వదిలేయడమే నిజమైన సంతోషం.. కాకి, చికెన్ ముక్క కథ చదివితే జీవితమే మారుతుంది
Motivational story: సంతోషమంటే ఎక్కువ సంపాదించాలి, పేరు తెచ్చుకోవాలి చాలా మంది ఆలోచన ఇదే. కానీ నిజమైన ఆనందం ఎప్పుడూ మనం ఏమి సంపాదించామనే దానిలో కాదు, అవసరం లేని వాటిని ఎప్పుడు వదిలిపెట్టామనే దానిలో ఉంటుందనే సత్యాన్ని చాటే ఓ కథ ఇప్పుడు తెలుసుకుందాం

చికెన్ ముక్కతో మొదలైన ప్రయాణం
ఒకరోజు ఒక కాకి ఎక్కడో ఒక చోట నుంచి చిన్న చికెన్ ముక్కను సంపాదించింది. ఆ ముక్కను నోటితో గట్టిగా పట్టుకుని, ఎవరూ చూడకుండా ప్రశాంతంగా కూర్చుని తినాలని అనుకుంది. తన అదృష్టాన్ని చూసుకుని ఎంతో ఆనందంగా ఆకాశంలో ఎగురుతూ ముందుకు సాగింది. తనకు దొరికిన ఆహారాన్ని ఆస్వాదించాలనే ఆలోచన తప్ప దానికి మరో కోరిక ఏదీ లేదు. కానీ జీవితం అనుకున్నట్టుగా సాగలేదు.
చికెన్ ముక్క కనిపించగానే మొదలైన పోరాటం
కాకి నోటిలో ఉన్న చికెన్ ముక్కను చూసిన మరికొన్ని కాకులు, డేగలు, గద్దలు వంటి బలమైన పక్షులు వెంటనే దాని వెనుక పడ్డాయి. ఎటు వెళ్లినా వెంటాడుతూ, దాడి చేయడానికి ప్రయత్నించాయి. ఆ ముక్కను లాక్కోవాలనే ఉద్దేశంతో కాకిని ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా ఉండనివ్వలేదు. కాకి ఎడమవైపు తిరిగింది... అవి కూడా వచ్చాయి. కుడివైపు ఎగిరింది... అవి కూడా వెంటపడ్డాయి. ఎత్తుకు వెళ్లింది... అవి కూడా అక్కడికే చేరుకున్నాయి. ఎంత దూరం ఎగిరినా, ఎంత వేగంగా వెళ్లినా ఆ వెంటాడటం మాత్రం ఆగలేదు.
అలసిపోయిన కాకికి తెలిసిన గొప్ప నిజం
కొంతసేపటికే కాకి పూర్తిగా అలసిపోయింది. రెక్కలకు శక్తి తగ్గింది. ఊపిరి సలపలేదు. అప్పుడే అది ఒక్కసారి ఆలోచించడం ప్రారంభించింది. "ఈ పక్షులు నిజంగా నన్ను వెంటాడుతున్నాయా? లేక నా నోటిలో ఉన్న చికెన్ ముక్కను వెంటాడుతున్నాయా?" అని తనను తాను ప్రశ్నించుకుంది. కొద్దిసేపు ప్రశాంతంగా ఆలోచించగానే దానికి ఒక గొప్ప సత్యం అర్థమైంది. తాను చికెన్ ముక్కను పట్టుకున్నంత కాలం ఈ బాధ, ఈ భయం, ఈ పరుగులు తప్పవని గ్రహించింది. సమస్య తనలో లేదని... తాను పట్టుకుని ఉన్న దానిలోనే ఉందని తెలుసుకుంది.
వదిలేసిన క్షణమే దొరికిన మనశ్శాంతి
ఆ ఆలోచన వచ్చిన వెంటనే కాకి ఎలాంటి సందేహం లేకుండా తన నోటిలో ఉన్న చికెన్ ముక్కను కింద పడేసింది. చికెన్ ముక్క నేలపై పడగానే వెంటాడుతున్న అన్ని పక్షులు ఒక్కసారిగా దాని వైపు దూసుకెళ్లాయి. క్షణం క్రితం వరకు కాకిని వెంటాడిన వాటికి ఇప్పుడు కాకితో పనిలేదు. అవన్నీ చికెన్ ముక్క కోసం పోటీ పడటం ప్రారంభించాయి. కాకి మాత్రం నెమ్మదిగా వెళ్లి ఒక చెట్టు కొమ్మపై ప్రశాంతంగా కూర్చుంది. చాలా సేపటి తర్వాత స్వేచ్ఛగా గాలి పీల్చుకుంది. దాని మనసులో భయం లేదు... పరుగులు లేవు... పోటీ లేదు... కేవలం ప్రశాంతత మాత్రమే ఉంది. అప్పుడు కాకికి అర్థమైంది... తాను చికెన్ ముక్కను కోల్పోలేదు, బాధను వదిలించుకున్నా అని.
జీవితానికి మార్గం చూపే గొప్ప సందేశం
మన జీవితాలు కూడా ఆ కాకి కథకు చాలా దగ్గరగా ఉంటాయి. కొందరం డబ్బు కోసం పరుగులు తీస్తుంటాం. మరికొందరం పేరు, ప్రతిష్ఠ, హోదా, అహంకారం, ఇతరుల ప్రశంసలు, పోలికలు, కోపం, పగ వంటి వాటిని గట్టిగా పట్టుకుని ఉంటాం. వాటిని కోల్పోతామనే భయంతో ప్రశాంతతను కోల్పోతాం. మనం పట్టుకుని ఉన్న ప్రతి విషయం ఆనందాన్ని ఇవ్వదు. కొన్ని విషయాలు మన జీవితంలో భారం మాత్రమే అవుతాయి. వాటిని వదిలేస్తేనే నిజమైన స్వేచ్ఛ, మనశ్శాంతి, సంతోషం దొరుకుతాయి. జీవితంలో గొప్పవాడు ఎక్కువ సంపాదించినవాడు కాదు... అవసరం లేని భారాన్ని వదిలేయగలిగినవాడు. సంతోషంగా జీవించాలంటే ఏమి పట్టుకోవాలో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో... ఏమి వదిలేయాలో తెలుసుకోవడం అంతకంటే గొప్ప జ్ఞానం. అదే నిజమైన విజయం, అదే నిజమైన ఆనందం.

