నలుపు, తెలుపు, నీలం.. ఇంటికి ఏ రంగు వాటర్ ట్యాంక్ మంచిది? కొనేముందు ఇవి తెలుసుకోండి
Water Tank: ప్రతీ ఇంటిపై కచ్చితంగా వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది. అయితే మెజారిటీ నలుపు, తెలుపు, బ్లూ కలర్స్‌లో ట్యాంకులు ఉంటాయి. అయితే వాటర్ ట్యాంక్ రంగు అందులో నిల్వ ఉండే నీటి నాణ్యత, ఉష్ణోగ్రతపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్యాంక్ రంగు నిజంగానే ప్రభావం చూపుతుందా?
వాటర్ ట్యాంక్ రంగు కేవలం అందం కోసం మాత్రమే కాదు. అది సూర్యరశ్మిని ఎంత మేరకు గ్రహిస్తుంది లేదా రిఫ్లెక్ట్ చేస్తుంది అనే అంశంపై కూడా ప్రభావం చూపుతుంది. ట్యాంక్ ఇంటిపై ఎండలో ఉంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎండ ఎక్కువగా పడే ప్రాంతాల్లో ట్యాంక్ రంగు కారణంగా లోపల నీటి ఉష్ణోగ్రత మారవచ్చు. అలాగే ట్యాంక్‌లో ఆల్గీ (పచ్చటి నాచు) పెరిగే అవకాశాలపై కూడా కొంత ప్రభావం ఉంటుంది.
నలుపు, తెలుపు, నీలం ట్యాంకుల్లో తేడా ఏంటి?
నలుపు రంగు ట్యాంక్:
చాలా ఇళ్లలో బ్లాక్ కలర్ ట్యాంక్‌లనే ఉపయోగిస్తుంటారు. మంచి నాణ్యత గల నలుపు ట్యాంకుల్లో సాధారణంగా యూవీ (UV) ప్రొటెక్షన్ ఉంటుంది. ఇది సూర్యుడి అతినీలలోహిత కిరణాల వల్ల ప్లాస్టిక్ త్వరగా పాడవకుండా కాపాడుతుంది. అయితే నలుపు రంగు వేడిని ఎక్కువగా గ్రహిస్తుంది. కాబట్టి రోజంతా ఎండలో ఉంటే లోపల నీరు వేడిగా మారే అవకాశం ఉంటుంది.
తెలుపు రంగు ట్యాంక్:
తెలుపు రంగు సూర్యకాంతిని ఎక్కువగా రిఫ్లెక్ట్ చేస్తుంది. దీంతో ట్యాంక్ తక్కువ వేడెక్కి నీటి ఉష్ణోగ్రత కూడా కొంత వరకు తగ్గుతుంది. కానీ ఈ ట్యాంకులపై దుమ్ము, మురికి త్వరగా కనిపిస్తాయి. మంచి నాణ్యత లేకపోతే కాలక్రమంలో రంగు కూడా మారే అవకాశం ఉంటుంది.
నీలం రంగు ట్యాంక్:
ఇటీవలి కాలంలో నీలం రంగు ట్యాంకులకు కూడా మంచి ఆదరణ లభిస్తోంది. ఇవి ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అలాగే దుమ్ము కూడా అంతగా కనిపించదు. అయితే రంగు ఒక్కటే ట్యాంక్ నాణ్యతను నిర్ణయించదు. ప్లాస్టిక్ నాణ్యత, మందం, UV రక్షణ, లేయర్లు వంటి అంశాలే ముఖ్యమైనవి.
రంగు కంటే ట్యాంక్ నాణ్యత ఎందుకు ముఖ్యం?
వాటర్ ట్యాంక్ కొనేటప్పుడు రంగు కంటే కొన్ని అంశాలను తప్పనిసరిగా పరిశీలించాలి. వాటిలో ప్రధానమైనవి.. ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్‌తో తయారై ఉండాలి, UV ప్రొటెక్షన్ ఉండాలి, తద్వారా ఎండ వల్ల ట్యాంక్ త్వరగా దెబ్బతినదు, BIS లేదా ISI ప్రమాణాలు కలిగి ఉండాలి. అలాగే 3, 4 లేదా 5 లేయర్ల మల్టీ లేయర్ టెక్నాలజీ ఉన్న ట్యాంక్ అయితే మరింత మంచిది. అలాగే ట్యాంక్ మూత బిగుతుగా మూసుకునేలా ఉండాలి. దీంతో దుమ్ము, పురుగులు, ఇతర మలినాలు లోపలికి వెళ్లవు.
ఎన్ని లేయర్ల ట్యాంక్ కొనాలి? ఎంత తరచుగా శుభ్రం చేయాలి?
ఎండ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇంటి పైకప్పుపై ట్యాంక్ ఉంచితే కనీసం 3 లేయర్లు లేదా అంతకంటే ఎక్కువ లేయర్లతో ఉన్న మంచి నాణ్యత గల ట్యాంక్ కొనడం మంచిది. మల్టీ లేయర్ ట్యాంక్ వల్ల బయట వేడి ప్రభావం లోపల నీటిపై తక్కువగా ఉంటుంది. అయితే ఎక్కువ లేయర్లు ఉన్నాయనే కారణంతోనే ట్యాంక్ ఉత్తమమని చెప్పలేం. తయారీ నాణ్యత, ఉపయోగించిన మెటీరియల్ కూడా అంతే ముఖ్యమైనవి. ఇక ట్యాంక్ ఏ రంగులో ఉన్నా ప్రతి ఆరు నెలలకు ఒకసారి తప్పనిసరిగా శుభ్రం చేయాలి. ఇలా చేస్తే మురికి, బ్యాక్టీరియా, నాచు పేరుకుపోయే ప్రమాదం తగ్గి నీరు పరిశుభ్రంగా ఉంటుంది.

