మురుగు నీటితో స్నానం.. చెత్త అమ్ముకుంటున్న జనం, వజ్రాలు దొరికే దేశంలో ఎందుకీ పరిస్థితి
ఆ దేశం వజ్రాలు, బంగారు గనులకు ఫేమస్, కానీ ఆ దేశంలో పేదరికమే ఎక్కువ. జనాలు తిండి, నీడ కోసం కష్టపడాల్సిన పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో మురికినీటితో స్నానం.. చెత్తతో వ్యాపారం, ఒక గదిలో పదిమంది బ్రతుకుతూ.. ఇబ్బందులు పడుతున్నారు. ఇంతకీ ఏంటా దేశం?

ప్రపంచపు అంచున బతుకులు
ప్రపంచంలోనే అత్యంత పేద దేశాలలో ఒకటి మడగాస్కర్ (Madagascar). అక్కడి జీవన విధానం, అక్కడి మురికివాడల దుస్థితి, ప్రజల దైనందిన పోరాటాన్ని వివరిస్తూ ప్రముఖ తెలుగు ట్రావెల్ వ్లాగర్ ఒకరు వీడియో చేశారు. ఇంతకీ అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి. అంత ధారుణంగా ఉండటానికి కారణం ఏంటి?
మడగాస్కర్ దేశపు కఠిన వాస్తవాలు
యానిమేషన్ సినిమాల్లో రంగుల ప్రపంచంగా కనిపించే మడగాస్కర్ దేశం, వాస్తవ జీవితంలో మాత్రం ఊహకందని పేదరికంతో కొట్టుమిట్టాడుతోంది. రాజధాని అంతానానారివో (Antananarivo) నగరంలోని మురికివాడల్లో పర్యటించిన తెలుగు ట్రావెలర్ ఒకరు, అక్కడి ప్రజల దయనీయ పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించారు. ప్రపంచంలోనే అత్యధిక సహజ వనరులు, వజ్రాలు, బంగారాలు ఉన్న ఆఫ్రికా ఖండంలో ఇటువంటి దుస్థితి ఉండటం అత్యంత బాధాకరం
మురికివాడల్లో కఠిన జీవనం
కేవలం నాలుగు నుంచి ఆరు అడుగుల వెడల్పు ఉన్న చిన్నపాటి గదుల్లోనే నలుగురు ఐదుగురు సభ్యులు గల కుటుంబాలు జీవిస్తున్నాయి. కరెంటు సౌకర్యం లేక సోలార్ ప్యానెల్స్‌పై ఆధారపడుతూ, మురికి కాల్వల పక్కనే తాత్కాలిక నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. ఆ మురికి నీటినే స్నానానికి, బట్టల వాష్ చేయడానికి, ఇతన అవసరాలకు వాడుకుంటున్నారు. ఆ మురికి కాలువలోనే పిల్లలు ఈతకొట్టడం ఎంతో ప్రమాదం. కానీ అక్కడ ఇవన్నీ పంట్టించుకోవడంలేదు.
స్క్రాబ్ - రీసైక్లింగ్ వ్యాపారం
చెత్తాచెదారం, ప్లాస్టిక్ బాటిల్స్, పాత వైర్లు, హాస్పిటల్ వ్యర్థాలను సేకరించి, వాటిని శుభ్రం చేసి మళ్లీ అమ్ముకోవడం ఇక్కడి ప్రజల ప్రధాన జీవనాధారంగా ఉంది. ముఖ్యంగా, పాత ఇంజెక్షన్ సూదులను కూడా కడిగి మళ్లీ వాడుతున్న భయానక దృశ్యాలు ఇక్కడ కనిపిస్తాయి. దీనివల్ల హెచ్ఐవి (HIV) వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. వీటితో పాటు పాత టైర్లతో చెప్పులు తయారు చేయడం, పాత ఎలక్ట్రానిక్ వస్తువుల చిప్స్ విక్రయించడం, చెక్కలతో తయారు చేసిన బండ్లపై ప్రయాణించడం వంటి విభిన్న దృశ్యాలు ఇక్కడ కనిపిస్తాయి.
ఎంతో స్నేహంగా ఉండే జనాలు..
ఎంతటి పేదరికంలో మగ్గుతున్నప్పటికీ, మడగాస్కర్ ప్రజలు మాత్రం ఎంతో స్నేహపూర్వకంగా, పలకరింపులతో ఆకట్టుకుంటారు. చిన్న పిల్లలు రోడ్లపై ఆటలాడుకుంటూ సందడి చేస్తుంటారు. ఈ మురికివాడల్లోని పాత డివిడి సిట్ల మధ్య మన తెలుగు సినిమా 'బొమ్మరిల్లు' సినిమా సీడీ కనిపించడం విశేషం. సహజ వనరులకు నిలయమైన ఆఫ్రికా దేశాల ప్రజలు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న ఆర్థిక అసమానతలకు, దయనీయ పరిస్థితులకు మడగాస్కర్ ఒక నిదర్శనంగా నిలుస్తోంది.





