Oceans and Seas: మహాసముద్రాలకు, సముద్రాలకు మధ్య తేడా ఏంటి? వీటిని ఎలా విడదీశారు?
Oceans and Seas: ప్రపంచంలో మహా సముద్రాలు, సముద్రాలు రెండూ ఉన్నాయి. ఇలా రెండు వర్గాలుగా ఎలా విడదీశారు? అసలు ఎన్ని మహాసముద్రాలు, సముద్రాలు ప్రపంచంలో ఉన్నాయి? ఏడు సముద్రాలు, అయిదు మహా సముద్రాలు పేరేమిటి?

ఏడు సముద్రాలే ఎందుకు?
చిన్నప్పటి నుంచి సప్త సముద్రాలు అనే మాట వింటూనే ఉంటాం. సినిమాల్లో, పాటల్లో, కథల్లో కూడా ఈ పదం తరచూ కనిపిస్తుంది. అయితే నిజంగా ప్రపంచంలో ఏడు సముద్రాలే ఉన్నాయా? నాలుగు, ఐదు సముద్రాలు కాకుండా ఏడు అనే సంఖ్యకు ప్రత్యేకత ఏంటి? అనే సందేహాలు చాలామందికి వస్తుంటాయి. నిజానికి ఏడు సముద్రాలు అనేది ఖచ్చితమైన భౌగోళిక లెక్క కాదు. ఇది ఎన్నో ఏళ్లుగా వాడుకలో ఉన్న చారిత్రక పదం. ప్రాచీన గ్రీకులు, రోమన్ల కాలంలో ఏజియన్ సముద్రం, అడ్రియాటిక్ సముద్రం, మధ్యధరా సముద్రం, నల్ల సముద్రం, ఎర్ర సముద్రం, కాస్పియన్ సముద్రం, పర్షియన్ గల్ఫ్లను కలిపి ఏడు సముద్రాలుగా పిలిచేవారు. ఆ కాలంలో వ్యాపార మార్గాలు, తమకు తెలిసిన జలమార్గాల ఆధారంగా ఈ జాబితా మారుతూ ఉండేది.
ఐదు మహా సముద్రాలు
ప్రస్తుతం భూమిపై ఐదు ప్రధాన మహాసముద్రాలు ఉన్నాయి. అవి పసిఫిక్, అట్లాంటిక్, హిందూ, ఆర్కిటిక్, దక్షిణ మహాసముద్రాలు. వీటిలో పసిఫిక్ మహాసముద్రం ప్రపంచంలోనే అతి పెద్దది. అత్యంత లోతైన ప్రాంతమైన మరియానా ట్రెంచ్ కూడా ఇందులోనే ఉంది. అట్లాంటిక్ మహాసముద్రం విస్తీర్ణంలో రెండో స్థానంలో ఉంటుంది. హిందూ మహాసముద్రానికి భారతదేశం పేరు పెట్టారు. ఆర్కిటిక్ మహాసముద్రం ఐదింటిలో అతి చిన్నది. దక్షిణ మహాసముద్రం అంటార్కిటికా ఖండం చుట్టూ విస్తరించి ఉంటుంది. భూమి ఉపరితలంలో దాదాపు 71 శాతం నీటితో నిండి ఉంది. ప్రపంచంలోని మొత్తం నీటిలో సుమారు 97 శాతం సముద్ర జలాల రూపంలోనే ఉంది.
సముద్రాలకు, మహా సముద్రాలకు తేడా
సముద్రానికి, మహాసముద్రానికి మధ్య తేడా ఏంటి? మహాసముద్రాలు చాలా పెద్ద నీటి ప్రాంతాలు. వీటిలో భాగంగానే సముద్రాలు ఉంటాయి. సముద్రాలు సాధారణంగా మహాసముద్రాల కంటే చిన్నవిగా, తక్కువ లోతుతో ఉంటాయి. వీటిలో కొన్ని భూభాగం, దీవులతో కొంతవరకు చుట్టుముట్టి ఉంటాయి. ఉదాహరణకు అరేబియా సముద్రం హిందూ మహాసముద్రంలో భాగం. ఇక గల్ఫ్, బే అనే పదాలు కూడా నీటి ప్రాంతాలనే సూచిస్తాయి. సముద్రపు నీరు భూభాగం లోపలికి చొచ్చుకెళ్లి మూడు వైపులా నేలతో చుట్టుముట్టినట్టు ఉంటే దాన్ని అఖాతం అంటారు. దాని ముఖద్వారం ఇరుకుగా ఉంటే గల్ఫ్ అని, వెడల్పుగా ఉంటే బే అని పిలుస్తారు. గల్ఫ్ ఆఫ్ మెక్సికో, పర్షియన్ గల్ఫ్, బంగాళాఖాతం ఇందుకు ఉదాహరణలు. ఇలా సముద్రాలు, మహాసముద్రాలు, అఖాతాలు అన్నీ భూమిపై ఉన్న జలప్రాంతాలే అయినా వాటి పరిమాణం, ఆకారం, లోతు ఆధారంగా పేర్లు మారుతుంటాయి.











