- Home
- Feature
- బెడ్ మధ్యలోంచి ఇంటర్నేషనల్ బార్డర్.. ఈ హోటల్లో బసచేస్తే మీరో దేశంలో, మీ భార్య ఇంకో దేశంలో ఉన్నట్లే!
బెడ్ మధ్యలోంచి ఇంటర్నేషనల్ బార్డర్.. ఈ హోటల్లో బసచేస్తే మీరో దేశంలో, మీ భార్య ఇంకో దేశంలో ఉన్నట్లే!
ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ సరిహద్దుల్లో ఉన్న 'హోటల్ అర్బెజ్' కి ఓ స్పెషాలిటీ ఉంది. ఈ హోటల్ మధ్యలోంచి రెండు దేశాల బోర్డర్ వెళ్తుంది. జురా పర్వతాల్లో ఉన్న ఈ వింత హోటల్ కథేంటో చూద్దాం.

హోటల్ అర్బెజ్... ఇదో వింత హోటల్
ఫ్రాన్స్‌లో నిద్రలేచి, మెట్లు దిగి స్విట్జర్లాండ్‌లోకి వెళ్లి బ్రేక్‌ఫాస్ట్ చేస్తే ఎలా ఉంటుంది? వినడానికి వింతగా ఉన్నా ఇది సాధ్యమే. ఈ రెండు దేశాల మధ్యలో ఓ హోటల్ ఉంది… సరిగ్గా దీని మధ్యలోంచి ఇంటర్నేషనల్ బార్డర్ వెళుతుంది. కాబట్టి ఈ హోటల్లో బస చేస్తే రెండు దేశాల్లో ఉన్నట్లే. ఇలా జురా పర్వతాల్లోని లా క్యూర్ గ్రామంలో ఉన్న ‘హోటల్ అర్బెజ్’ చాలా ప్రత్యేకమేంది.
ఈ అర్బెజ్ హోటల్ మధ్యలోంచి రెండు దేశాల సరిహద్దు వెళ్తుంది. డైనింగ్ రూమ్, మెట్లు, కొన్ని గదులు రెండు దేశాల్లోనూ ఉంటాయి. ఈ హోటల్లో బసచేస్తే పాస్ పోర్ట్, వీసా అవసరం లేకుండానే ఒకే సమయంలో రెండుదేశాల్లో ఉండవచ్చు… టూరిస్టులకు ఇదొక సరికొత్త అనుభూతిని ఇస్తుంది.
రెండు దేశాల్లో ఉన్న హోటల్ ఇది
లా క్యూర్ గ్రామంలో ఉన్న ఈ హోటల్ బయట నుంచి చూస్తే మామూలుగానే కనిపిస్తుంది. కానీ లోపలికి వెళ్తే అసలు విషయం అర్థమవుతుంది. ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ బోర్డర్ ఈ భవనం మధ్యలోంచి వెళ్తుంది. ఇందులో 10 గదులు, ఒక రెస్టారెంట్ ఉన్నాయి. ఇక్కడ ఫ్రెంచ్, స్విస్ వంటకాలు దొరుకుతాయి. ఇదొక హోటల్ మాత్రమే కాదు, అరుదైన భౌగోళిక ప్రదేశం కూడా.
మీ బెడ్ మధ్యలోంచి ఇంటర్నేషనల్ బోర్డర్ వెళ్తే?
హోటల్ అర్బెజ్లో ఉన్న అతిపెద్ద వింత ఏంటంటే.. కొన్ని గదుల మధ్యలోంచి ఈ బోర్డర్ వెళ్తుంది. హనీమూన్ సూట్ లోని మంచం మధ్యలోంచి బార్డర్ వెళుతుంది. అంటే ఈ హోటల్లో మీరు దిగితే పడుకునే బెడ్ సగం ఫ్రాన్స్‌లో, సగం స్విట్జర్లాండ్‌లో ఉంటుందన్నమాట. మెట్లు, డైనింగ్ ఏరియా కూడా ఇలాగే రెండు దేశాల్లో ఉంటాయి. హోటల్ బయటికి రాకుండానే మీరు రెండు దేశాలు తిరిగేయొచ్చు.
హోటల్ అర్బెజ్ స్టోరీ ఇదే..
ఈ హోటల్ కథ 19వ శతాబ్దంలో మొదలైంది. 1860ల్లో ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ దేశాలు తమ సరిహద్దులను మార్చుకోవడానికి 'ట్రీటీ ఆఫ్ డాప్స్' ఒప్పందం చేసుకున్నాయి. అయితే ఈ కొత్త బోర్డర్ అమల్లోకి రాకముందే పొంథస్ అనే వ్యాపారి ఆ బోర్డర్ లైన్ మీద ఒక భవనాన్ని కట్టాడు. పాత భవనాలను కూల్చకూడదనే రూల్ ఉండటంతో ఆ భవనం అలాగే ఉండిపోయింది.
పొంథస్ ఈ భవనాన్ని తెలివిగా వాడుకున్నాడు. ఒకవైపు షాపు, మరోవైపు బార్ నడిపాడు. ఆ తర్వాత 1921లో జూల్స్-జోసెఫ్ అర్బెజ్ ఈ భవనాన్ని కొని హోటల్‌గా మార్చాడు. ఇప్పటినుంచి ఈ హోటల్‌కి వాళ్ల ఫ్యామిలీ పేరే స్థిరపడిపోయింది. అలా ఒక చిన్న భవనం కాస్తా యూరప్‌లోనే అత్యంత వింతైన హోటల్‌గా మారిపోయింది.
జురా పర్వతాల్లో స్పెషల్ హోటల్
ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ బోర్డర్లో ఉన్న లా క్యూర్ గ్రామంలోని జురా పర్వతాల్లో ఈ హోటల్ అర్బెజ్ ఉంది. ఈ ప్రాంతం అందమైన పర్వతాలకు, ఔట్ డోర్ యాక్టివిటీస్‌కి చాలా ఫేమస్. ఎండాకాలంలో హైకింగ్ చేయడానికి, చలికాలంలో స్కీయింగ్ చేయడానికి టూరిస్టులు ఇక్కడికి వస్తుంటారు. రెండు దేశాలు తిరగాలనుకునే వాళ్లకి ఇది బెస్ట్ ప్లేస్.
ఈ హోటల్ చరిత్రలో మరో ఆసక్తికరమైన కథ కూడా ఉంది. 1958లో ఈ హోటల్ నడుపుతున్న ఫ్యామిలీకి చెందిన మాక్స్ అర్బెజ్.. దీన్ని 'అర్బెజీ' అనే మైక్రోనేషన్గా ప్రకటించాడు. సరదాగా చేసిన ఈ ప్రకటన హోటల్ చరిత్రలో ఒక వింత కథగా మిగిలిపోయింది. దీనికి అంతర్జాతీయ గుర్తింపు రాకపోయినా, హోటల్ పేరు మాత్రం మార్మోగిపోయింది.
టూరిస్టులను ఎందుకు అంతగా ఆకర్షిస్తోంది?
ఒకే భవనంలో ఉంటూ రెండు దేశాలు తిరిగే ఛాన్స్ రావడం వల్లే టూరిస్టులు ఈ హోటల్‌కి క్యూ కడుతున్నారు. హోటల్ లోపల నడుస్తూనే ఇంటర్నేషనల్ బోర్డర్ దాటొచ్చు. ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ పంచుకుంటున్న డైనింగ్ ఏరియాలో భోజనం చేయొచ్చు. భౌగోళిక, రాజకీయ కారణాలతో పుట్టిన ఈ హోటల్.. ప్రపంచంలో మరెక్కడా దొరకని అనుభూతిని ఇస్తుంది.





