Parrots: చిలుకకు రామచిలుక అనే పేరు ఎలా వచ్చింది? అవి మనుషుల్లా ఎలా మాట్లాడగలవు?
Parrots: ఈ ప్రపంచంలో ఎన్నో రకాల పక్షులు ఉన్నాయి... కానీ అన్ని పక్షుల్లో చిలుకలు మాత్రమే ఎలా మాట్లాడగలుగుతున్నాయి. వాటికి రామచిలుక అన్న పేరు ఎలా వచ్చింది? ఇంట్లో పెంచుకునే చిలుక మాటలు ఎలా పలుకగలుగుతుంది. దాని వెనుక ఉన్నరహస్యం ఏంటి?

ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన పక్షి
మనిషి మాట్లాడిన మాటలను వింటూ వాటిని అచ్చం అలాగే అనుకరించే పక్షుల్లో రామచిలుకు ఒకటి. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు రామచిలుకు మాటలు వినడానికి ఎంతో ఆసక్తి చూపిస్తారు. కొన్నిసార్లు మనం పలికే పదాలను, వాక్యాలను కూడా స్పష్టంగా తిరిగి పలుకుతుంది. అసలు రామచిలుకు మనిషిలా ఎలా మాట్లాడగలుగుతుంది? దాని శరీరంలో ఉన్న ప్రత్యేకత ఏమిటి?
ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన పక్షులలో రామచిలుక ఒకటి. పచ్చని శరీరం, ఎర్రని వంకర ముక్కు, ఆకాశంలో మెరుపులా ఎగిరే రెక్కలతో ఇవి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. మనుషుల మాటలను అనుకరించే సామర్థ్యం వీటికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. అయితే, కేవలం అందమైన పక్షిగానే కాకుండా, ఈ చిన్న జీవి జీవితంలో ఎన్నో కష్టనష్టాలు, కుటుంబ బంధాలు, ప్రాణాలతో సాగే నిత్య పోరాటాలు ఉంటాయి.
రామచిలుక పేరు ఎలా వచ్చింది?
ఈ విషంంలో చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. రామ' అనగా అందమైన, రమ్యమైన లేదా రమింపజేసే అని అర్థం. ఆకుపచ్చ రంగులో నీలం కలిసిన రంగును 'రామ రంగు' అంటారు. అందమైన మాటలతో అలరించడం వల్ల వీటికి ఈ పేరు వచ్చిందట. మరోక విధంగా చెప్పుకుంటే.. శ్రీరాముడు ఏకపత్నీవ్రతుడు కావడం, సీతాదేవిపై ఆయన చూపిన అంకితభావం లాగే.. రామచిలుక కూడా తన జీవితంలో కేవలం ఒకే భాగస్వామితో ఉంటుంది. జీవితాంతం తోడు వీడకుండా ఉండే ఈ స్వభావం కారణంగా దీనిని రాముడితో పోల్చి రామచిలుక అని పిలుస్తారని అంటుంటారు.
రామచిలుక గొంతులోని అసలు రహస్యం!
రామచిలుక మనుషులు మాట్లాడటానికి గొంతులో ఉండే స్వరపేటిక (Larynx), స్వరతంత్రులు (Vocal Cords) ఉపయోగపడతాయి. కానీ పక్షులకు మనుషుల్లాంటి స్వరతంత్రులు ఉండవు. వాటి శరీరంలో సిరింక్స్ (Syrinx) అనే ప్రత్యేకమైన ధ్వని ఉత్పత్తి అవయవం ఉంటుంది. ఇది శ్వాసనాళం చివర, ఊపిరితిత్తుల దగ్గర ఉంటుంది.
రామచిలుకు శ్వాస తీసుకున్నప్పుడు గాలి సిరింక్స్ మీదుగా ప్రవహిస్తుంది. అప్పుడు అక్కడ కంపనాలు ఏర్పడి శబ్దం వస్తుంది. ఈ శబ్దాన్ని గొంతు, నోరు, నాలుక కదలికలతో మార్చుకుంటూ మనుషులు మాట్లాడే పదాల్లాంటి శబ్దాలను పలుకుతుంది. ముఖ్యంగా రామచిలుకకు ఉండే బలమైన, కండరాలతో కూడిన నాలుక శబ్దాలను అనుకరించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
మన మాటలను ఎలా నేర్చుకుంటుంది?
రామచిలుకలు వినికిడి ద్వారా శబ్దాలను నేర్చుకునే సామర్థ్యం కలిగిన పక్షులు. వీటిని Vocal Learners అంటారు. మనం పదేపదే మాట్లాడే మాటలను శ్రద్ధగా వింటాయి. వాటిని గుర్తుంచుకుని తిరిగి పలకడానికి ప్రయత్నిస్తాయి. ముఖ్యంగా ఇంట్లో మనుషులతో ఎక్కువ సమయం గడిపే రామచిలుకలు మన మాటలను త్వరగా అనుకరించగలవు.
ఆదర్శ దంపతులు..
రామచిలుక జీవితం సాధారణంగా ఒక చెట్టు లోపల ఉండే సురక్షితమైన రంధ్రంలో, గూడులో ప్రారంభమవుతుంది. ఆడ చిలుక గుడ్లు పెట్టిన తర్వాత వాటిని వెచ్చగా ఉంచడానికి ఎక్కువ సమయం గూడులోనే గడుపుతుంది. ఈ సమయంలో మగపక్షి బయటకు వెళ్లి ఆహారాన్ని సేకరించి తీసుకొస్తుంది. కొన్ని వారాల తర్వాత గుడ్డు పెంకును పగలగొట్టుకుని ఒక చిన్న చిట్టి ప్రాణం బయటకు వస్తుంది.
పుట్టిన వెంటనే ఈ పిల్లలు చాలా బలహీనంగా ఉంటాయి. ఇవి స్వయంగా ఎగరలేవు, ఆహారం వెతుక్కోలేవు . ఆ సమయంలో తల్లిదండ్రుల సంరక్షణే వీటికి రక్షణ కల్పిస్తుంది. రోజులు గడుస్తున్న కొద్దీ వాటి శరీరాలపై ఈకలు రావడం మొదలై, క్రమంగా అందమైన పచ్చని రెక్కలు విస్తరిస్తాయి. మన మనుషుల మాదిరిగానే రామచిలుక దంపతులు తమ పిల్లలను రక్షించుకుంటాయి.





