Rare Flowers: 12 ఏళ్లకోసారి మాత్రమే పూసే పువ్వులు ఇవి... ఆ రంగు, అందమే వేరు
Rare Flowers: అరుదైన నీలకురింజి పూలు పశ్చిమ కనుమల్లోని కుదురేముఖ్ కొండల్లో వికసించాయి. వీటిని చూడాలంటే రెండు కళ్లూ చాలవు. సాధారణంగా 12 ఏళ్లకోసారి పూసే పువ్వులు ఇవి.

12 ఏళ్లకోసారి పూసే పువ్వులు
నీలకురింజి పువ్వులు ప్రతి 12 ఏళ్లకోసారి మాత్రమే వివసిస్తాయి. అందుకే వీటిని అరుదైన నీలకురింజి పూలు పశ్చిమ కనుమల్లోని మంచుతో కప్పబడిన కుదురేముఖ్ కొండల్లో వికసించాయి. సాధారణంగా 12 ఏళ్లకోసారి గుంపులుగా పూసే ఈ పూలు, ఈసారి నాలుగేళ్ల ముందే దర్శనమివ్వడం విశేషం.
ఈ పూలు కుదురేముఖ్ జాతీయ ఉద్యానవనం పరిధిలోని గంగడికల్లు, చిట్టెగుడ్డ, కుదురేముఖ్ పర్వత ప్రాంతాల్లోని షోలా గడ్డిభూముల్లో గత నెల రోజులుగా వికసిస్తున్నాయి. 2018లో ఇక్కడ ఈ పూలు భారీగా పూశాయి. మళ్లీ 2030లో పూస్తాయని అందరూ భావించారు. కానీ, ఆశ్చర్యకరంగా 2026లోనే ఇవి వికసించడం విశేషం.
వాతావరణ మార్పుల ప్రభావమేనా?
నీలకురింజి పూలు ఇలా ముందే పూయడానికి కచ్చితమైన శాస్త్రీయ కారణం ఇంకా తెలియలేదు. వాతావరణ మార్పుల వల్ల ఉష్ణోగ్రత, వర్షపాతం, నేలలోని తేమలో వస్తున్న మార్పులు మొక్కల పెరుగుదలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే, కుదురేముఖ్‌లో ఈ పూలు ముందే పూయడానికి వాతావరణ మార్పులే కారణమని చెప్పడానికి ప్రస్తుతానికి ఎలాంటి ఆధారాలు లేవు.
స్థానిక వాతావరణ పరిస్థితులు, మొక్కల పెరుగుదలలో వచ్చిన మార్పులు కూడా దీనికి కారణం కావచ్చు. ఈ అరుదైన పరిణామం వెనుక ఉన్న అసలు కారణాన్ని తెలుసుకోవడానికి వృక్షశాస్త్రవేత్తలు, పర్యావరణ నిపుణులు మరింత అధ్యయనం చేయాల్సి ఉంది.
కీటకాలకు ఆహారం
నీలకురింజి మొక్కలు చాలా ఏళ్ల పాటు శక్తిని కూడబెట్టుకుని, ఆ తర్వాత పూలు పూసి విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి. దీంతో వాటి జీవిత చక్రం ముగుస్తుంది. ఇవి పూసే సమయంలో తేనెటీగలు, సీతాకోకచిలుకలు లాంటి కీటకాలకు ఈ పూలు ప్రధాన ఆహారంగా మారుతాయి. కర్ణాటక, కేరళ, తమిళనాడులోని కొన్ని షోలా అటవీ ప్రాంతాల్లో కనిపించే ఈ అరుదైన మొక్కలు.. కుదురేముఖ్ పర్యావరణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తాయి.
పూలను కోయొద్దని అటవీ శాఖ విజ్ఞప్తి
పర్యాటకులు నీలకురింజి పూలను లేదా ఇతర మొక్కలను తాకడం, కోయడం, ధ్వంసం చేయడం లాంటివి చేయకూడదని కుదురేముఖ్ వన్యప్రాణి విభాగం డీసీఎఫ్ రుత్రేన్ సూచించారు.
అరుదైన నీలకురింజి పూల అందాలను పర్యాటకులు కళ్లారా ఆస్వాదించవచ్చు. కానీ, వాటిని తాకడం లేదా కోయడం పూర్తిగా నిషేధం. మొక్కల సహజ ఆవాసాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఈ ప్రాంతంలో అటవీ శాఖ నిరంతరం నిఘా ఉంచింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
— రుత్రేన్, డీసీఎఫ్, కుదురేముఖ్ వన్యప్రాణి విభాగం, కార్కళ

