Rain Facts : వర్షాన్ని ఎలా కొలుస్తారు? మిల్లీమీటర్, సెంటీమీటర్ వర్షం అంటే ఎంత?
వాతావరణ శాఖ అధికారులు వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు? ఇక్కడ ఇన్ని మిల్లిమీటర్లు, అక్కడ అన్ని సెంటిమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని ప్రకటిస్తుంటారుగా… అసలు ఈ మిమీ, సెంమీ వర్షపాతం అంటే ఎంత?

వర్షం గురించి ఆసక్తికర విషయాలు
Weather Fact : వర్షం అనేది మన దైనందిన జీవితంలోనూ, వ్యవసాయంలోనూ అత్యంత కీలకమైన అంశం. వాతావరణ హెచ్చరికలు చూస్తున్నప్పుడు "ఇన్ని మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది" లేదా "రాగల 24 గంటల్లో భారీ వర్షం పడే అవకాశం ఉంది" అనే వార్తలను మనం తరచూ వింటూ ఉంటాం. తాజాగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి... రాబోయే ఒకటి రెండ్రోజుల్లో 300 నుండి 400 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ వంటి వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అయితే చాలామందికి ఈ మిల్లిమీటర్లు, సెంటిమీటర్లు వర్షపాతం అంటే ఎంతో తెలియదు. కాబట్టి అసలు మిల్లీమీటర్ లేదా సెంటీమీటర్ వర్షం అంటే ఎంత నీరు పడినట్లు? వాతావరణంలో తేలికపాటి, భారీ, అత్యంత భారీ వర్షాలను ఎలా వర్గీకరిస్తారు? అసలు వర్షపాతాన్ని వాతావరణ విభాగం (IMD - India Meteorological Department) ఎలా కొలుస్తుంది? అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు?
వాతవారణ శాఖ అధికారులు వర్షపాతాన్ని కొలవడానికి ప్రత్యేక పద్దతులను ఉపయోగిస్తారు. అయితే ప్రధానంగా రైన్ గేజ్ (Rain Gauge) లేదా వర్షమాపకం అనే పరికరాన్ని ఇందుకోసం ఉపయోగిస్తారు. భారత వాతావరణ శాఖ దేశవ్యాప్తంగా వివిధ రకాల వర్షమాపకాలను ఏర్పాటు చేసి సమాచారాన్ని సేకరిస్తుంది.
1. సిమన్స్ రైన్ గేజ్ (Symons Rain Gauge)
ఇది ఒక సాంప్రదాయకమైన పరికరం. ఇందులో ఒక స్థూపాకార పాత్ర, దానికి అమర్చిన గరాటు (Funnel) ఉంటాయి. వర్షం పడినప్పుడు నీరు గరాటు ద్వారా లోపల ఉన్న కొలతల సీసాలోకి చేరుతుంది. ప్రతిరోజూ ఉదయం 8:30 గంటలకు ఈ నీటి మట్టాన్ని కొల పాత్ర (Measuring Jar) ద్వారా కొలిచి నమోదు చేస్తారు.
2. ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు (AWS - Automatic Weather Stations)
ఆధునిక సాంకేతికతలో భాగంగా టిప్పింగ్ బకెట్ (Tipping Bucket) రైన్ గేజ్‌లను ఉపయోగిస్తున్నారు. ఇందులో చిన్న చిన్న బకెట్లు ఉంటాయి. ప్రతి 0.2 mm నీరు నిండగానే బకెట్ కిందకు వాలిపోయి నీటిని ఖాళీ చేస్తుంది. ఈ ప్రక్రియ ద్వారా డిజిటల్ సిగ్నల్స్ ఉత్పన్నమై, డేటా నేరుగా ఐఎండీ సర్వర్‌కు చేరుతుంది.
డాప్లర్ వెదర్ రాడార్లు (Doppler Weather Radar)
ఇవి ఆకాశంలో మేఘాల సాంద్రత, విస్తరణ, వర్షపు తీవ్రతను క్షేత్రస్థాయిలో క్షణాల్లో అంచనా వేయడానికి ఉపయోగిస్తారు. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి వర్షపాతాన్ని అంచనావేసే పద్దతి ఇదే.
మిల్లీమీటర్ (mm) లేదా సెంటీమీటర్ (cm) వర్షం అంటే ఎంత?
సాధారణంగా ప్రజలకు "1 మిల్లీమీటర్ వర్షం లేదా 1 సెంటీమీటర్ వర్షం" అంటే ఎంత నీరో ఊహించడం కొంచెం కష్టంగా ఉంటుంది. దీన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న శాస్త్రీయ ఉదాహరణ చూద్దాం.
మిల్లీమీటర్ (mm) వర్షం
పూర్తిగా సమతలంగా ఉండి, ఎక్కడా నీరు కిందకు ఇంకిపోకుండా, ఆవిరి కాకుండా, పక్కకు ప్రవహించకుండా ఉండే ఒక చదరపు మీటర్ వైశాల్యం గల ఉపరితలాన్ని ఊహించుకోండి. ఈ చదరపు మీటరు స్థలంలో నీరు 1 మిల్లీమీటర్ ఎత్తు వరకు నిలిస్తే దాన్నే 1 mm వర్షపాతం అంటారు. అదే 10 మిల్లీమీటర్ల నీరు నిలిస్తే 1 సెంటీమీటర్ అన్నమాట.
వర్షపాత తీవ్రత వర్గీకరణ
భారత వాతావరణ శాఖ 24 గంటల వ్యవధిలో (ఉదయం 8:30 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 8:30 గంటల వరకు) నమోదయ్యే వర్షపాతం పరిమాణాన్ని బట్టి వర్షపు తీవ్రతను వర్గీకరిస్తుంది. దీన్నిబట్టే తేలికపాటి, సాధారణ, భారీ వర్షాలు కురిశాయని ప్రకటిస్తుంది.
అతి తేలికపాటి వర్షం (Very Light Rain) : 2.4 mm లోపు వర్షపాతం నమోదయితే
తేలికపాటి వర్షం (Light Rain) : 2.5 mm నుండి 15.5 mm వర్షపాతం నమోదయితే
సాధారణ వర్షం (Moderate Rain) : 15.6 mm నుండి 64.4 mm వర్షపాతం నమోదయితే
భారీ వర్షం (Heavy Rain) : 64.5 mm నుండి 115.5 mm వర్షపాతం నమోదయితే (రోడ్లపై నీరు నిలిచేంత పెద్ద వర్షం)
అతి భారీ వర్షం (Very Heavy Rain) : 115.6 mm నుండి 204.4 mm వర్షపాతం నమోదయితే (వాగులు, వంకలు పొంగిపొర్లే స్థాయిలో వర్షం)
అత్యంత భారీ వర్షం (Extremely Heavy Rain) : 204.5 mm లేదా అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదయితే (తీవ్రమైన వరదలకు దారితీసే వర్షం)
క్లౌడ్ బరస్ట్ (Cloudburst) అంటే ఏమిటి?
చాలామంది మేఘ విస్ఫోటంను (Cloudburst) కేవలం అత్యంత భారీ వర్షం అనుకుంటారు. కానీ ఐఎండి ప్రకారం... కేవలం 1 గంట వ్యవధిలో, దాదాపు 20 నుండి 30 చదరపు కిలోమీటర్ల చిన్న ప్రాంతంలో 100 మిల్లీమీటర్లు (10 సెం.మీ) లేదా అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదైతే దాన్ని 'మేఘ విస్ఫోటం' అంటారు. ఇది కొండచరియలు విరిగిపడటానికి, ఆకస్మిక వరదలకు (Flash Floods) కారణమవుతుంది.
వర్షపాతాన్ని కొలవడం వల్ల ఉపయోగాలేంటి?
వర్షపాత డేటా కేవలం రోజువారీ వాతావరణ వార్తల కోసం మాత్రమే కాదు. విభిన్న రంగాల్లో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
వ్యవసాయ రంగం : ఏ పంటలు వేయాలి, ఎప్పుడు విత్తనాలు చల్లాలు, ఎప్పుడు నీటి యాజమాన్యం చేపట్టాలో నిర్ణయించుకోవడానికి రైతులకు వర్షపాత గణాంకాలు అవసరం.
విపత్తు నిర్వహణ : భారీ వర్షాల హెచ్చరికల ద్వారా ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించవచ్చు.
పట్టణ ప్రణాళిక (Urban Planning) : నగరాల్లో డ్రైనేజీ వ్యవస్థలు, కల్వర్టుల సామర్థ్యాన్ని డిజైన్ చేయడానికి గత వర్షపాత రికార్డులే ఆధారం.
జలవనరుల నిర్వహణ : ప్రాజెక్టులు, ఆనకట్టల్లోకి వచ్చే నీటి ప్రవాహాన్ని (Inflow) అంచనా వేసి గేట్లు ఎత్తడం, నీటిని నిల్వ చేయడం వంటి చర్యలకు వర్షపాత లెక్కలు ప్రామాణికం.
వర్షపాతం అనేది కేవలం ఆకాశం నుంచి పడే నీటిబొట్లు మాత్రమే కాదు, అది మన పర్యావరణ చక్రానికి, నీటి లభ్యతకు ప్రాణాధారం. మిల్లీమీటర్లు, సెంటీమీటర్లలో కొలిచే వర్షపాతం వాతావరణ స్థితిగతులను శాస్త్రీయంగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఐఎండీ అందించే ఈ వర్షపాత వర్గీకరణలను అవగాహన చేసుకోవడం ద్వారా ప్రతి ఒక్కరూ వాతావరణ మార్పుల పట్ల, ప్రకృతి వైపరీత్యాల పట్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకోగలుగుతారు.

