US Army : అమెరికా ఆర్మీలో పనిచేసే సోల్జర్స్ కి ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో తెలుసా?
అమెరికా సైనికుడిని పెళ్లి చేసుకున్న ఓ భారతీయ మహిళ అక్కడ ఆర్మీ సిబ్బందికి, వారి కుటుంబాలకు దక్కే ప్రయోజనాల గురించి వివరించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమెరికన్ ఆర్మీ సిబ్బందికి లభించే బెనిఫిట్స్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

యూఎస్ మిలిటరీలో చేరితే ఇన్ని లాభాలా..!
దేశాన్ని కాపాడే సైనికులను గౌరవించుకోవడం ఆ దేశ పౌరుల బాధ్యత. వారిని గుర్తించి తగిన బెనిఫిట్స్ కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. భారత ప్రభుత్వం ఆర్మీ జవాన్లు, అధికారులకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తుంది. సైనికులకే కాదు వారి కుటుంబాలకు కూడా కొన్ని స్సెషల్ బెనిఫిట్స్ ఉంటాయి. అయితే అత్యంత పవర్ ఫుల్ ఆర్మీని కలిగిన అమెరికా తమ సైనికులను ఎలా చూసుకుంటుంది? ఎలాంటి బెనిఫిట్స్ కల్పిస్తుంది? అనేది తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇది గమనించారో ఏమో గానీ అమెరికన్ ఆర్మీ ఆఫీసర్ ను పెళ్లాడిన ఓ ఇండియన్ మహిళ దీనిపై క్లారిటీ ఇచ్చారు.
మన దేశంనుండి విదేశాలకు వెళ్లి స్థిరపడేవారు అక్కడి జీవన విధానం, ప్రభుత్వాలు అందించే సౌకర్యాల గురించి తరచూ సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. ఇటీవల ఓ భారతీయ మహిళ తన భర్తతో కలిసి చేసిన ఒక వీడియో ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆమె పేరు మేఘా. అమెరికా సైన్యంలో (US Army) పనిచేస్తున్న ఒక సైనికుడిని పెళ్లి చేసుకున్నారామె. యూఎస్ మిలిటరీ తమ సైనికులకు, వారి కుటుంబాలకు ఎలాంటి ప్రయోజనాలు అందిస్తుందో వివరిస్తూ ఒక ఆసక్తికరమైన వీడియోను రూపొందించారు.
అమెరికా ఆర్మీ జవాన్స్ కి లభించే టాప్ 3 బెనిఫిట్స్..
"నేను ఒక అమెరికన్ సైనికుడిని పెళ్లి చేసుకున్నాను. ఒక మిలిటరీ ఫ్యామిలీగా మాకు లభిస్తున్న టాప్ 3 బెనిఫిట్స్ ఇవే! సాధారణంగా చాలామందికి తెలియని ఎన్నో అద్భుతమైన అవకాశాలు సైనిక సేవలో దాగి ఉన్నాయి" అంటూ @meghamitch అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఆసక్టికర వీడియో పెట్టింది మేఘా. ఈ వీడియోను ఇప్పటికే లక్షలాది మంది నెటిజన్లు తిలకించారు. ఈ వీడియోలో మేఘా, ఆమె భర్త ఇద్దరూ కలిసి అమెరికా ప్రభుత్వం సైనిక కుటుంబాలకు ఇచ్చే ముఖ్యమైన రక్షణ, సౌకర్యాల గురించి చాలా క్లియర్‌గా వివరించారు.
1. ఉచిత ఉన్నత విద్య
అమెరికా వ్యాప్తంగా ఉన్న ఏ స్కూల్ లేదా కాలేజీలోనైనా యువ సైనికులు ఉన్నత విద్యను పూర్తిగా ఉచితంగా అభ్యసించవచ్చు. అంతేకాకుండా చదువుకోవడానికి వెళ్తున్నందుకు ప్రోత్సాహకంగా ఆర్మీ నుంచే నెలకు 1,000 డాలర్లు (మన భారతీయ కరెన్సీలో సుమారు రూ.83,000 పైనే) ప్రత్యేక అలవెన్స్‌గా కూడా అందిస్తారని మేఘా భర్త వెల్లడించారు.
2. జీవితాంతం ఉచిత వైద్యం
ఆరోగ్య సంరక్షణ విషయంలో అమెరికా ఆర్మీ తమ సిబ్బందికి అత్యున్నత ప్రాధాన్యం ఇస్తుంది. దేశంలోని ఏ ఆసుపత్రిలోనైనా, ఎలాంటి చిన్న లేదా పెద్ద చికిత్సలకైనా రూపాయి ఖర్చు లేకుండా వైద్యాన్ని పొందవచ్చు. ఈ సేవలు వారి జీవితాంతం ఉచితంగానే అందుబాటులో ఉంటాయి.
3. అత్యంత సులభంగా సొంత ఇళ్లు
విదేశాలలో ఇల్లు కొనడం లేదా నిర్మించుకోవడం ఎంతో ఖరీదైన వ్యవహారం. కానీ అమెరికన్ సైనిక కుటుంబాలకు ఇది చాలా సులభం. ప్రాపర్టీ కొనుగోలుకు అయ్యే కేవలం టెక్నికల్, డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ఖర్చులు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. సుమారు 140 డాలర్లు (భారతీయ రూపాయిల్లో దాదాపు రూ.13,000) చెల్లిస్తే ఇంటికి సంబంధించిన ప్రాపర్టీ పేపర్లు, తాళాలు చేతికి వస్తాయని ఈ అమెరికన్ ఆర్మీ జంట సంతోషంగా పంచుకుంది.
అమెరికన్ సోల్జర్స్ కు అందే బెనిఫిట్స్ పై ఇండియన్స్ రియాక్షన్ ఇదే..
అమెరికన్ ఆర్మీలో పనిచేసేవారికి అందే బెనిఫిట్స్ గురించి మేఘా చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇండియాకు చెందిన నెటిజన్స్ నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఒక దేశం తమ రక్షణ కోసం నిలబడే సైనికులకు, వారి కుటుంబాలకు ఎంతటి గౌరవం, ఆర్థిక భద్రత కల్పిస్తుందో చూసి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాకుండా ఈ వీడియో చూసిన పలువురు తల్లిదండ్రులు, యువత "అమెరికా సైన్యంలో ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి? అర్హతలు ఏంటి? అప్లై చేసుకునే విధానం ఎలా ఉంటుంది?" అనే వివరాలు అడుగుతూ కామెంట్ల రూపంలో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఒక భారతీయ యువతిగా విదేశీ సైనిక వ్యవస్థలోని విశేషాలను వివరంగా తెలియజేస్తూ మేఘా చేసిన ఈ ప్రయత్నం నెటిజన్లకు కొత్త విషయాలను అందించింది. మిలిటరీ సర్వీస్ అనేది కేవలం ఒక ఉద్యోగం మాత్రమే కాదు, అది ఒక కుటుంబానికి పూర్తి స్థాయి జీవిత భద్రతను ఇచ్చే వ్యవస్థ అని ఈ వీడియో ద్వారా మరోసారి స్పష్టమైంది.

