- Home
- Feature
- Train: రైలు నడుపుతున్న డ్రైవర్ నిద్రపోతే ఏమవుతుంది? రాత్రి ప్రయాణికుల భద్రత కోసం రైల్వే వ్యవస్థ ఎలా పనిచేస్తుంది?
Train: రైలు నడుపుతున్న డ్రైవర్ నిద్రపోతే ఏమవుతుంది? రాత్రి ప్రయాణికుల భద్రత కోసం రైల్వే వ్యవస్థ ఎలా పనిచేస్తుంది?
Train: ఎక్కువ దూరం వెళ్లే ట్రైన్స్ రాత్రివేళల్లో ఎక్కువ ప్రయాణం చేయాల్సి వస్తుంది. అప్పుడు ఆ రైలులో ప్రయణించే వారు ప్రశాంతంగా నిద్రపోవాలంటే.. పైలెట్ ఎంతో జాగ్రత్తగా నిద్రపోకుండా ఉండాలి? ఒకవేళ రైలు రన్నింగ్ లో ఉండగా డ్రైవర్ నిద్రపోతే పరిస్థితి ఏంటి?

ట్రైన్ డ్రైవర్ నిద్రపోతే ఏమవుతుంది?
అర్ధరాత్రి వేళ సూపర్ ఫాస్ట్ రైలు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు, ప్రయాణికులు ప్రశాంతంగా నిద్రపోతుంటారు . సరిగ్గా అదే సమయంలో ముందున్న ఇంజిన్‌లో లోకో పైలట్ కళ్లు మూతపడితే రైలు పరిస్థితి ఏంటి? చాలా సందర్భాల్లో భద్రతా వ్యవస్థ పైలట్‌ను అలర్ట్ చేస్తుంది లేదా స్పందన లేకపోతే రైలే తనంతట తానే బ్రేక్ వేసుకుని ఆగిపోతుంది. అయితే ఈ వ్యవస్థ ప్రతిసారీ ప్రమాదాలను ఆపగలదా అంటే కచ్చితంగా చెప్పలేం.. నిద్రమత్తులో రెడ్ సిగ్నల్ దాటేసిన ఘటనలు కూడా ఉన్నాయి. "ట్రైన్ డ్రైవర్ నిద్రపోతే ఏమవుతుంది? ఈ భద్రతా వ్యవస్థలు ఎలా పనిచేస్తాయి, ఎక్కడ లోపాలు తలెత్తుతాయి అనే విషయాలను తెలుసుకుందాం?
ఇంజిన్‌లో ఇద్దరు పైలట్లు, విజిలెన్స్ కంట్రోల్ డివైస్ (VCD)
ఇండియన్ రైల్వేస్ లో మెయిల్, ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్ల ఇంజిన్‌లో సాధారణంగా లోకో పైలట్‌తో పాటు అసిస్టెంట్ లోకో పైలట్ కూడా ఉంటారు . ఒకరు సిగ్నల్ గమనించకపోతే మరొకరు గుర్తించాలనేది దీని వెనుక ఉద్దేశం, కానీ ఇద్దరూ మనుషులే కాబట్టి అలసట వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే రైల్వే కేవలం మానవ అప్రమత్తతపైనే ఆధారపడదు. భారతీయ రైల్వే ఇంజిన్‌లలో ఉండే విజిలెన్స్ కంట్రోల్ డివైస్ (VCD) పైలట్ మేలుకొని ఉన్నాడా లేదా అని నిరంతరం తనిఖీ చేస్తుంది. స్పీడ్ మార్చడం, హారన్ కొట్టడం, బ్రేక్ వేయడం లేదా ప్రత్యేక బటన్ నొక్కడం వంటి చర్యల ద్వారా పైలట్ యాక్టివ్‌గా ఉన్నట్లు సిస్టమ్ గుర్తిస్తుంది .
పెనాల్టీ బ్రేక్ అంటే ఏంటి?
నిర్ణీత సమయంలో ఎలాంటి కదలిక లేకపోతే. పైలెట్ నుంచి ఎటువంటి స్పందన లేకపోతే మొదట లైట్ మెరుస్తుంది... ఆ తర్వాత అలారం మోగుతుంది... అప్పటికీ స్పందన రాకపోతే సిస్టమ్ ఎమర్జెన్సీ బ్రేక్ వేస్తుంది దీన్నే పెనాల్టీ బ్రేక్ అంటారు . గతంలో దీని స్థానంలో డెడ్ మ్యాన్స్ హ్యాండిల్ ఉండేది; పైలట్ దాన్ని వదిలేస్తే వెంటనే బ్రేక్ పడేది.
కవచ్ (Kavach) సిస్టమ్
ప్రస్తుతం భారతీయ రైల్వేలో చాలా రూట్లలో 'కవచ్' (Automatic Train Protection) టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఒకవేళ డ్రైవర్ నిద్రపోయి రెడ్ సిగ్నల్‌ను గమనించకపోయినా, ఈ సిస్టమ్ దాన్ని గుర్తించి ఆటోమేటిక్‌గా బ్రేకులు వేసి రైలును ఆపేస్తుంది.
జపాన్ బుల్లెట్ ట్రైన్ ఘటన
ఈ ఆటోమేటిక్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చెప్పడానికి 2003 ఫిబ్రవరి 26న జపాన్‌లో జరిగిన ఘటన ఒక ఉదాహరణ. సాన్యో షింకన్సన్ లైన్‌లో బుల్లెట్ ట్రైన్ నడుపుతున్న 33 ఏళ్ల డ్రైవర్ దాదాపు ఎనిమిది నిమిషాలు నిద్రపోయారు. ఆ సమయంలో రైలు సుమారు 26 కిలోమీటర్లు ప్రయాణించినా, అక్కడి ఆటోమేటిక్ ట్రైన్ కంట్రోల్ సిస్టమ్ వేగాన్ని తగ్గించి ఒకామా స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్‌కు సుమారు 100 మీటర్ల ముందే రైలును నిలిపివేసింది . ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. పరీక్షల్లో ఆ డ్రైవర్‌కు స్లీప్ అప్నియా సమస్య ఉన్నట్లు తేలింది; ఆ ఘటన తర్వాత రవాణా రంగ ఉద్యోగులకు స్లీప్ అప్నియా తనిఖీలపై మరింత దృష్టి పెట్టారు .
మైక్రో స్లీప్ - అలసట సమస్య
విజిలెన్స్ కంట్రోల్ డివైస్ ఉన్నప్పటికీ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి అనేదానికి మైక్రో స్లీప్ ఒక కారణం. 2023 జూన్‌లో పశ్చిమ బెంగాల్‌లోని బంకురా సమీపంలోని ఒండాలో, 2024 జూన్‌లో పంజాబ్‌లోని సిర్హింద్ వద్ద జరిగిన గూడ్స్ రైళ్ల ఢీకొనే ఘటనల విచారణల్లో మైక్రో స్లీప్, నిద్రలోకి జారడం వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. కొన్ని సెకండ్ల పాటు మెదడు ఆఫ్ అయ్యే ఈ మైక్రో స్లీప్‌లో కళ్లు తెరిచి ఉన్నా ఏం జరుగుతుందో తెలియదు. VCD కదలికను మాత్రమే గమనిస్తుంది; అలారం మోగే సమయానికి వేగంగా వెళ్తున్న రైలు రెడ్ సిగ్నల్ దాటే ప్రమాదం ఉంటుంది.
ఈ సమస్య నుంచి బయటపడటానికి స్వదేశీ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ వ్యవస్థ అయిన కవచ్ ను దశలవారీగా అమలు చేస్తున్నారు . ఇది సిగ్నల్, వేగం, రైలు స్థానాన్ని బట్టి పైలట్ బ్రేక్ వేయకపోతే తనంతట తానే బ్రేక్ వేసి రైలును ఆపుతుంది. మరోవైపు వరుస నైట్ డ్యూటీలు, ఎక్కువ పని గంటలు, తగినంత విశ్రాంతి లేకపోవడం వల్ల వచ్చే అలసటే అసలు సమస్య అని అని అంటున్నారు.











