- Home
- Entertainment
- Movie Reviews
- Abbayigaru Movie Review: కృష్ణ మనసుపడ్డ సినిమా.. వెంకటేష్ చేతికి ఎలా వెళ్లింది, అబ్బాయిగారు మూవీ రివ్యూ
Abbayigaru Movie Review: కృష్ణ మనసుపడ్డ సినిమా.. వెంకటేష్ చేతికి ఎలా వెళ్లింది, అబ్బాయిగారు మూవీ రివ్యూ
Abbayigaru Movie Review: టాలీవుడ్ ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే కుటుంబ కథా చిత్రాలలో 'అబ్బాయిగారు' (Abbayigaru) ఒకటి. విక్టరీ వెంకటేష్, మీనా జంటగా, ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

'అబ్బాయిగారు' సినిమా వెనుక అసలు కథ ?
అబ్బాయిగారు సినిమా కథ వెనుక ఒక పెద్ద ఇండస్ట్రీ బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఉంది. ఈ సినిమా తమిళంలో కె. భాగ్యరాజ్ నటించి, దర్శకత్వం వహించిన సూపర్ హిట్ సినిమా 'ఎంగా చిన్న రాజా' (Enga Chinna Rasa)కి రీమేక్. ఇందులో భాగ్యరాజా సరసన రాధ నటించారు. ఈ సినిమాను హిందీలో అనిల్ కపూర్, మాధురీ దీక్షిత్ జంటగా ‘బేట’ పేరుతో ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేశారు. ‘బేట’ ఘన విజయం సాధించడమే కాకుండా 1992లో బాలీవుడ్ హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఈ మూవీని కన్నడలో కూడా తెరకెక్కించారు. కాగా తెలుగులో ఈమూవీపై సూపర్ స్టార్ కృష్ణ మనసు పడ్డార.
మదర్ సెంటిమెంట్ నచ్చి తెలుగులో ఈ రీమేక్ హక్కులను టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ తీసుకున్నారు. ఆ సమయంలో కృష్ణతో ఈ సినిమాను తెరకెక్కించడానికి సన్నాహాలు కూడా జరిగాయి. అయితే, పద్మాలయ బ్యానర్‌పై రీమేక్ చేయాలని అనుకున్నారు కృష్ణ. ఇందులో తల్లి పాత్రకు సీనియర్ నటి వాణిశ్రీనీ సంప్రదించారు. అయితే గతంలో నటి, దర్శకురాలు విజయ నిర్మలతో ఏర్పడిన వివాదం కారణంగా హీరో కృష్ణతో సినిమా అనగానే వాణిశ్రీ అంగీకరించలేదు. దాంతో కృష్ణ రెండు మూడు ప్రయత్నాలు చేశారు. కానీ ప్రతీసారి ఏదో ఒక ప్రాబ్లమ్ క్రియేట్ అవుతుండటంతో.. ఇక ఈమూవీని పక్కన పెట్టేశారు.
ఆ తర్వాత ఈ కథ వెంకటేష్ కు బాగా నచ్చింది. అప్పటికే ప్రముఖ నిర్మాత ఎం. నరసింహారావు (రాశి మూవీస్) చేతికి ఈ సినిమా రైట్స్ వెళ్లడం.. చంటి సినిమాతో మంచి దూకుడు మీద ఉన్న వెంకటేష్ తో ఈమూవీ చేయాలని నిర్ణయంచుకున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్‌లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న వెంకటేష్ ఇమేజ్‌కు తగినట్లుగా.. అందులో మార్పులు చేర్పులు చేశారు. అమ్మ పాత్రను చాలా పవర్ ఫుల్ గా మార్చారు, కాస్త సెంటిమెంట్ డ్రామాను పెంచి, కామెడీ డోస్ ను ఎక్కువగా కలిపి కొత్త కథను తయారు చేసుకుని సెట్స్ మీదకు వెళ్లారు దర్శకుడు ఇ.వి.వి. సత్యనారాయణ .
అబ్బాయిగారు కథ విషయానికి వస్తే..
దొరబాబు (వెంకటేష్) ఒక పెద్ద జమీందారు (నూతన్ ప్రసాద్) గారి ముద్దుల కొడుకు. చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో మాతృమూర్తి ప్రేమకు దూరమవుతాడు. కొడుకు పడుతున్న బాధను చూసి తండ్రి.. నాగమణి (జయచిత్ర) అనే మహిళను రెండో పెళ్లి చేసుకుంటాడు. అయితే, ఆ సవతి తల్లి పైకి బాగానే ఉన్నట్లు నటిస్తూ, దొరబాబును అమాయకుడిగా, చదువు లేనివాడిగా ఉంచి ఆస్తి మొత్తం కాజేయాలని కుట్ర పన్నుతుంది.
తనను కన్నతల్లిలా చూసుకుంటున్న సవతి తల్లే సర్వస్వమని నమ్ముతాడు దొరబాబు. ఈ క్రమంలో సుధ (మీనా)ను ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకువస్తాడు దొరబాబు. కోడలుగా అడుగుపెట్టిన సుధ, సవతి తల్లి నాగమణి అసలు మోసపూరిత కుటుంబాన్ని, ఆమె ఆస్తి కుట్రలను ఎలా పసిగట్టింది? తన భర్తను, మామను ఆ రాక్షస వలయం నుంచి ఎలా కాపాడుకుంది? చివరికి దొరబాబుకు నిజం ఎలా తెలిసింది? అనేదే ఈ చిత్రంలోని ఎమోషనల్ స్టోరీ.
నటీనటుల అభినయం
దొరబాబు పాత్రలో వెంకటేష్ జీవించేశారు. అమాయకత్వం, తల్లిపై అమితమైన ప్రేమ, భార్య పట్ల బాధ్యత కలిగిన భర్తగా ఆయన నటన కంటతడి పెట్టిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్లలో వెంకటేష్ డైలాగ్స్ మనసును తాకుతాయి. ఇక యాక్షన్ సీన్స్, రొమాంటిక్స్ సీన్స్ లో వెంకీ రెచ్చిపోయారు. హీరోయిన్ మీనా విషయానికి వస్తే.. సుధ పాత్రలో మీనా అద్భుతంగా నటించారు. కేవలం అందమే కాకుండా, సమయస్ఫూర్తితో కుటుంబం కోసం పోరాడే ఇంటెలిజెంట్ భార్యగా ఆమె పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. అందానికి అందం.. నటనకు నటన మీనాకు ఈసినిమాతో మంచి పేరు వచ్చింది.
జయచిత్ర పాత్ర చాలా ప్రత్యేకం..
ఈ సినిమాలో వెంకటేష్, మీనాకు ఎంత అద్భుతమైన పాత్రలు పడ్డాయో.. అంతకు మించి స్క్రీన్ స్పేస్, యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్ర దక్కింది జయచిత్రకు. దొరబాబు సవతి తల్లి నాగమణి పాత్రలో జయచిత్ర నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఆమె విలనిజం సినిమాకు బలాన్నిచ్చింది. ఆమె భర్త పాత్రలో నూతన ప్రసాద్ కూడా జీవించారు. ఇక కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, బాబు మోహన్, కామెడీ సినిమాను నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లిందని చెప్పాలి. తదితరుల కామెడీ ట్రాక్ సినిమాకు మంచి రిలీఫ్‌ను ఇస్తుంది.
సినిమాకు బలంగా నిలిచిన సంగీతం..
దర్శకత్వం: ఇ.వి.వి. సత్యనారాయణ కేవలం కామెడీ సినిమాలే కాకుండా, ఇంతటి బలమైన సెంటిమెంట్, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాను కూడా ఎంత అద్భుతంగా తీయగలరో ఈ సినిమా నిరూపించింది. ఎం.ఎం. కీరవాణి అందించిన సంగీతం ఈ సినిమా విజయానికి ప్రధాన కారణం. "కూసింది కోయిలమ్మ", "నీ తస్సదియ్య", "ఓ కన్నె పువ్వా", "అమ్మా అమ్మా మాయమ్మా" వంటి పాటలు ఇప్పటికీ శ్రోతలను అలరిస్తూనే ఉన్నాయి. దివంగత జంధ్యాల గారు అందించిన మాటలు సినిమాలోని ఎమోషన్స్ ను మరింత బలంగా ప్రేక్షకులకు చేర్చాయి.
ప్లస్ పాయింట్స్ (Strengths)
వెంకటేష్ - మీనా మధ్య వచ్చే కెమిస్ట్రీ, లవ్ ట్రాక్.
కీరవాణి అందించిన అద్భుతమైన పాటలు - నేపథ్య సంగీతం.
అత్తాకోడళ్ల మధ్య డైలాగ్స్, అమ్మ సెంటిమెంట్
పల్లెటూరి వాతావరణం, కుటుంబ విలువలతో కూడిన స్క్రీన్ ప్లే.
మైనస్ పాయింట్స్ (Weaknesses)
సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు,
రెగ్యులర్ తెలుగు సినిమాల ఫార్ములా
ఫైనల్ గా
'అబ్బాయిగారు' కేవలం ఒక కమర్షియల్ సినిమా మాత్రమే కాదు, చక్కటి కుటుంబ విలువలు, అనుబంధాలు, అమ్మ ప్రేమ కోసం తపించే ఒక అమాయక కొడుకు కథ. వెంకటేష్ నటన, ఇ.వి.వి. దర్శకత్వ ప్రతిభ, కీరవాణి సంగీతం ఈ చిత్రాన్ని ఒక క్లాసిక్ ఫ్యామిలీ డ్రామాగా నిలబెట్టాయి. ఎప్పుడైనా కుటుంబంతో కలిసి చూడదగ్గ అరుదైన చిత్రాలలో ఇది ఒకటి. ఈ మూవీ చూడాలి అనుకుంటున్నారా.. అయితే యూట్యూబ్ లో అందుబాటులోనే ఉంది.

