Dogs : కుక్క కరిస్తేనే కాదు... ఇలా కూడా రేబిస్ వ్యాధి సోకుతుందా? తస్మాత్ జాగ్రత్త
రేబిస్ వ్యాధి కుక్కలు కరవడం వల్ల వస్తుందని మనందరికీ తెెలుసు. అయితే కేవలం కుక్కకాటే కాదు మరికొన్ని కారణాలతో కూడా రేబిస్ వస్తుందట… వాటిగురించి తెలుసుకుందాం.

రేబిస్ వ్యాధి ఎలా వస్తుంది?
కుక్క కరిస్తేనే రేబిస్ వ్యాధి వస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో కుక్క కరవకపోయినా ఈ ప్రాణాంతక వ్యాధి సోకే ప్రమాదం ఉంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో రెండేళ్ల చిన్నారి రేబిస్ తో మరణించాడు. అతడిని కుక్క కరవలేదు... కానీ రేబిస్ ఎలా సోకింది అనేదానిపై డాక్టర్లు అనేక టెస్టులు చేశారు. చివరికి చిన్నారి ముఖంపై ఉన్న గాయాన్ని ఓ వీధికుక్క నాకడంవల్ల ఈ వ్యాధి సోకిందని తేలింది.
ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. కుక్క కాటు లేకుండానే వైరస్ సోకడంపై తీవ్ర చర్చకు దారితీసింది. ఈ క్రమంలో అసలు రేబిస్ వ్యాధి ఎలా సోకుతుంది? కుక్క కరవడం వళ్లనే కాకుండా ఇంకెన్ని రకాలుగా ఇది వ్యాపించే ప్రమాదం ఉంటుంది? ఈ వ్యాధి భారినపడితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
కుక్క కరవకపోయినా రేబిస్ వస్తుందా?
రేబిస్ అనేది వైరస్ వల్ల వచ్చే తీవ్రమైన అంటువ్యాధి. సాధారణంగా కుక్క కాటు ద్వారా ఈ వైరస్ మనుషులకు వ్యాపిస్తుంది. అయితే వైరస్ ఉన్న జంతువు లాలాజలం నేరుగా గాయాలు, చర్మంపై పగుళ్లు లేదా కళ్లు, ముక్కు, నోటి లోపలి తేమతో కూడిన పొరలకు తగిలినా ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంటుంది. అందుకే కుక్క కరవలేదనే కారణంతో రేబిస్ ముప్పు లేదని నిర్లక్ష్యం చేయకూడదు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మార్గదర్శకాల ప్రకారం... అనుమానాస్పద జంతువు లాలాజలం తెరిచి ఉన్న గాయానికి లేదా శ్లేష్మ పొరలకు తగలడం కూడా ప్రమాదకరంగానే పరిగణిస్తారు. ఇలాంటి సందర్భాల్లో వెంటనే వైద్యులను సంప్రదించి అవసరమైన చికిత్స తీసుకోవాలి.
గాయాన్ని కుక్క నాకినా ప్రమాదమేనా?
చర్మంపై గాయం ఉన్నప్పుడు దానిని కుక్క నాకితే జాగ్రత్తగా వ్యవహరించాలి. కుక్కకు రేబిస్ ఉంటే, దాని లాలాజలంలో వైరస్ ఉండే అవకాశం ఉంది. ఆ లాలాజలం తెరిచి ఉన్న గాయం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తే వ్యాధి సోకవచ్చు. చిన్నపిల్లలకు ముఖం, చేతులు, కాళ్లపై గాయాలు ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలు జరిగే అవకాశాన్ని తక్కువగా అంచనా వేయకూడదు.
అయితే కుక్క నాకిన ప్రతిసారీ రేబిస్ వస్తుందని కాదు. చర్మం ఎక్కడా దెబ్బతినకుండా, లాలాజలం కేవలం సాధారణ చర్మంపై మాత్రమే పడితే సాధారణంగా రేబిస్ ప్రమాదం ఉండదు. కానీ గాయం ఉందా లేదా, లాలాజలం కళ్లకు లేదా నోటికి తగిలిందా వంటి అంశాలను వైద్యులు పరిశీలించి ప్రమాద స్థాయిని నిర్ణయిస్తారు.
రేబిస్ సోకితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి?
రేబిస్ వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత లక్షణాలు కనిపించడానికి సాధారణంగా కొన్ని వారాల నుంచి కొన్ని నెలల వరకు సమయం పట్టవచ్చు. ఈ వ్యవధి వ్యక్తిని బట్టి మారుతుంది. ప్రారంభంలో జ్వరం, తలనొప్పి, నీరసం వంటి సాధారణ లక్షణాలు కనిపించవచ్చు. వైరస్ నాడీ వ్యవస్థపై ప్రభావం చూపడం ప్రారంభించిన తర్వాత ఆందోళన, గందరగోళం, మింగడంలో ఇబ్బంది, నీటిని చూసినప్పుడు లేదా తాగడానికి ప్రయత్నించినప్పుడు తీవ్రమైన సమస్యలు వంటి లక్షణాలు రావచ్చు.
ఒకసారి వ్యాధి లక్షణాలు ప్రారంభమైతే రేబిస్ దాదాపు ఎల్లప్పుడూ ప్రాణాంతకంగా మారుతుంది. అందుకే లక్షణాల కోసం వేచి చూడకుండా, అనుమానాస్పద జంతువు కాటు వేసినా, గాయాన్ని నాకినా లేదా లాలాజలం కళ్లకు, నోటికి తగిలినా వెంటనే వైద్య సహాయం పొందడం అత్యంత ముఖ్యం.
కుక్క నాకినా లేదా కరిచినా వెంటనే ఏం చేయాలి?
కుక్క లేదా రేబిస్ అనుమానం ఉన్న ఇతర జంతువు కరిచినా, గాయం ఉన్న చోట నాకినా వెంటనే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.
గాయాన్ని శుభ్రంగా కడగాలి : సబ్బు, ప్రవహించే నీటితో కనీసం 15 నిమిషాల పాటు గాయాన్ని శుభ్రంగా కడగాలి.
కళ్లకు, నోటికి కుక్కల లాలాజలం తగిలితే : వీలైనంత త్వరగా శుభ్రమైన నీటితో కడిగి వైద్య సహాయం పొందాలి.
వైద్యులను సంప్రదించాలి : రేబిస్ వ్యాక్సిన్ అవసరమా, రేబిస్ ఇమ్యూనోగ్లోబులిన్ ఇవ్వాలా అనే విషయాలను వైద్యులు నిర్ణయిస్తారు.
చికిత్స ఆలస్యం చేయకూడదు : గాయం చిన్నదిగా ఉన్నా, రక్తం రాకపోయినా లేదా కుక్క కరవకపోయినా ప్రమాదకరమైన సంపర్కం జరిగితే నిర్లక్ష్యం చేయకూడదు.
రేబిస్‌ను నివారించడంలో గాయాన్ని వెంటనే శుభ్రం చేయడం, అవసరమైన వ్యాక్సిన్ తీసుకోవడం, వైద్యుల సూచనల ప్రకారం ఇతర చికిత్సలు పొందడం కీలకం.
పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి
చిన్నపిల్లలు వీధికుక్కలతో ఆడుకోవడం, వాటిని దగ్గరకు తీసుకోవడం, ముఖంపై నాకించుకోవడం వంటివి చేస్తుంటారు. అందువల్ల పిల్లలకు గాయాలు ఉన్నప్పుడు జంతువులు వాటిని నాకకుండా జాగ్రత్తపడాలి. పెంపుడు జంతువులకు కూడా పశువైద్యుల సూచనల ప్రకారం రేబిస్ టీకాలు వేయించాలి. పిల్లలను జంతువులతో ఆడుకునే సమయంలో పర్యవేక్షించడం మంచిది.
రేబిస్ వ్యాధి కుక్కకాటు వల్ల మాత్రమే కాదు.. సోకిన జంతువు లాలాజలం తెరిచి ఉన్న గాయం లేదా కళ్ల, ముక్కు, నోటి లోపలి పొరలకు తగిలినా వ్యాపించవచ్చు. కాబట్టి అనుమానం ఉంటే రేబిస్ లక్షణాలు కనిపించే వరకు వేచి చూడకుండా వెంటనే వైద్య సహాయం పొందాలి. సకాలంలో సరైన చికిత్స తీసుకోవడం ప్రాణాలను కాపాడుతుంది.

