SnakeBite: పాము కరిచిన చోట నోటితో విషం పీల్చవచ్చా? అలా చేస్తే ఏమవుతుంది?
SnakeBite: పాము కరిచిన వెంటనే కొందరు ఏం చేయాలో తెలియక నోటితో విషం లాగడానికి ప్రయత్నిస్తుంటారు. ఇలా చేయడం మంచిదేనా? నోటితో విషం పీల్చడం వల్ల ఏం జరుగుతుంది. వైద్య నిపుణులు ఏమంటున్నారు?

పాము కరిచిన చోట నోటితో విషం పీల్చవచ్చా?
చిన్న తనం నుంచి సినిమాలు, టీవీలలో పాము కరిచిన వెంటనే నోటితో ఆ విషాన్ని పీల్చి బయటకు ఉమ్మివేయడం చూస్తుంటాం. నిజ జీవితంలో కూడా చాలామంది ఈ పద్దతిని పాటిస్తుంటారు. పాము కరిచి ప్రమాదంలో ఉన్న వ్యక్తిని రక్షించాలనే ఆరాటంతో చాలామంది ఇలా చేస్తుంటారు. కానీ నోటితో పాము విషాన్ని పీల్చడం మంచిదేనా అంటే.. అది అత్యంత ప్రమాదకరమని అంటున్నారు వైద్య నిపుణులు. ఈ ప్రక్రియ ఏమాత్రం సురక్షితం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు.
నోటితో విషం పీల్చితే ఏం జరుగుతుంది?
సాధారణంగా మన నోటి లోపల, చిగుళ్ల వద్ద కంటికి కనపడని చిన్న చిన్న చీలికలు, అల్సర్ గాయాలు ఉండే అవకాశం ఉంటుంది. కాటు వేసిన చోట నోటితో విషాన్ని పీల్చినప్పుడు, ఆ విషం నోటిలోని గాయాల ద్వారా నేరుగా వ్యక్తి రక్తంలోకి చేరుకుంటుంది. దీనివల్ల బాధితుడితో పాటు విషం పీల్చిన వ్యక్తి కూడా తీవ్రమైన విషప్రభావానికి (Envenoming) గురై ప్రాణాలకే ప్రమాదం వ్చే అవకాశం ఉంది.
మనుషుల నోటిలో కోట్లాది సూక్ష్మజీవులు (బ్యాక్టీరియా) ఉంటాయి. విషాన్ని పీల్చే క్రమంలో నోటిలోని బ్యాక్టీరియా పాము కాటు వేసిన గాయంలోకి ప్రవేశించి, ఆ భాగాన్ని ఇన్ఫెక్షన్కు గురిచేస్తుంది. దీనివల్ల కణజాలం (Tissue) దెబ్బతిని, బాధితుడి పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారే అవకాశం ఉంది. అంతే కాదు పాము కాటు వేసిన క్షణాల్లోనే దాని విషం చర్మం కింద ఉన్న రక్తనాళాల ద్వారా కణజాలాల్లోకి చాలా స్పీడ్ గా వ్యాపిస్తుంది. నోటితో పీల్చడం వల్ల శరీరంలోకి వెళ్లిన విషంలో 1 శాతం కూడా బయటకు రాదు. పైగా, గాయాన్ని నొక్కడం లేదా నోటితో పీల్చడం వల్ల రక్తప్రసరణ వేగవంతమై విషం శరీరమంతటా మరింత త్వరగా పాకుతుంది.
చేయకూడని పొరపాట్లు
చాలామంది పాము కరవగానే నోటితో విషం పీల్చడమే కాకుండా.. మరికొన్ని పొరపాట్లు చేసి ప్రాణాల మీదకు తెస్తుంటారు. పాము కరిచిన చోట గాయాన్ని బ్లేడుతో కానీ కత్తితో కోస్తుంటారు. ఇలా కోయడం వల్ల తీవ్ర రక్తస్రావం జరిగి, నరాలు దెబ్బతింటాయి. అంతే కాదు మరికొంత మంది గాయం ఉన్న చోట గట్టిగా తాడుతో కడుతుంటారు. అలా కట్టడం వల్ల ఆ భాగంలో రక్తప్రసరణ ఆగిపోయి, అవయవాన్ని తొలగించాల్సిన (Amputation) పరిస్థితి రావచ్చు. మరికొంత మంది పసరు మందులు వాడుతుంటారు. ఇది ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని మరింతగా పెంచుతుంది.
పాము కరిస్తే వెంటనే ఏం చేయాలి?
పాము కరిచిన వెంటనే కంగారు పడకూడదు. బాధితుడు భయపడితే గుండె వేగం పెరిగి విషం వేగంగా వ్యాపిస్తుంది. కాబట్టి పేషంట్ ని ప్రశాంతంగా ఉంచాలి. కరిచిన భాగాన్ని కదలకుండా ఉంచాలి. ఆ భాగాన్ని గుండె కంటే పైన ఉండేలా చూసుకోవాలి. వాపు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే ఉంగరాలు, వాచ్ లు, టైట్ గా ఉంటే బట్టలను కూడా వెంటనే తీసివేయాలి.
ఆలస్యం చేయకుండా వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లి, సరియైన 'యాంటీవీనమ్' (Antivenom) ఇంజెక్షన్ ఇప్పించడమే బాధితుడి ప్రాణాలను కాపాడే ఏకైక, సురక్షితమైన మార్గం. పాత పద్దతులు, పసరు మందులు, అంటూ టైమ్ వేస్ట్ చేయకుండా బాధితుడికి వెంటనే వైద్య సహాయం అందేలా చూడాలి.

