- Home
- Feature
- Tax Free State: ఈ రాష్ట్రంలో సెటిలైతే ఎంత సంపాదించినా ఇన్‌కమ్ టాక్స్ కట్టక్కర్లేదు.. మనదేశంలోనే ఉంది
Tax Free State: ఈ రాష్ట్రంలో సెటిలైతే ఎంత సంపాదించినా ఇన్‌కమ్ టాక్స్ కట్టక్కర్లేదు.. మనదేశంలోనే ఉంది
Tax Free State: సంపాదించామన్న సంతోషం లేకుండా ఇన్ కమ్ టాక్స్‌కే ఎక్కువ పన్ను కట్టాల్సి వస్తోంది. కానీ మనదేశంలోని ఒక రాష్ట్రంలో మాత్రం ఎంత సంపాదించిన రూపాయి పన్ను కట్టక్కర్లేదు. ఆదాయపు పన్ను లేని రాష్ట్రం ఏదో తెలుసుకోండి.

కోటి సంపాదించిన రూపాయి పన్ను లేదు
ఏడాదికి కొంచెం ఎక్కువ సంపాదించామంటే ఆదాయపు పన్ను వచ్చి పడుతుంది. లక్షల మంది భారతీయులు ఆదాయపు పన్ను కడుతుంటారు. జీతం నుంచి TDS కట్ అయినప్పుడు ఎంతో బాధగా ఉంటుంది. కానీ మన దేశంలోనే ఓ రాష్ట్రంలో మీరు కోట్ల రూపాయలు సంపాదించినా కూడా రూపాయి పన్ను కట్టక్కర్లేదు. ఆ రాష్ట్రమే సిక్కిం. అందమైన కొండలు, లోయలతో కూడిన ఈ రాష్ట్రంలో సెటిలైతే పన్ను కట్టక్కర్లేదు. అయితే అందరికీ ఈ పన్ను మినహాయింపు ఉండదు. దీనికి కొన్ని షరతులు వస్తాయి.
సిక్కింలోనే ఎందుకు?
సిక్కిం మొదట్లో భారతదేశంలో విలీనం కాలేదు. 1975లో ప్రజాభిప్రాయ సేకరణ చేసి దాన్ని 22వ రాష్ట్రంగా మనదేశంలో కలిపారు. భారత్‌లో కలిపేటప్పుడు సిక్కిం సంస్కృతి, అక్కడి స్థానిక ప్రజల హక్కులను కాపాడటానికి కొన్ని ఒప్పందాలు జరిగాయి. అందులో భాగంగానే ఈ ఆదాయపు పన్ను మినహాయింపును ఇచ్చారు. అందుకే ఇప్పటికీ అక్కడ కొంతమంది ప్రజలకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు లభిస్తోంది.
ఎవరికి పన్ను ఉండదు
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 10(26AAA) ప్రకారం 'సిక్కిం రాష్ట్రంలోని స్థానిక పౌరులు'గా గుర్తింపు ఉన్నవారికి మాత్రమే ఈ పన్ను మినహాయింపు వర్తిస్తుంది. అంటే చట్టంలో పేర్కొన్న నిబంధనలను పాటించే సిక్కిం మూలవాసులకు మాత్రమే ఇది అందుతుంది. వీరు డివిడెండ్లు, వడ్డీల ద్వారా వచ్చే ఆదాయంపై కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే వేరే రాష్ట్రాల నుంచి ఎవరైనా సిక్కిం వెళ్లి ఉద్యోగం చేసినా, ఇల్లు కొని అక్కడే స్థిరపడిపోయినా వారికి ఈ పన్ను మినహాయింపు వర్తించదు. వారు అందరిలాగే పన్ను కట్టాలి.
పన్ను లేకపోవడం వల్ల ఎన్నో లాభాలు
ప్రజలు సంపాదించిన డబ్బులో పన్ను కట్టకపోవడం వల్ల వారి దగ్గరే మొత్తం డబ్బు ఉంటుంది. దీని వల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థపై మంచి ప్రభావం పడింది. ప్రజల దగ్గర డబ్బు ఎక్కువగా ఉండటం వల్ల స్థానిక మార్కెట్లు, చిన్న పరిశ్రమలు, పర్యాటకం వంటివి అభివృద్ధి చెందుతాయి. సిక్కిం మాత్రమే కాదు, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ వంటి ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని గిరిజన తెగల వారికి కూడా ఆదాయపు పన్ను ఉండదు.

