Salary: అమెరికాలో డ్రైవర్ల నెల జీతం ఎంత ఉంటుంది? భారీగా సంపాదన.. మరి ఖర్చుల సంగతేంటి?
Salary: అమెరికాలో చిన్నా పెద్ద ఉద్యోగులు అందరు ఎక్కువ మొత్తంలో సంపాదిస్తుంటారు. కానీ ఖర్చులు మాత్రం దాదాపుగా అందరికి ఒకేలా ఉంటాయి. అమెరికాలో సాఫ్ట్ వేర్లు, డాక్టర్ల సంగతి తెలిసిందే, మరి డ్రైవింగ్ చేసేవారి నెల జీతం ఎంత వస్తుంది? ఖర్చులు ఎలా ఉంటాయి?

అమెరికాలో ట్రక్ డ్రైవర్ల జీతం ఎంత?
అమెరికాలో డ్రైవర్ ఉద్యోగాలకు మంచి ఆదాయం ఉంటుందనే అభిప్రాయం చాలామందిలో ఉంది. ముఖ్యంగా ట్రక్ డ్రైవర్లు, డెలివరీ డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లకు అక్కడ ఎంత జీతం వస్తుంది? అక్కడ లైఫ్ స్టైలో ఎలా ఉంటుంది? కొన్ని గణాంకాల ఆధారంగా డ్రైవర్ల జీతాలు, పని గంటలు, ఖర్చులు, ఉద్యోగ అర్హతల గురించి తెలుసుకుందాం.
అమెరికా బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ గణాంకాల ప్రకారం, హెవీ ట్రక్, ట్రైలర్ డ్రైవర్ల మధ్యస్థ వార్షిక వేతనం 58,640 డాలర్లు. అంటే నెలకు సుమారు 4,887 డాలర్లు ఉంటుందని తెలుస్తోంది. ఒక డాలర్ విలువ సుమారు రూ.94.75గా తీసుకుంటే, భారతీయ కరెన్సీలో నెలకు దాదాపు రూ.4.63 లక్షలు వస్తాయి. ఇది పన్నులకు ముందు వచ్చే మొత్తం. ఈ జాబ్ లో తక్కువ సంపాదించే 10 శాతం మంది ఏడాదికి 40,140 డాలర్ల కంటే తక్కువ సంపాదిస్తుండగా, అత్యధికంగా సంపాదించే 10 శాతం మంది 79,380 డాలర్లకు పైగా సంపాదిస్తున్నారు.
ఇతర డ్రైవర్ ఉద్యోగాల జీతాలు
అమెరికాలో డ్రైవింగ్ ఉద్యోగాలు ట్రక్ డ్రైవింగ్‌కే పరిమితం కావు. డెలివరీ, చిన్న ట్రక్కులు, ఇతర వాహనాల డ్రైవింగ్‌లోనూ అవకాశాలు ఉన్నాయి. మరి వారు ఎంత సంపాదిస్తున్నారు అనేది చూస్తే.. హెవీ ట్రక్ డ్రైవర్ ఏడాదికి $58,640 డాలర్లు సంపాదిస్తారు. అంటే నెలకు మన కరెన్సీలో దాదాపు 4.63 లక్షలు సంపాదిస్తున్నారు.
ఇక లైట్ ట్రక్ డ్రైవర్ ఏడాదికి 44,860 డాలర్లు సంపాదిస్తుండగా.. నెలకు మన కరెన్సీలో దాదాపు 3.54 లక్షలు తీసుకుంటున్నారు. ఇక డెలివరీ డ్రైవర్ / సేల్స్ వర్కర్స్... ఇతర చిన్న డ్రైవర్లు ఏడాదికి దాదాపు 38,770 డాలర్లు సంపాదిస్తుంటారు. అంటే నెలకు ఇండియన్ కరెన్సీలో దాదాపు 3.06 లక్షలపైమాటే.
జీతంలో ఎంత మిగులుతుంది?
అమెరికాలో జీతాలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఖర్చులు కూడా ఎక్కువే. ఇంటి అద్దె, ఆహారం, ఆరోగ్య బీమా, కారు, ఇంధనం, పన్నుల కోసం డబ్బు ఖర్చు చేయాలి. న్యూయార్క్, కాలిఫోర్నియా వంటి ప్రాంతాల్లో జీవన వ్యయం ఎక్కువగా ఉండవచ్చు.
అందువల్ల నెలకు రూ.4.63 లక్షల జీతం వస్తే అంతా పొదుపు చేయవచ్చని అనుకుంటే పొరపాటే. ఫ్యామిలీతో ఉంటున్నారా? ఒంటరిగా ఉంటున్నారా? ఏ ప్రాంతంలో పనిచేస్తున్నారు? అనే అంశాలపై సేవింగ్స్ ఆధారపడి ఉంటుంది.
డ్రైవర్ల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది?
అమెరికాలో ట్రక్ డ్రైవర్ల జీవితం బయటకు కనిపించినంత సులభంగా ఉండదు. ముఖ్యంగా లాంగ్‌హాల్ డ్రైవర్లు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి సరుకులు రవాణా చేస్తుంటారు. అందువల్ల కొన్నిసార్లు రోజుల తరబడి, మరికొన్నిసార్లు వారాల పాటు కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. వారు ఎక్కువ సమయం ట్రక్కులోనే గడుపుతారు. ప్రయాణంలోనే భోజనం చేయడం, విశ్రాంతి తీసుకోవడం సాధారణం. మరోవైపు, స్థానిక డెలివరీ డ్రైవర్లకు ప్రతిరోజూ ఇంటికి తిరిగి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
పని గంటలు, విశ్రాంతి నిబంధనలు
అమెరికాలో ట్రక్ డ్రైవర్ల పని సమయాలపై ఫెడరల్ మోటార్ క్యారియర్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (FMCSA) నిబంధనలు ఉన్నాయి. వరుసగా 10 గంటల విశ్రాంతి తర్వాత గరిష్ఠంగా 11 గంటలు డ్రైవింగ్ చేయవచ్చు. డ్యూటీ ప్రారంభమైన తర్వాత 14 గంటల వ్యవధి దాటితే డ్రైవింగ్ చేయకూడదు. వరుసగా 8 గంటల డ్రైవింగ్ చేసినప్పుడు కనీసం 30 నిమిషాల విరామం అవసరం.ఈ నిబంధనలు డ్రైవర్ల అలసటను తగ్గించి రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ఉపయోగపడతాయి.
ఉద్యోగానికి కావాల్సిన అర్హతలు
అమెరికాలో హెవీ ట్రక్ డ్రైవర్‌గా పనిచేయడానికి కమర్షియల్ డ్రైవర్ లైసెన్స్ (CDL) తప్పనిసరి. సాధారణంగా ప్రొఫెషనల్ డ్రైవింగ్ శిక్షణ కూడా అవసరం. భారతీయులు అక్కడ ఉద్యోగం చేయాలంటే సంబంధిత చట్టబద్ధమైన పని అనుమతి ఉండాలి. అమెరికాలో డ్రైవింగ్ జాబ్స్ కు మంచి ఆదాయం ఉంది. ముఖ్యంగా ట్రక్ డ్రైవర్లకు సంవత్సరానికి రూ.55 లక్షలకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అయితే పని ఒత్తిడి, కుటుంబానికి దూరంగా ఉండటం, ఖర్చులు, టాక్స్ లను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.





