Top 5 Sugar Companies : ఇండియాలో అత్యధికంగా చక్కెర ఉత్పత్తిచేసే టాప్ 5 కంపెనీలివే...
ఇండియన్స్ చక్కెర అత్యధికంగా ఉపయోగిస్తుంటారు… అందుకే దేశంలో అదేస్థాయిలో దీని ఉత్పత్తి జరుగుతుంటుంది. మరి భారతదేశంలో అత్యధికంగా చక్కెరను ఉత్పత్తిచేసే టాప్ 5 కంపెనీలేవో తెలుసా?

ఇండియాలో అతిపెద్ద షుగర్ ఫ్యాక్టరీలివే..
భారతదేశంలో చెరకు సాగు లక్షలాది మంది రైతులకు జీవనాధారం. ఈ పంట నుంచి చక్కెర మాత్రమే కాకుండా ఇథనాల్, విద్యుత్, మొలాసిస్ వంటి అనేక ఉత్పత్తులు కూడా తయారవుతున్నాయి. అందుకే దేశంలో చక్కెర పరిశ్రమకు ప్రత్యేక స్థానం ఉంది. చెరకు పంటను పెద్ద ఎత్తున సేకరించి, రోజుకు వేల టన్నుల చొప్పున ప్రాసెస్ చేసే భారీ పరిశ్రమలు కూడా మన దేశంలో ఉన్నాయి.
ఒక చక్కెర కర్మాగారం సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఉపయోగించే ముఖ్యమైన కొలమానం కేన్ క్రషింగ్ కెపాసిటీ. అంటే ఒక రోజులో ఆ మిల్లు ఎంత పరిమాణంలో చెరకును క్రష్ చేయగలదన్నమాట. ఈ సామర్థ్యాన్ని సాధారణంగా TCD (Tonnes of Cane per Day)లో లెక్కిస్తారు. ఈ లెక్కన భారతదేశంలోని ప్రముఖ చక్కెర కంపెనీలు భారీ స్థాయిలో చెరకు ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. అలాంటి టాప్ 5 కంపెనీల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
1. బజాజ్ హిందుస్థాన్ షుగర్ లిమిటెడ్ (Bajaj Hindusthan Sugar Ltd)
భారతదేశంలో అత్యధిక చెరకు క్రషింగ్ సామర్థ్యం కలిగిన చక్కెర కంపెనీల్లో బజాజ్ హిందుస్థాన్ షుగర్ అగ్రస్థానంలో ఉంది. ఉత్తరప్రదేశ్‌లో ఈ సంస్థకు మొత్తం 14 చక్కెర కర్మాగారాలు ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు 1,36,000 టన్నుల చెరకును ప్రాసెస్ చేయగల సామర్థ్యం ఉంది. అంటే ఒక్కరోజులోనే లక్ష టన్నులకు పైగా చెరకును క్రష్ చేయగల భారీ పరిశ్రమల సముదాయం ఈ కంపెనీ సొంతం.
చక్కెర తయారీతో పాటు ఇథనాల్ ఉత్పత్తి, విద్యుత్ ఉత్పత్తి రంగాల్లోనూ ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. చెరకు నుంచి చక్కెరను తీసిన తర్వాత మిగిలే మొలాసిస్, బగాస్ వంటి ఉప ఉత్పత్తులను కూడా వినియోగించుకుంటోంది. సంస్థ వార్షిక రిపోర్ట్స్ ప్రకారం, దీనికి ఆరు డిస్టిలరీలు, 14 కో-జనరేషన్ విద్యుత్ ప్లాంట్లు కూడా ఉన్నాయి.
2. బలరాంపూర్ చినీ మిల్స్ లిమిటెడ్ (Balrampur Chini Mills Ltd)
భారత చక్కెర పరిశ్రమలో ప్రముఖ సంస్థగా గుర్తింపు పొందిన బలరాంపూర్ చినీ మిల్స్ 1975లో ప్రారంభమైంది. దేశంలోని అతిపెద్ద చక్కెర తయారీ సంస్థల్లో ఇది ఒకటి. కంపెనీకి ఉన్న వివిధ తయారీ యూనిట్ల ద్వారా రోజుకు 80,000 టన్నుల చెరకును క్రష్ చేయగల సామర్థ్యం ఉంది. ఇదికూడా చక్కెర తయారీతో పాటు ఇథనాల్, ఆల్కహాల్ ఉత్పత్తి, విద్యుత్ తయారీ రంగాల్లోనూ ఉంది.
3. త్రివేణి ఇంజినీరింగ్ అండ్ ఇండస్ట్రీస్ (Triveni Engineering & Industries Ltd)
త్రివేణి ఇంజినీరింగ్ అండ్ ఇండస్ట్రీస్ కూడా దేశంలోని ప్రధాన చక్కెర తయారీ సంస్థల్లో ఒకటి. ఉత్తరప్రదేశ్‌లో ఈ కంపెనీకి ఎనిమిది చక్కెర యూనిట్లు ఉన్నాయి. వీటి మొత్తం చెరకు క్రషింగ్ సామర్థ్యం రోజుకు 70,500 టన్నులు. చక్కెర తయారీతో పాటు ఇంజినీరింగ్, నీటి నిర్వహణ వంటి ఇతర రంగాల్లోనూ ఈ సంస్థకు వ్యాపార కార్యకలాపాలు ఉన్నాయి.
ఈ కంపెనీ చక్కెర తయారీ ప్రక్రియలో వచ్చే ఉప ఉత్పత్తులను కూడా సమర్థంగా వినియోగించుకుంటోంది. తెల్ల చక్కెరతో పాటు రిఫైన్డ్ షుగర్, ముడి చక్కెర వంటి వివిధ రకాల ఉత్పత్తులను కూడా తయారు చేస్తోంది.
4. శ్రీ రేణుకా షుగర్స్ లిమిటెడ్ (Shree Renuka Sugars Ltd)
శ్రీ రేణుకా షుగర్స్ భారతదేశంలోని ప్రముఖ చక్కెర తయారీ, రిఫైనింగ్ సంస్థల్లో ఒకటి. ఈ కంపెనీకి దేశవ్యాప్తంగా ఎనిమిది చక్కెర మిల్లులు ఉన్నాయి. వీటి మొత్తం చెరకు క్రషింగ్ సామర్థ్యం రోజుకు 46,000 టన్నులు. అంతేకాదు చక్కెర శుద్ధి (Refining) రంగంలోనూ ఈ సంస్థకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
గుజరాత్‌లోని కాండ్లా, పశ్చిమ బెంగాల్‌లోని హల్దియా ప్రాంతాల్లో ఈ కంపెనీకి పోర్టు ఆధారిత చక్కెర రిఫైనరీలు ఉన్నాయి. ముడి చక్కెరను శుద్ధి చేసి దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు సరఫరా చేస్తోంది. ఈ సంస్థకు చెందిన 'మధుర్' బ్రాండ్ ప్యాక్డ్ చక్కెర మార్కెట్లో సుమారు 33 శాతం వాటాను కలిగి ఉంది. ఇథనాల్ ఉత్పత్తి, ఎగుమతుల రంగాల్లోనూ శ్రీ రేణుకా షుగర్స్ కీలకంగా వ్యవహరిస్తోంది.
5. ధాంపూర్ షుగర్ మిల్స్ లిమిటెడ్ (Dhampur Sugar Mills Ltd)
భారతదేశ చక్కెర పరిశ్రమలో సుదీర్ఘ చరిత్ర కలిగిన సంస్థల్లో ధాంపూర్ షుగర్ మిల్స్ ఒకటి. 1933లో ప్రారంభమైన ఈ సంస్థ మొదట రోజుకు 300 టన్నుల చెరకును మాత్రమే క్రష్ చేసే సామర్థ్యంతో కార్యకలాపాలు ప్రారంభించింది. ప్రస్తుతం కంపెనీకి చెందిన ధాంపూర్, రాజ్‌పురా యూనిట్ల కలిపిన చెరకు క్రషింగ్ సామర్థ్యం రోజుకు 24,000 టన్నులకు చేరింది.





