Jalebi : ఏమిటీ.. జిలేబి ఇండియన్ స్వీట్ కాదా? ఏ దేశానిదో తెలుసా?
Jalebi: వేడి వేడి జిలేబీ, పక్కన సమోసా లేదా పకోడీ..అల్లం చాయ్. ఈ కాంబినేషన్ గుర్తొస్తేనే చాలామందికి నోరూరుతుంది. మనదేశంలో జిలేబీకి ఉన్న క్రేజ్ అలాంటిది. అయితే జిలేబీ ఎక్కడ పుట్టిందో తెలుసా?

జిలేబీ ఎక్కడ పుట్టిందో తెలుసా?
భారతదేశంలో జిలేబీకి ఉన్న క్రేజ్ గురించి చెప్పనక్కర్లేదు. సాయంత్రమైతే చాలు రోడ్డు పక్కన బెల్లం జిలేబీ, షుగర్ జిలేబీ, పనీర్ జిలేబీ...ఇలా రకరకాలు అమ్ముతుంటారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల దాకా వాటి కోసం క్యూ కడతారంటే నమ్మండి. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే ఆ ఘుమఘుమలు మనల్ని రారా..రారా అని పిలుస్తున్నట్లే అనిపిస్తుంది. సమోసా, పకోడీలతో పాటు ఈవెనింగ్ అయితే చాలు ఈ జిలేబీ కోసం ఎగబడతారు. దుకాణాలన్నీ కస్టమర్లతో కళకళలాడుతుంది. అంత ఫ్యాన్ బేస్ ఉంది ఈ జిలేబీకి. అక్కడ ఇక్కడ అని లేదు...ఎక్కడైనా సరే ఎందెందు వెతికినా జిలేబీ దర్శనమే. సరే మరి ఈ జిలేబీ ఎక్కడ పుట్టిందో తెలుసా?
పశ్చిమాసియా మూలాలు
జిలేబీ మూలాలు పశ్చిమాసియా ప్రాంతంతో ముడిపడి ఉన్నట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. అక్కడ ఇలాంటి తీపి వంటకాలను జలాబియా లేదా జులాబియా పేర్లతో పిలిచేవారు. మధ్యయుగ కాలానికి చెందిన అరబిక్ వంటకాల పుస్తకాల్లో కూడా వీటి ప్రస్తావన కనిపిస్తుంది.
10వ శతాబ్దానికి చెందిన కితాబ్ అల్-తబీఖ్ అనే వంటకాల గ్రంథంలో జలాబియా తయారీకి సంబంధించిన వివరాలు ఉన్నట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. 13వ శతాబ్దంలో మహమ్మద్ బిన్ హసన్ అల్-బగ్దాదీ రాసిన వంటకాల పుస్తకంలోనూ ఈ స్వీట్ ప్రస్తావన ఉంది.
మరి ఇండియాకు ఎలా వచ్చింది?
కాలక్రమంలో పశ్చిమాసియా నుంచి ఈ వంటకం మనదేశానికి చేరినట్లు భావిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి రుచులకు తగ్గట్టుగా తయారీ విధానంలో మార్పులు వచ్చాయి. మన బిర్యానీలాగా... పిండి, పాకం, షేప్.. ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రుచితో అమ్ముతున్నారు.
సుమారు 15వ శతాబ్దం నాటికే భారతీయ సాహిత్యంలో జిలేబీ ప్రస్తావన కనిపిస్తుంది. క్రీ.శ. 1450 ప్రాంతంలో రచించిన జైన గ్రంథం ప్రియంకర్ణృపకథలో వ్యాపారి విందు సందర్భంలో ఈ స్వీట్ ప్రస్తావన ఉన్నట్లు సమాచారం. అంటే జిలేబీకి పుట్టుక ఎక్కడైనా.. భారతదేశంలో మాత్రం అది క్రమంగా మన ఆహార సంస్కృతిలో భాగమైపోయింది.
జిలేబీకి కూడా చాలా వెరైటీలు!
భారత్‌లో అన్ని చోట్ల జిలేబీ ఒకేలా ఉండదు. ప్రాంతాన్ని బట్టి పేరు, తయారీ విధానం, రుచి కూడా మారుతుంటాయి. పశ్చిమ బెంగాల్‌లో జిలేబీని జిలిపి అని పిలుస్తారు. అక్కడ దీనికి అనేక రకాల వెర్షన్లు ఉన్నాయి. ఇక అమృతి తయారీ విధానం సాధారణ జిలిపితో పోలిస్తే మరింత భిన్నంగా ఉంటుంది. చెన్నార్ ఆధారంగా తయారు చేసే చెన్నార్ జిలిపి కూడా బెంగాల్‌లో ప్రసిద్ధి. పాలు నుంచి తయారయ్యే చెన్నాను ఉపయోగించి దీన్ని తయారు చేస్తారు. నెయ్యిలో వేయించడం వల్ల దీనికి ప్రత్యేకమైన రుచి, రంగు వస్తాయి. మిడ్నాపూర్‌లోని కొన్ని ప్రాంతాల్లో పెసరపప్పుతో తయారు చేసే మూంగ్ జిలిపి లేదా పాప్రి కూడా కనిపిస్తుంది.
సేమ్ సేమ్..బట్ డిఫరెంట్
ఉత్తర భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఇమర్తీని దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో జాంగిరి లేదా జాంగ్రీ అని పిలుస్తారు. అయితే ఇమర్తీ..జిలేబీ ఒకటి కాదు. కొంచెం డిఫరెంట్. తో పూర్తిగా ఒకటే అనుకోవడం సరికాదు. సాధారణంగా జిలేబీకి మైదా ఆధారిత పిండిని ఉపయోగిస్తే.. ఇమర్తీకి మినప్పప్పు పిండిని ఉపయోగిస్తారు. అందుకే ఇమర్తీ మందంగా, పూల ఆకారంలో కనిపిస్తుంది. జాంగిరి పేరు వెనుక మొఘల్ కాలానికి సంబంధించిన ఓ కథ కూడా ప్రచారంలో ఉంది. చక్రవర్తి జహంగీర్ కోసం ఈ స్వీట్ తయారైందని, అందుకే జాంగిరి అనే పేరు వచ్చిందని ఓ కథనం ఉంది.
మరి జిలేబీ ఇండియన్ స్వీటా?
జిలేబీ మూలాలు పశ్చిమాసియాతో సంబంధం కలిగి ఉన్నప్పటికీ.. ప్రస్తుతం మనకు తెలిసిన జిలేబీ మాత్రం శతాబ్దాలుగా భారతదేశంలోనే తయారైన ప్రత్యేకమైన స్వీట్.
భారతీయ వంటకాల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడి పదార్థాలు, రుచులు, తయారీ విధానాలకు అనుగుణంగా మారుతూ వచ్చింది. పండుగలు, పెళ్లిళ్లు, వేడుకల నుంచి సాధారణ టిఫిన్ వరకు జిలేబీకి ప్రత్యేక స్థానం ఏర్పడింది. అందుకే జిలేబీ...పలానా చోట పుట్టింది అని చెప్పడం కంటే అన్ని సంస్కృతిలో భాగమైపోయింది.

