Tripod Fish: ఈత కొట్టడం రాని వింత చేప... మహాసముద్రంలో ఎలా బ్రతుకుతుందో తెలుసా?
Tripod Fish: నీటిలో ఈదే చేపలను చూసి మురిపోతుంటాము.. సముద్రాలు, నదులలో చిన్న చేపల నుంచి తిమింగలాల వరకు ఈత కొడుతూనే బ్రతుకుతుంటాయి. కానీ ఈదటం రాని వింత చేప గురించి మీకు తెలుసా? చేపకు ఈత రాకపోతే అది నీటిలో ఎలా బ్రతుకుతుంది?

సముద్ర గర్భంలో వింత చేప..
సముద్రంలో ఎన్నో అంతుచిక్కని రహస్యాలు, వింత జీవులు కోట్లలో ఉన్నాయి. చిన్న చందమామ చేపల దగ్గర నుంచి తిమింగలాల వరకు సముద్రంలో బ్రతుకుతున్నాయి. కప్పలు, రొయ్యలు, పీతలు, ఆక్టోపస్ లు.. ఆల్ చిప్పలు, నత్తలు.. ఇవి మాత్రమే కాదు మనకు తెలియని లక్షల జలచరాలు జీవనం సాగిస్తున్నాయి. అందులో కొన్ని వింత జీవులు కూడా ఉంటాయి. అలాంటి వింత జీవులలో అత్యంత ఆశ్చర్యకరమైన ప్రత్యేకమైన చేప 'ట్రైపాడ్ ఫిష్' (Tripod Fish). సముద్రపు అడుగున ఉండే నిశ్శబ్ద చీకటి లోతుల్లో జీవించే ఈ చేప గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
ట్రైపాడ్ ఫిష్ ప్రత్యేకతలు:
సాధారణంగా చేపలన్నీ సముద్రంలో ఈత కొడుతూ చురుగ్గా తిరుగుతుంటాయి. కొన్ని చేపలు వేగంగా ఈదుతూ వేటాడితే, మరికొన్ని సముద్రపు అడుగునే జీవనం సాగిస్తాయి. అయితే ఈ ట్రైపాడ్ ఫిష్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ చేపకి ఈత రాదు అంటారు. మరి ఈ చేప ఈత రాకున్నా ఎలా బ్రతకగలుగుతుంది. ట్రైపాడ్ ఫిష్ శాస్త్రీయ నామం Bathypterois grallator. ఇది లోతైన సముద్రాల్లో నివసించే అరుదైన ఆకారమున్న చేప. దీని శరీరంతో పోలిస్తే రెక్కల భాగాలు చాలా పొడవుగా ఉంటాయి. ముఖ్యంగా రెండు పెల్విక్ ఫిన్స్, తోక రెక్కలోని పొడవైన కిరణాలు కలిసి మూడు కాళ్ల స్టాండ్‌లా కనిపిస్తాయి. ఈ మూడు భాగాలను సముద్రపు అడుగున ఆనించి, ట్రైపాడ్‌లా నిలబడుతుంది.
ఈ చేపకు నిజంగా ఈత కొట్టడం రాదా?
ఈ చేప గురించి సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. దీనికి ఈత కొట్టడం రాదని! అయితే శాస్త్రీయంగా ఇది పూర్తిగా నిజం కాదు. ట్రైపాడ్ ఫిష్ ఈత కొట్టగలదు. కానీ ఎక్కువ సమయం సముద్రపు అడుగున తన ప్రత్యేకమైన రెక్కల సహాయంతో నిలబడే ఉంటుంది. అవసరమైనప్పుడు మాత్రమే ఈదుతూ మరో ప్రాంతానికి వెళ్తుంది. పరిశోధకులు ఈ చేప ఈత కొట్టే విధానాన్ని కూడా ప్రత్యేకంగా అధ్యయనం చేశారు.
ట్రైపాడ్ ఫిష్ వేట కూడా వింతే..
ట్రైపాడ్ ఫిష్ సాధారణంగా సముద్రంలో సుమారు 900 నుంచి 4,700 మీటర్ల లోతులో కనిపిస్తుంది. అక్కడ సూర్యకాంతి దాదాపుగా చేరదు. నీటి ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి కఠినమైన వాతావరణంలో జీవించడం ఈ చేప ప్రత్యేకత. సముద్రం అడుగున ఉండే కటిక చీకటి కారణంగా ఈ చేపకు కళ్ళు సరిగ్గా పనిచేయవు, ఇది దాదాపు గుడ్డిది. కళ్ళు కనిపించకపోయినా, తన ముందున్న రెండు రెక్కలను యాంటెనాల్లా చాపి నీటి కదలికలను బట్టి పరిసరాలను గుర్తిస్తుంది. ఈ చేప తన ఆహారం కోసం ఎక్కడికీ వెళ్లి వేటాడదు. ప్రవాహానికి ఎదురుగా నిలబడి, నోరు తెరిచి నీటి ద్వారా వచ్చే ఆహారం కోసం నిశ్శబ్దంగా వేచి చూస్తుంది.
ఒంటరి పోరాటం - సంతానోత్పత్తి:
ఈ చేప ఎదుర్కొనే అతిపెద్ద సమస్య ఆకలి కాదు, ఒంటరితనం. ఆ కటిక చీకటి సముద్రపు లోతుల్లో దీనికి తోడు దొరకడం దాదాపు అసాధ్యం. ఈ సమస్యను అధిగమించడానికి ప్రకృతి దీనికి ఒక అద్భుతమైన మార్గాన్ని ప్రసాదించింది. ఈ చేప శరీరంలో ఆడ, మగ రెండు రకాల అవయవాలు ఉంటాయి. తనకు తోడుగా వేరే చేప దొరకనప్పుడు, తనంతట తానే గుడ్లు పెట్టి తన సంతానాన్ని సృష్టిస్తుంది. ప్రకృతి సృష్టించిన అద్భుతాలలో ఈ ట్రైపాడ్ ఫిష్ యొక్క ఒంటరి పోరాటం నిజంగా ఒక మిస్టరీ అనే చెప్పాలి.





