- Home
- Feature
- Motivational Story: ఇది ఇలాగే ఉండదు.. దీని అర్థం తెలిస్తే జీవితంలో అస్సలు బాధపడరు. మంచి నీతి కథ
Motivational Story: ఇది ఇలాగే ఉండదు.. దీని అర్థం తెలిస్తే జీవితంలో అస్సలు బాధపడరు. మంచి నీతి కథ
Motivational Story: జీవితంలో కష్టాలు రావడం సర్వసాధారణం. అయితే ఏదీ శాశ్వతం కాదన్న సత్యాన్ని తెలుసుకుంటే బాధ మన దరిచేరదు. అలాంటి గొప్ప నీతిని అందించే ఒక కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రైతు - ఆవు కథ
అనగనగా ఒక ఊరిలో అంజన్న అనే రైతు ఉండేవాడు. అతనికి ఒక ఆవు ఉండేది. దాంతో అతను పొలం దున్నడం, పాలు పితకడం లాంటివి చేస్తుండే వాడు. ఆ ఆవు ఒక్కటే అతనికి జీవనాధారం. అయితే ఒక రోజు ఆవు ఉన్నట్లుండి తప్పిపోయింది. దీంతో రైతు ఉపాధి కోల్పోయాడు.
ప్రశాంతంగా స్పందించిన రైతు
ఆవు కోల్పోయిన రైతును పరామర్శించేందుకు అంతా వచ్చారు. నీకు బాధే మిగిలింది. అదృష్టం ఎంత చెడ్డదో చూశావా? ఆవు లేకుండా నువ్వు ఎలా బతుకుతావు.? అని ప్రశ్నిస్తారు. దీంతో రైతు ప్రశాంతంగా స్పందిస్తూ.. “సుఖం – దుఃఖం ఎప్పటికీ ఒకేలా ఉండవు. ఏమి జరగబోతుందో మనకు తెలియదు.” అని బదులిస్తాడు.
కొన్ని రోజులకు మిరాకిల్
కొన్ని రోజులు గడిచాక ఆ ఆవు తిరిగి వచ్చింది. అయితే ఆ ఆవు ఒంటరిగా కాకుండా రెండు దూడలను వెంటబెట్టుకొని వచ్చింది. దీంతో ఊరంతా ఆశ్చర్యపోయి.. అబ్బా ఈ రైతు అదృష్టం భలే ఉంది. ఒక ఆవు పోయిందని అనుకుంటే రెండు వచ్చాయి. ఇంకేంటి బిందాస్ అంటారు. దీనికి రైతు బదులిస్తూ.. “సుఖం – దుఃఖం మారుతూ ఉంటాయి. ఇది కూడా ఎక్కువ రోజులు నిలబడకపోవచ్చు.” అని చెప్తాడు.
మళ్లీ కొన్ని రోజులకు ఓ సమస్య
అంతా సవ్యంగా సాగుతోందని అనుకుంటున్న సమయంలోనే రైతుకు మరో సమస్య వస్తుంది. రైతు కొడుకు ఆవుతో దున్నుతోన్న సమయంలో గాయం అవుతుంది. కాలు చివరన వేలు కట్ కావడంతో నడవలేని స్థితిలో ఉంటాడు. దీంతో ప్రజలంతా..“నీ కుమారుడికి ఎంత కష్టం వచ్చింది. అదృష్టం అంతలోనే పోయింది” అని అంటారు. కానీ రైతు మాత్రం ప్రశాంతంగా మళ్లీ.. “సుఖం – దుఃఖం ఎప్పటికీ ఒకేలా ఉండదు.” అని బదులిస్తాడు. కొన్ని నెలల పక్క రాజ్యంలో యుద్ధం జరుగుతుంది. దీంతో రాజు ఊరిలోని కొందరు యువకులను సైన్యంలో చేరమని అడుగుతారు. దీంతో గ్రామంలోని పేరెంట్స్ అంతా తమ పిల్లలను పంపేందుకు భయపడతారు. అయితే రైతు కొడుకు గాయపడిన కారణంగా యుద్ధానికి వెళ్లడు. దీంతో రైతుకు మళ్లీ లాభం చేకూరుతుంది.
గొప్ప నీతి
ఈ కథలో గొప్ప నీతి ఉంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన మాట ఇదే భావాన్ని వ్యక్తం చేస్తుంది:
“మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణసుఖదుఃఖదాః।
ఆగమాపాయినోఽనిత్యాస్తాంస్తితిక్షస్వ భారత॥”
(గీతా – 2:14)
దీని అర్థం ఇంద్రియాలు కలిగించే సుఖాలు, దుఃఖాలు వేసవి, శీతాకాలం లాంటివి. అవి వస్తూ పోతూ ఉంటాయి. నిత్యమైనవి కావు. వాటిని సహనంతో ఎదుర్కొనాలి. కాబట్టి జీవితంలో సుఖం, దుఃఖం ఎప్పటికీ స్థిరంగా ఉండవు. ఇవి అలల లాంటివి. ఒక్కసారి ఎగసిపడతాయి, మరొకసారి తగ్గిపోతాయి. మనం సహనంగా ఉండి, మన మనసును స్థిరంగా ఉంచుకోవాలి. అప్పుడు నిజమైన శాంతి లభిస్తుంది.