్టాలి. ఇదంతా చాలా టైమ్ తీసుకునే పని. డీమార్ట్ లాంటి ఉరుకుల.. పరుగుల షాపింగ్ లో అది సాధ్యం కాదు.
స్టాక్ మిగిలిపోయే ప్రమాదం
చీరల్లో వందల రకాల క్లాత్‌లు, డిజైన్లు, రంగులు చాలా ఆప్షన్స్ ఉంటాయి. అంతే కాదు మారుతున్న ఫ్యాషన్ ట్రెండ్స్ కు తగ్గట్టు కొత్త స్ట్రాక్ తీసుకురావాలి. ఒక సీజన్లో నడిచిన ట్రెండ్ మరుసటి సీజన్‌కు పాతబడిపోతుంది. అమ్ముడవకుండా మిగిలిపోయే దుస్తుల వల్ల వచ్చే నష్టాన్ని (Dead Stock) డీమార్ట్ భరించడానికి సిద్ధంగా ఉండదు.
అంతే కాదు రిటైల్ వ్యాపారంలో ప్రతీ చదరపు అడుగు స్థలానికి ప్రత్యేక విలువ ఉంటుంది. చీరల విభాగానికి ఎక్కువ డిస్ప్లే స్పేస్, కస్టమర్లు నిలబడి చూడటానికి ఎక్కువ స్థలం అవసరమవుతుంది. ఆ స్థలంలో వేగంగా అమ్ముడయ్యే ఇతర నిత్యావసర ఉత్పత్తులను ఉంచితే డీమార్ట్‌కు ఎక్కువ ఆదాయం వస్తుంది. ఏ వ్యాపారంలోనైనా ఏం అమ్మాలి అనేదాని కంటే, తమ బిజినెస్ మోడల్‌కు సరిపడని వస్తువును ధైర్యంగా పక్కన పెట్టడమే విజయాన్ని అందిస్తుంది. డీమార్ట్ కూడా తన స్పేస్, టైమ్ - లాజిస్టిక్స్ మేనేజ్మెంట్కు సెట్ అవ్వని కారణంగానే చీరల అమ్మకాలకు దూరంగా ఉంటుంది.

