- Home
- Feature
- Mirchi Capital: మనదేశ మిరపకాయల రాజధాని ఏదో తెలుసా? ఆసియాలోనే అతి పెద్ద మార్కెట్ ఇక్కడే ఉంది
Mirchi Capital: మనదేశ మిరపకాయల రాజధాని ఏదో తెలుసా? ఆసియాలోనే అతి పెద్ద మార్కెట్ ఇక్కడే ఉంది
Mirchi Capital: ఆసియా ఖండంలోనే అతి పెద్ద మిర్చి మార్కెట్ మన తెలుగు రాష్ట్రంలో ఉందని మీకు తెలుసా? మన నగరానికి మిర్చి రాజధాని అనే పేరు ఉందని తెలుసా? లక్షలాది కూలీలకు ఉపాధి కల్పిస్తూ.. కోట్లలో వ్యాపారం చేస్తున్న మిర్చి నగరం ఏది?
మనదేశ మిర్చి రాజధాని
భారతదేశంలో ఆహార రుచులలో కారానికి ఎంత ప్రాధాన్యత ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మన వంటకాల్లో మిరపకాయలు, ఎండు కారం లేకపోతే కూరలకు అసలు రుచి రాదు. ప్రపంచవ్యాప్తంగా విభిన్న రకాల మిరపకాయలు పండినప్పటికీ, మన దేశంలో పండే మిరపకాయల ఘాటు , ప్రత్యేకత వేరు. మరి, మన దేశంలో 'మిర్చి రాజధాని' (Chilli Capital of India) గా ఏ ప్రాంతం ప్రసిద్ధి చెందిందో మీకు తెలుసా? ఆసియాలోనే అతిపెద్ద మిర్చి మార్కెట్ ఎక్కడ ఉంది?
ఆంధ్రప్రదేశ్లోని మిర్చి రాజధాని నగరం..
భారతదేశంలో ఘాటైన మిరపకాయలకు పెట్టింది పేరు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు నగరం. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ నగరాన్ని అందరూ భారతదేశ మిర్చి రాజధాని అని పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్ ఆహార సంస్కృతిలో కారానికి ప్రత్యేక స్థానం ఉంది, ఆ ఘాటు రుచిని ప్రపంచానికి అందించడంలో గుంటూరు కీలక పాత్ర పోషిస్తోంది. ఇక్కడి నేలలు, వాతావరణ పరిస్థితులు మేలురకం మిర్చి పంటకు బాగా అనుకూలిస్తాయి. అందుకే ప్రతి సీజన్లో పరిసర ప్రాంతాల రైతులు పండించిన ఎర్రటి మిర్చి రాశులతో గుంటూరు ఎరుపు రంగు పులుముకుంటుంది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే మిరపకాయలకు అంతర్జాతీయ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉండటంతో రైతులు భారీ ఎత్తున మిర్చిని పండిస్తుంటారు.
ఆసియా ఖండంలోనే అత్యంత పెద్ద మిర్చి మార్కెట్
గుంటూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆసియా ఖండంలోనే అత్యంత పెద్ద మిర్చి మార్కెట్గా పేరుగాంచింది. పంట చేతికి వచ్చే సమయంలో నిత్యం వేలాది బస్తాల మిరపకాయలు ఈ యార్డుకు చేరుకుంటాయి. ఇక్కడ ప్రతిరోజూ కోట్ల రూపాయల విలువైన క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. రైతులు, వ్యాపారులు, కార్మికులతో ఈ మార్కెట్ ఎప్పుడూ రద్దీగా కనిపిస్తుంది. ఆధునిక కోల్డ్ స్టోరేజ్ లు, రవాణా సౌకర్యాలు స్థానికంగా అందుబాటులో ఉండటం వల్ల క్రయవిక్రయాలు వేగంగా సాగుతాయి. మిర్చి వ్యాపారం ద్వారా ఈ ప్రాంతంలో లక్షలాది మంది కూలీలకు, చిరు వ్యాపారులకు నిరంతరం ఉపాధి లభిస్తోంది.
విదేశాలకు భారీగా ఎగుమతులు..
గుంటూరు మిర్చికి అంతర్జాతీయ మార్కెట్లో విపరీతమైన గిరాకీ ఉంది. ప్రత్యేకంగా 'గుంటూరు సన్నం' రకానికి భౌగోళిక గుర్తింపు కూడా దక్కింది. దట్టమైన ఎరుపు రంగు, సహజమైన ఘాటు, రంగు మారకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండే గుణం వల్ల విదేశీ కొనుగోలుదారులు ఈ రకాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. అమెరికా, యూరప్ దేశాలతో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి ఆసియా దేశాలకు గుంటూరు నుంచే భారీగా ఎగుమతులు జరుగుతాయి. ఆహార పదార్థాల తయారీలోనే కాకుండా, ఔషధ రంగానికి అవసరమైన క్యాప్సైసిన్ తీయడానికి, రంగుల పరిశ్రమల్లో కూడా ఈ మిరపకాయలను పెద్దఎత్తున ఉపయోగిస్తున్నారు. గుంటూరు తన ఘాటుదనంతో ప్రపంచ పటంలో భారతదేశ ఖ్యాతిని సగర్వంగా నిలబెడుతోంది.

