Cancer: మనదేశంలో ఏ రాష్ట్రంలోని పిల్లల్లో క్యాన్సర్ కేసులు ఎక్కువగా ఉన్నాయి?
Cancer: క్యాన్సర్ రోగుల సంఖ్య మనదేశంలో రోజురోజుకి పెరుగుతోంది. పెద్దల్లోనే కాదు పిల్లల్లో కూడా ఈ సంఖ్య అధికంగానే ఉంది. ఎయిమ్స్ నివేదిక ప్రకారం ఏ రాష్ట్రంలో క్యాన్సర్ బాధిత పిల్లలు అధికంగా ఉన్నారో తెలుసా? తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏమిటి?

ఏ రాష్ట్రంలో పిల్లల్లో క్యాన్సర్ ఎక్కువ?
భారతదేశంలో చిన్నపిల్లల క్యాన్సర్ తీవ్రతపై 'జర్నల్ ఆఫ్ క్యాన్సర్ పాలసీ' నివేదిక కీలక అంశాలను వెల్లడించింది. ఎయిమ్స్ పరిశోధకులు దేశవ్యాప్తంగా 22 వేలకు పైగా చిన్నారుల క్యాన్సర్ కేసులను పరిశీలించి ఈ నివేదికను రూపొందించారు. మన దేశంలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో 22.6 శాతం (5,057 కేసులు) నమోదయ్యాయి. ఆ తర్వాత ఢిల్లీ 19.2 శాతం, తమిళనాడు 18 శాతం (4,010 కేసులు) బాధితులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 6.1 శాతం వాటాతో 1,354 కేసులను నమోదు చేసింది. పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో కూడా బాధితుల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. పెద్ద రాష్ట్రాల్లో సరైన అవగాహన లోపించడం, గ్రామీణ ప్రాంతాల్లో సరైన ప్రాథమిక వైద్య సదుపాయాలు లేకపోవడం వల్ల వ్యాధి ముదిరిన తర్వాతే ఆసుపత్రులకు చేరుకుంటున్నారు.
పిల్లల్లో ఇలాంటి సమస్యలే
బాధిత కుటుంబాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ఈ అధ్యయనం ప్రత్యేక దృష్టి పెట్టింది. చికిత్స కోసం దాదాపు 60 శాతానికి పైగా కుటుంబాలు కనీసం రెండు గంటలకు పైగా ప్రయాణం చేయాల్సి వస్తోంది. రక్త క్యాన్సర్ బాధితులతో పోలిస్తే, శరీరంలో కణితులు (సాలిడ్ ట్యూమర్లు) ఉండే పిల్లలకు క్లిష్టమైన సర్జరీలు, రేడియేషన్ చికిత్సలు కావాలి. వీటి కోసం మరింత దూరం ప్రయాణించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. సుదూర ప్రయాణాలు, భారీగా పెరిగే ఖర్చులు, నగరాల్లో ఉండటానికి వసతి లేకపోవడం వల్ల చాలా కుటుంబాలు ఆర్థికంగా తట్టుకోలేకపోతున్నాయి. ఫలితంగా పిల్లలకు వైద్యం పూర్తికాకముందే మధ్యలోనే ఆపేస్తున్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి.
పిల్లలను కాపాడుకోవాలి
ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి వైద్య రంగంలో సమూల మార్పులు అవసరమని పరిశోధకులు సూచించారు. క్యాన్సర్ చికిత్స కేవలం మెట్రో నగరాలకు మాత్రమే పరిమితం కాకుండా, జిల్లా స్థాయిలోనే చిన్నపిల్లల క్యాన్సర్ విభాగాలు ఏర్పాటు చేయాలి. వ్యాధి లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించడానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. ప్రభుత్వాలు రవాణా సదుపాయాలు కల్పించి ఆర్థిక భారాన్ని తగ్గిస్తే, పేద కుటుంబాలు చికిత్సను అర్ధాంతరంగా ఆపకుండా పిల్లలను కాపాడుకోగలుగుతాయి.













