Biggest Bus Stand in India : ఇండియాలోనే అతిపెద్ద బస్టాండ్ ఏదో తెలుసా?
భారతదేశంలో అతిపెద్ద బస్టాండ్ ఏది, ఎక్కడుంది? మరి ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అతిపెద్ద బస్టాండ్స్ ఏవి? ఇలాంటి ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

ఇండియాలోనే అతి పెద్ద బస్టాండ్స్ ఇవే..
ప్రపంచస్ధాయిలో గుర్తింపుపొందిన రవాణా వ్యవస్థగా ఇండియన్ ఆర్టిసికి పేరుంది. దేశంలోని ప్రతి రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వ నిర్వహణలో RTC పనిచేస్తుంది... తమ ప్రజలను గమ్యస్థానాలకు చేరుస్తుంది. ఇలా దశాబ్దాలుగా తమకు సేవలు అందిస్తున్న ఆర్టిసితో దేశ ప్రజలు ప్రత్యేక అనుబంధాన్ని కలిగివున్నారు. ప్రజల సపోర్ట్ తో బాగా డెవలప్ అయిన రోడ్డు రవాణా సంస్థ (RTC) ప్రపంచమే విస్తుపోయేలా విస్తరించింది... ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాల్లో ఒకేసారి లక్షలాదిమందికి సేవలు అదించేంత పెద్ద బస్టాండులు నిర్మితమయ్యాయి. మరి దేశంలోనే అతిపెద్ద బస్టాండ్ ఏది? ఎక్కడుంది? తెలుగు రాష్ట్రాల్లో పెద్ద బస్టాండులు ఏవి? అనే ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.
దేశంలోనే అతిపెద్ద బస్టాండ్ ఏది?
భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకంగా ఆర్టిసి వ్యవస్థ ఉంది... కానీ దక్షిణాది రాష్ట్రాల్లో ఇది చాలా బలంగా ఉంది. కొన్ని బస్ స్టేషన్ల నుండి దేశంలోని అన్ని రాష్ట్రాలకు ప్రయాణించే ఆర్టిసి బస్సు సర్వీసులు ఉన్నాయి. ఇలా ఒకేసారి వందలాది బస్సులు నిలిపేందుకు వీలుగా, ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ తమిళనాడు రాజధాని చెన్నైలో కళైజ్ఞర్ సెంటెనరీ బస్ టెర్మినస్ (KCBT) నిర్మించారు. దీనినే కిలంబక్కం బస్టాండ్ అంటారు.
భారతదేశంలోనే అతిపెద్ద బస్టాండ్ గా ఈ కెసిబిటి గుర్తింపు పొందింది. ఇది చెన్నై నగర శివారులో దాదాపు 88.52 ఎకరాల్లో విస్తరించి ఉంది. కేవలం ఆర్టిసి బస్సులే కాదు ప్రైవేట్ బస్సులను కూడా నిలిపేలా ఏకంగా 215 ప్లాట్ ఫారమ్ లను కలిగివుంది. ఇక్కడినుండి ప్రతిరోజు లక్షమందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు... తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక వంటి దక్షిణాది రాష్ట్రాలకు కాదు దేశంలోని అనేక రాష్ట్రాలకు ఇక్కడినుండి బస్సు సర్వీసులు ఉన్నాయి. దీనిని 2023 లో ప్రారంభించారు.
ఇక కిలంబక్కం బస్టాండ్ తర్వాత రెండో అతిపెద్ద బస్టాండ్ దేశ రాజధాని న్యూడిల్లిలో ఉంది. డిల్లీలోని మిలీనియం పార్క్ బస్ డిపో 60 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడినుండి ప్రధానంగా ఉత్తరాది రాష్ట్రాలన్నింటికి బస్ సర్వీసులు ఉన్నాయి. రాజధాని నగరంలోనే కాదు ఇతర ప్రాంతాలకు వేలాది బస్సులు ఇక్కడినుండే నడుస్తాయి... లక్షలాదిమందిని గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి.
తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద బస్టాండ్ ఏది?
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా తెలుగువారు గర్వంగా చెప్పుకునే స్థాయిలో ఆర్టిసి వ్యవస్థ ఉంది... APSRTC, TSRTC ద్వారా వేలాది బస్సులు తెలుగువారికి సేవలు అందిస్తున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బస్టాండ్ ఆంధ్ర ప్రదేశ్ లో ఉంది... విజయవాడలోని పండిత్ నెహ్రూ బస్ స్టేషన్ (PNBS)ఏకంగా 28 ఎకరాల్లో విస్తరించి ఉంది... ఇక్కడ 62 ప్లాట్ ఫామ్స్ ఉన్నాయి. కృష్ణా నది ఒడ్డున గల ఈ బస్టాండ్ నుండి రోజూ వేలాదిమంది రాకపోకలు సాగిస్తుంటారు.
ఇక ఒకప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో అతిపెద్ద బస్టాండ్ మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (MGBS) ఉంది. మూసీ నది ఒడ్డున 20 ఎకరాల్లో ఈ బస్టాండ్ విస్తరించి ఉంది... మొత్తం 150 కి పైగా ప్లాట్ ఫామ్స్ ఉన్నాయి. ఇక్కడినుండి నిత్యం వేలాది బస్సులు నడుస్తాయి... తెలుగు రాష్ట్రాలకే కాదు కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఒడిషా, చత్తీస్ ఘడ్ వంటి రాష్ట్రాలకు కూడా బస్సు సర్వీసులు ఉన్నాయి. అంతేకాదు హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాలకు ఇక్కడనుండి సిటీ బస్సులు నడుస్తాయి. ఇతర బస్టాండులతో పోలిస్తే తక్కువ విస్తీర్ణంలో ఉన్నా రద్దీ పరంగా ఎంజిబిఎస్ టాప్ లో ఉంటుంది.













