- Home
- Feature
- Banana: మనం తినే అరటిపండు డూప్లికేట్ అని తెలుసా? ఆ విధ్వంసం వల్ల 1950లోనే నాశనమైన ఒరిజినల్ అరటి
Banana: మనం తినే అరటిపండు డూప్లికేట్ అని తెలుసా? ఆ విధ్వంసం వల్ల 1950లోనే నాశనమైన ఒరిజినల్ అరటి
ఇప్పుడు మనం తింటున్న అరటి పండ్లు, మార్కెట్ లో దొరికేవి ఒరిజినల్ అరటి పండ్లు కాదు. ఒరిజినల్ అరటి 76 ఏళ్ళ క్రితమే ఓ విధ్వంసంలో నాశనం అయింది. ఆ వివరాలు ఇవిగో.

మనం తింటున్న అరటిపండు అసలైనది కాదు!
మనం ప్రతిరోజూ మార్కెట్‌లో కొనుక్కుని తినే అరటిపండ్ల గురించి ఓ ఆసక్తికరమైన విషయం ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా సాగవుతున్న కావెండిష్ రకం అరటిచెట్లు విత్తనాల ద్వారా కాకుండా, పిలకల ద్వారా ఒకే మాతృచెట్టు జన్యు లక్షణాలను కొనసాగిస్తూ పెరుగుతాయి. ఇవి ఒరిజినల్ రకం అరటి కాదు. ఒరిజినల్ అరటి 76 ఏళ్ళ క్రితమే విధ్వంసంలో నాశనం అయింది. 1950ల కంటే ముందు ప్రపంచ మార్కెట్‌లో గ్రోస్ మిచెల్ లేదా బిగ్ మైక్ అనే రకం అరటిపండ్లకు భారీ ఆదరణ ఉండేది. అవి ఇప్పుడు మనం తినే అరటిపండ్ల కంటే పెద్దగా, మందమైన తొక్కతో, ఎక్కువ తీపి, ప్రత్యేకమైన సువాసనతో ఉండేవి.
ఒక ఫంగస్ దెబ్బకు కనుమరుగైన గ్రోస్ మిచెల్
1950ల సమయంలో గ్రోస్ మిచెల్ అరటి తోటలకు పనామా డిసీజ్ రూపంలో భారీ ముప్పు ఎదురైంది. ఫ్యూసేరియం ఆక్సిస్పోరమ్ రేస్ 1 అనే ఫంగస్ సెంట్రల్ అమెరికాలోని అరటి తోటలకు వ్యాపించింది. ఈ ఫంగస్ మొక్కల వేళ్ల ద్వారా లోపలికి ప్రవేశించి, నీరు, పోషకాలు అందించే వ్యవస్థను దెబ్బతీస్తుంది. దీంతో చెట్లు క్రమంగా వాడిపోయి చనిపోతాయి. ఈ వ్యాధి ఒక్కసారి నేలలోకి ప్రవేశిస్తే దశాబ్దాల పాటు అక్కడే జీవించగలదు. సాధారణ రసాయనాలు, శిలీంద్రనాశక మందులతో దీనిని పూర్తిగా నియంత్రించడం కష్టమైంది. ఒకే రకమైన అరటిచెట్లను పెద్ద ఎత్తున సాగు చేయడం వల్ల వ్యాధి వేగంగా విస్తరించింది. ఫలితంగా 1960ల నాటికి గ్రోస్ మిచెల్ సాగు వాణిజ్యపరంగా భారీగా దెబ్బతింది. ఒకప్పుడు ప్రపంచ మార్కెట్‌ను ఏలిన ఈ రకం స్థానాన్ని మరో అరటి రకం భర్తీ చేయాల్సి వచ్చింది.
గ్రోస్ మిచెల్ స్థానంలోకి కావెండిష్
గ్రోస్ మిచెల్ సాగు దెబ్బతినడంతో అరటి పరిశ్రమ ప్రత్యామ్నాయ రకం కోసం అన్వేషించింది. అప్పుడు ఇంగ్లాండ్‌లోని ఒక గ్రీన్‌హౌస్‌లో పెరుగుతున్న కావెండిష్ రకం అరటిపై దృష్టి పడింది. పనామా డిసీజ్‌కు కారణమైన రేస్ 1 ఫంగస్‌ను తట్టుకునే సామర్థ్యం ఉండటంతో ఈ రకం సాగుకు అనుకూలంగా మారింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా గ్రోస్ మిచెల్ స్థానంలో కావెండిష్ అరటిచెట్ల సాగు పెరిగింది. రుచి విషయంలో గ్రోస్ మిచెల్‌తో పోలిస్తే కావెండిష్‌కు కొన్ని తేడాలు ఉన్నాయి. ఇది అంత తీపిగా ఉండదు. దీని తొక్క కూడా పలుచగా ఉండటంతో త్వరగా నల్లబడుతుంది. అయినప్పటికీ వ్యాధిని తట్టుకునే లక్షణం కారణంగా వాణిజ్యపరంగా విస్తృతంగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్‌లో లభించే అరటిపండ్లలో కావెండిష్ రకానిదే ప్రధాన వాటా.
కావెండిష్‌కూ పొంచి ఉన్న ట్రోపికల్ రేస్ 4 ముప్పు
ఇప్పుడు కావెండిష్ అరటిపంటకు కూడా కొత్త ప్రమాదం ఎదురవుతోంది. ట్రోపికల్ రేస్ 4 లేదా టీఆర్4 అనే ఫ్యూసేరియం ఫంగస్ రకం ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియాలోని కావెండిష్ తోటలకు వ్యాపిస్తోంది. గతంలో గ్రోస్ మిచెల్‌ను దెబ్బతీసిన ఫంగస్‌తో పోలిస్తే ఇది మరింత ప్రమాదకరమైనదిగా మారింది. కావెండిష్ రకం కూడా ఈ వ్యాధి బారిన పడుతోంది. దీనిని అరటి పరిశ్రమ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. గ్రోస్ మిచెల్ రకం అరటి టేస్ట్ లో కావెండిష్ కంటే ఎన్నో రేట్లు గొప్ప. గ్రోస్ మిచెల్ రుచి కావెండిష్ కి లేదు. అలాగని కంగారు పడాల్సిన అవసరం లేదు.. పోషకాలతో మాత్రం రెండూ దాదాపుగా సమానం అని నిపుణులు చెబుతున్నారు.





