Indian Railway Temple: రైలు పట్టాలపై ఆలయం...మరి రైళ్లు ఎలా వెళ్తాయి?
Indian Railway Temple: రైల్వే స్టేషన్ అంటే ప్లాట్ పామ్ లు, పట్టాలు, రైళ్లు నడవడం కనిపిస్తాయి. కానీ ఒక ఆలయం మాత్రం ఏకంగా రైల్వే ట్రాక్ మధ్యలో ఉంటుంది. మరి భక్తులు అక్కడికి ఎలా వెళ్తారు? వినడానికి వింతగా ఉంది కదా...మరి అదెక్కడో తెలుసా?

రైలు పట్టాలపై ఆలయం
రైల్వే స్టేషన్ అంటే ప్లాట్‌ఫామ్‌లు, పట్టాలు, రైళ్ల రాకపోకలు కనిపించడం సహజం. కానీ ఒక ఆలయం మాత్రం ఏకంగా రెండు రైల్వే ట్రాక్‌ల మధ్యలోనే ఉంటే? రైలు వెళ్లే సమయంలో ఆలయం చుట్టూ అంత దగ్గరగా పట్టాలు ఉంటే? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. మహారాష్ట్రలోని దేవ్‌హాడిలో ఇలాంటి ప్రత్యేకమైన ఆలయం ఉంది.
భండారా జిల్లాలోని టుమ్సర్ రోడ్ రైల్వే స్టేషన్‌లో 3, 4వ ప్లాట్‌ఫామ్‌ల మధ్య కాళీమాత ఆలయం కనిపిస్తుంది. ఈ ఆలయం బ్రిటిష్ కాలం నాటిదిగా స్థానికంగా చెబుతారు. ఇప్పటికీ రైళ్లు ఆలయానికి అతి సమీపంగా వెళ్తుంటాయి.
పట్టాల మధ్య ఆలయం ఎలా వచ్చింది?
ఈ ఆలయానికి సంబంధించి చారిత్రక వివరాలతో పాటు స్థానికంగా అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. రైల్వే మార్గం నిర్మించే సమయంలో ఈ ప్రాంతంలో ఆలయం ఉండేదని, రైల్వే లైన్ విస్తరణలో దాన్ని తొలగించాలని అనుకున్నారు. అయితే ఆలయాన్ని తొలగించకుండా రైల్వే మార్గాన్ని నిర్మించారు. ఆ తర్వాత స్థానిక భక్తులు అక్కడ దేవత విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయాన్ని అభివృద్ధి చేశారు.
మరి రైళ్లు ఆలయాన్ని ఎలా దాటుతాయి?
అయితే ఆలయం రైల్వే పట్టాలపై అడ్డంగా ఉండదు. రెండు రైల్వే ట్రాక్‌ల మధ్య ఖాళీ ప్రాంతంలో ఉంటుంది. అందువల్ల రైళ్లు ఆలయానికి రెండు వైపులా ప్రయాణిస్తాయి. రైలు ఆలయానికి చాలా దగ్గరగా వెళ్లే సమయంలో ఆలయ తలుపులు మూసివేస్తారట. ఎందుకంటే ఆలయం లోపల దీపాలు కొండెక్కి పోకూడదని ఇలా చేస్తారట. ఈ రైల్వే స్టేషన్ గుండా పెద్ద సంఖ్యలో రైళ్లు ప్రయాణిస్తాయి.
రైలు ప్రయాణికులకు కూడా ప్రత్యేక అనుభూతే
లయానికి స్థానిక భక్తులతో పాటు రైల్వే ఉద్యోగులు, ప్రయాణికులు కూడా వస్తుంటారు. ముఖ్యంగా నవరాత్రి సమయంలో ఆలయానికి భక్తుల రద్దీ పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో రైళ్లలో ప్రయాణించే వారు కూడా ఆలయం దగ్గర నుంచి ప్రసాదం తీసుకుంటారట.

