Grey Hair: ఒక తెల్ల వెంట్రుక పీకితే అన్నీ తెల్లబడతాయా? సైన్సు ఏం చెబుతోంది?
Grey Hair: తెల్ల వెంట్రుకలు చిన్న వయసులోనే ఎంతో మందిని ఇబ్బందిపెడుతున్నాయి. అయితే ఒక తెల్ల వెంట్రుక రాగానే కొంతమంది పీకేస్తూ ఉంటారు. అలా పీకితే దాని చుట్టుపక్కల ఉన్న వెంట్రుకలు కూడా తెల్లబడతాయనే అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది. ఇదెంత వరకు నిజం

తెల్ల వెంట్రుక పీకితే...
ఒక్క తెల్ల వెంట్రుక పీకితే దాని చుట్టుపక్కల ఉన్న వెంట్రుకలు కూడా తెల్లబడతాయి అనే సందేహం ఎక్కువమందిలో ఉంటుంది. ముఖ్యంగా చిన్న వయసులోనే ఒకటి రెండు తెల్ల వెంట్రుకలు కొంతమందికి కనిపిస్తాయి. వాటిని చూసే భయపడిపోతారు. ఇది పీకితే మిగతా వెంట్రుకలు తెల్లబడతాయేమో అన్న భయంతో అలాగే ఉంచేస్తారు. కానీ వైద్యశాస్త్రం చెబుతున్న ప్రకారం ఇది నిజం కాదు. ఒక్క తెల్ల వెంట్రుకను పీకినంత మాత్రాన చుట్టుపక్కల ఉన్న వెంట్రుకలు తెల్లబడాలని ఎక్కడా లేవు. జుట్టు రంగు అనేది మన శరీరంలోని మెలనిన్ అనే హార్మోన్ ఉత్పత్తిపై ఆధారపడి ఉంటుంది. ఒక్కో వెంట్రుకకు దాని సొంత హెయిర్ ఫాలికల్ ఉంటుంది. ఈ ఫాలికల్ నుంచి తెల్ల వెంట్రుక వచ్చిందంటే దాని ప్రభావం పక్క ఫోలికల్ పై ఉంటుందని లేదు.. ఒకటి పీకితే అన్ని తెల్లబడతాయని అనేది కేవలం అపోహ మాత్రమే.
కారణాలు ఇవే
అసలు తెల్ల వెంట్రుకలు చిన్నవయసులోనే ఎందుకు వస్తాయి అన్నది చాలామందికి తెలియదు. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దాంతో జుట్టు రంగు నలుపు నుంచి బూడిద రంగు, బూడిద నుంచి తెలుపు రంగులోకి మారుతుంది. కానీ కొందరిలో మాత్రం చిన్న వయసులోనే ఈ ప్రక్రియ మొదలైపోతుంది. దీనికి ముఖ్యమైన కారణాలు జన్యుపరమైనవి. అధిక ఒత్తిడి, పోషక లోపాలు, నిద్ర సరిగా పట్టకపోవడం, థైరాయిడ్ సమస్యలు, విటమిన్ బి12 లోపం వంటివి. ఇలా చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు వస్తే దాన్ని ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ అని అంటారు. ఇది ఒక వెంట్రుక పీకడం వల్ల వచ్చే సమస్య కాదు. శరీరంలోని అంతర్గత మార్పుల వల్ల కలుగుతుంది.
మళ్లీ తెల్ల వెంట్రుకే వస్తుంది
అయితే తెల్ల వెంట్రుక రాగానే పీకేయడం అనేది మంచి పద్ధతి కాదు .తరచూ ఇలా వెంట్రుకలు పీకితే అక్కడ ఉన్న హెయిర్ ఫాలికల్స్ దెబ్బతింటాయి. ఆ చోట మళ్లీ వెంట్రుకలు రావడం కష్టమైపోతుంది. జుట్టు పలచగా మారిపోతుంది. లేదా అక్కడ ఇన్ఫెక్షన్లు, గాయాలు, నొప్పి వంటివి కలుగుతాయి. తెల్ల వెంట్రుక పీకిన తర్వాత ఆ ఫోలికల్ నుంచి తిరిగి మళ్ళీ తెల్ల వెంట్రుకే వస్తుంది తప్ప నల్ల వెంట్రుక వచ్చే అవకాశాలు తక్కువ. ఎందుకంటే ఆ ఫోలికల్ లో ఉత్పత్తి అప్పటికే తగ్గిపోయి ఉంటుంది. కాబట్టి ఒక తెల్ల వెంట్రుకను పీకేసినంత మాత్రాన సమస్య తీరిపోదు.
ఏం తినాలి?
చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు పెరగకుండా ఉండాలంటే సమతుల ఆహారం తీసుకోవడం మంచిది. మీరు తినే ఆహారంలో విటమిన్ బి12, ప్రోటీన్, కాపర్, జింక్, ఇనుము వంటివి ఉండేలా చూసుకోండి. ఆకుకూరలు, నట్స్, పాల ఉత్పత్తులు, పండ్లు, పప్పులు వంటివి తింటే మంచిది. ఒత్తిడిని తగ్గించుకునేందుకు యోగా, ధ్యానం వంటివి చేయాలి. ప్రతిరోజూ 30 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే మంచిది. ముఖ్యంగా కంటి నిండా నిద్ర ఎంతో అవసరం.

