Pizza Capital: ఏంటీ పిజ్జాకు ఓ పుట్టినిల్లు ఉందా? ఇక్కడి పిజ్జా స్పెషాలిటీలే వేరు
Pizza Capital: పిజ్జా అనగానే నోరూరిపోతుంది. చీజ్ తో, క్రిస్పీగా, టాపింగ్స్ తో చూడగానే నీళ్లూరాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడే ఈ పిజ్జా వెనుక వందల ఏళ్ల చరిత్ర ఉంది. పిజ్జాకు పుట్టినిల్లుగా ఓ నగరానికి ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. ఎక్కడుందో తెలుసా?

పిజ్జా పుట్టినిల్లు
ఇటలీలోని నేపుల్స్ నగరాన్ని ప్రపంచ పిజ్జా రాజధానిగా పిలుస్తారు. పిజ్జా పుట్టినిల్లుగా ఈ నగరానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా ఇక్కడి సంప్రదాయ నియాపోలిటన్ పిజ్జా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. 18వ శతాబ్దంలో నేపుల్స్‌లో సాధారణ ఫ్లాట్‌బ్రెడ్‌లపై టమాటాలు, ఇతర పదార్థాలు వేసే పద్ధతి మొదలైంది. ప్రస్తుతం ప్రపంచంలోని ఎన్నో దేశాల్లో పిజ్జా రకరకాల దొరుకుతున్నా..దాని సంప్రదాయ రుచిని ఆస్వాదించాలనుకునేవారు నేపుల్స్ గురించే చెప్పుకుంటారు.
నియాపోలిటన్ పిజ్జా ప్రత్యేకత ఏమిటి?
నేపుల్స్‌లో తయారయ్యే ఈ పిజ్జా డిఫరెంట్ గా ఉంటుంది. దీని అంచులు మెత్తగా, గాలితో ఉబ్బినట్లుగా ఉంటాయి. మధ్యభాగం పల్చగా ఉంటుంది. అధిక ఉష్ణోగ్రత వద్ద కట్టెల పొయ్యిలోనే తక్కువ టైంలోనే కాల్చడం వల్ల అంచులపై అక్కడక్కడా నల్లటి మచ్చలు కనిపిస్తాయి. ఇవి ఆ పిజ్జాకు ప్రత్యేకమైన రుచిని, రూపాన్ని ఇస్తాయి.
దీని తయారీలో పిండి, నీరు, ఉప్పు, ఈస్ట్‌తో తయారుచేసిన పిండిముద్దను ఉపయోగిస్తారు. పిజ్జా బేస్‌ను చేతులతోనే సాగదీస్తారు. రోలింగ్ పిన్ వాడరు. టాపింగ్స్ విషయంలోనూ ఎక్కువ పదార్థాలు వేయడం కంటే నాణ్యమైన, ఫ్రెష్ పదార్థాలకే ప్రాధాన్యం ఇస్తారు.
శాన్ మార్జానో టమాటాలు, మొజరెల్లా చీజ్ వంటి పదార్థాలు నియాపోలిటన్ పిజ్జాలో ఉపయోగిస్తారు. ఈ పదార్థాల రుచి, పిండిని తయారుచేసే విధానం, కాల్చే పద్ధతి వల్ల పిజ్జాకు ప్రత్యేకమైన రుచిని అందిస్తాయి.
నేపుల్స్‌లో ప్రసిద్ధి చెందిన రెండు పిజ్జాలు
మార్గెరిటా పిజ్జా: టమాటా సాస్, మొజరెల్లా చీజ్, తులసి ఆకులతో తయారుచేస్తారు. వీటిలోని ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ రంగులను ఇటలీ జాతీయ పతాకంలోని రంగులతో పోలుస్తారు. సరళమైన పదార్థాలతో తయారైనా, రుచిలో ప్రత్యేకత కలిగిన పిజ్జాగా ఇది గుర్తింపు పొందింది.
మరీనారా పిజ్జా: టమాటాలు, వెల్లుల్లి, ఒరేగానో, ఆలివ్ ఆయిల్‌తో తయారుచేస్తారు. ఇందులో చీజ్ ఉండదు. పదార్థాలు తక్కువగా ఉన్నప్పటికీ, వాటి సహజ రుచికి ఇంపార్టెన్స్ ఇస్తారు.
నేపుల్స్‌లో పిజ్జా ఓ ఆహారం మాత్రమే కాదు!
నేపుల్స్ వీధుల్లో చిన్నచిన్న పిజ్జా దుకాణాలు కనిపిస్తాయి. వీటిలో కొన్ని తరతరాలుగా కొనసాగుతున్నాయి. ఇక్కడి స్థానికులు పిజ్జాను రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకుంటారు. మనకు రోడ్లపై బజ్జీలు, జిలేబీలు తింటున్నట్లు...ఇక్కడ కూడా ఫ్రెష్ గా తయారైన పిజ్జాను అక్కడికక్కడే తింటూ కనిపిస్తారు.
పిజ్జా తయారీకి సంబంధించిన సంప్రదాయ కళకు కూడా అంతర్జాతీయ గుర్తింపు లభించింది. నియాపోలిటన్ పిజ్జా తయారీ కళను 2017లో యునెస్కో మానవాళి అమూర్త సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్చింది. ఈ పిజ్జా తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయం.
న్యూయార్క్, చికాగో పిజ్జాలతో పోలిస్తే..
అమెరికాలోని న్యూయార్క్, చికాగో నగరాలు కూడా తమ ప్రత్యేకమైన పిజ్జాలతో ప్రసిద్ధి చెందాయి. న్యూయార్క్ పిజ్జా సాధారణంగా పెద్దగా, పలుచగా ఉండి మడతపెట్టి తినడానికి అనుకూలంగా ఉంటుంది. చికాగో డీప్ డిష్ పిజ్జా మాత్రం మందమైన బేస్‌తో, ఎక్కువ టాపింగ్స్‌తో తయారవుతుంది.
అయితే సంప్రదాయ నియాపోలిటన్ పిజ్జా రుచి, దాని చారిత్రక నేపథ్యం కారణంగా నేపుల్స్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ప్రపంచవ్యాప్తంగా పిజ్జాకు రుచులు వేరుగా ఉన్నా..దాని సంప్రదాయ మూలాలను తెలుసుకోవాలనుకునేవారికి ఈ ఇటాలియన్ నగరం ఓ ప్రత్యేకంగా నిలుస్తోంది.
అందుకే నేపుల్స్‌ను పిజ్జా రాజధానిగా గుర్తిస్తారు. ఇక్కడి ప్రతి పిజ్జా ముక్క వెనుక స్థానికుల ఆహార సంస్కృతి, తరతరాల నైపుణ్యం, సంప్రదాయ రుచుల కథ దాగి ఉంటుంది.

