- Home
- Feature
- Silent Diwali : ఇక్కడ నిశ్శబ్ద దీపావళి.. ఒక్క టపాకాయ కూడా కాల్చకుండా పండగ జరుపుకునే వింత గ్రామం
Silent Diwali : ఇక్కడ నిశ్శబ్ద దీపావళి.. ఒక్క టపాకాయ కూడా కాల్చకుండా పండగ జరుపుకునే వింత గ్రామం
దీపావళి అంటే వెలుగుల పండగే కాదు శబ్దాల పండగ. ఈ పండక్కి దీపాలు వెలిగించడమే కాదు భారీగా టపాసులు కాలుస్తూ వేడుకలు జరుపుకుంటారు. కానీ ఓ గ్రామంలో టపాసుల శబ్దం లేకుండా నిశ్శబ్దంగా వేడుకలు జరుపుకుంటారట.

వింత దీపావళి వేడుకలు
Silent Diwali : దీపావళి పండగ అనగానే ముందుగా గుర్తొచ్చేది టపాసులే. ఈ వెలుగుల పండగపూట కుటుంబంలోని చిన్నాపెద్ద అంతాకలిసి ఇంటి ప్రాంగణంలో టపాసులు కాలుస్తారు. ముఖ్యంగా పెద్దపెద్ద శబ్దాలు చేసే లక్ష్మీ బాంబులు, ఆటం బాంబులు, థౌజండ్ వాలాలు, రాకెట్లు పేలుస్తుంటారు... ఎంత ఎక్కువ శబ్దం వస్తే ఆ టపాసులు అంత నాణ్యమైనవిగా భావిస్తారు. ఇంటిని దీపాలతో అలంకరించి పూజలు చేయడమే కాదు టపాసులు కాల్చడం దీపావళి పండగలో భాగమే... ఇవి లేకుండా ఈ పండగను ఊహించలేం.
అయితే ఇండియాలోని ఓ గ్రామంలో దీపావళి పండగను టపాసులు కాల్చకుండానే జరుపుకుంటారు. ఇంతకీ ఆ గ్రామం ఏది? అక్కడి ప్రజలు టపాసులు ఎందుకు కాల్చరు? ఈ నిశ్శబ్ద దీపావళి వెనకున్న స్టోరీ ఏమిటి? అనే ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
నిశ్శబ్ద దీపావళి జరుపుకునే గ్రామం ఏది?
తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి జిల్లా బల్లెన హళ్ళి గ్రామంలో దీపావళి పండగను చాలా విచిత్రంగా జరుపుకుంటారు. ఈ గ్రామస్తులంతా దీపావళి వేడుకలు జరుపుకుంటారు... దేశ ప్రజలందరి మాదిరిగానే ఇళ్లను పువ్వులు, దీపాలతో అలంకరిస్తారు. కానీ ఒక్క టపాకాయ కూడా కాల్చరు... ఇలా చాలా నిశ్శబ్దంగా పండగ జరుపుకుంటారు. గత 50 ఏళ్లుగా ఇలాగే టపాసుల శబ్దం లేకుండా నిశ్శబ్ద దీపావళి జరుపుకుంటున్నారు.
అయితే ఇలా గ్రామస్తులంతా సైలెంట్ గా దీపావళి పండగను జరుపుకోవడం వెనక పర్యావరణాన్ని కాపాడే ప్రయత్నం దాగుంది. ప్రజలంతా ఏకతాటిపై నిలబడి టపాసులు కాల్చకుండా పండగను జరుపుకుంటూ జంతుప్రేమను చాటుకుంటున్నారు.
గబ్బిలాల కోసమే నో క్రాకర్స్ ఫెస్టివల్
బల్లెన హళ్లి గ్రామంలో మనుషులతో పాటే వందల ఏళ్లుగా భారీగా గబ్బిలాలు నివాసం ఉంటున్నాయి. ఈ గ్రామంలోని చెట్లపై ఎక్కడచూసినా గబ్బిలాలే కనిపిస్తాయి... వీటితో గ్రామస్తులకు తరతరాల అనుబంధం ఉంది. ఆ గబ్బిలాలను గ్రామాన్ని కాపాడే దైవస్వరూపాలుగా ప్రజలు భావిస్తారు. అందుకే వీటి సంరక్షణ కోసం తమ ఆనందాన్ని కూడా వదులుకుని టపాసులు లేకుండానే దీపావళి పండగ జరుపుకుంటారు.
గతంలో దీపావళి పండగపూట అందరిలాగే ఈ గ్రామస్థులు కూడా టపాసులు కాల్చేవారు. కానీ ఓసారి పండక్కి టపాసులు కాల్చడంతో గబ్బిలాలు చెల్లాచెదురైపోయాయట... ఆ తర్వాత ఊరిలో అనేక అనర్థాలు జరిగాయని అక్కడి ప్రజలు చెబుతుంటారు. ఇలా ప్రజలంతా ఇబ్బందుల్లో ఉండగా కొంతకాలం తర్వాత గబ్బిలాలు తిరిగి గ్రామంలోకి వచ్చాయని... ఆ తర్వాత ప్రజలు సమస్యలన్నీ తొలగిపోయాయని చెబుతారు. దీంతో ఈ గబ్బిలాలు తమ గ్రామానికి రక్షగా భావించసాగారు.. అందుకే ఇక ఎప్పటికీ ఈ గబ్బిలాలను హాని కలగకుండా చూసుకోవాలని గ్రామస్థులు తీర్మానించారు. అందుకే టపాసుల శబ్దం లేకుండానే దీపావళి జరుపుకుంటున్నారు.
ఆసక్తికర విషయం ఏమిటంటే కేవలం దీపావళి పండక్కే కాదు న్యూఇయర్ వేడుకలు, పెళ్లిల్లు, ఇతర శుభకార్యాలకు కూడా టపాసులు కాల్చడం ఈ బల్లెనా హళ్ళిలో నిషేధం. గబ్బిలాలను హాని కలిగించే ఏ చర్యలనైనా గ్రామస్థులు వ్యతిరేకిస్తారు... వీటి సంరక్షణకు కఠిన ఆంక్షలు అమలుచేస్తున్నారు. ఇలా సాధారణ పక్షుల కోసం తమ సాంప్రదాయాలను సైతం మార్చుకున్నారు ఈ గ్రామస్థులు... జంతుప్రేమను చాటుకుంటున్నారు.













