- Home
- Feature
- Gold Loan : గోల్డ్ లోన్ మొత్తం కట్టేశారా? అయినా బ్యాంక్ మీ నగలు ఇవ్వకపోతే ఏం చేయాాలో తెలుసా?
Gold Loan : గోల్డ్ లోన్ మొత్తం కట్టేశారా? అయినా బ్యాంక్ మీ నగలు ఇవ్వకపోతే ఏం చేయాాలో తెలుసా?
మీరు బంగారం తాకట్టుపెట్టి గోల్డ్ లోన్ తీసుకున్నారా? వడ్డీతో సహా తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించినా బ్యాంక్ నగలు తిరిగి ఇవ్వలేదా? అయితే బ్యాంక్ అధికారులను ఏం అడగాలి, సమస్య పరిష్కారం కాకపోతే ఎక్కడ ఫిర్యాదు చేయాలో ఇక్కడ తెలుసుకోండి.

గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకొండి
గోల్డ్ లోన్ అంటే మన దగ్గర ఉన్న బంగారు నగలు తాకట్టుపెట్టి డబ్బులు తీసుకోవడం. అత్యవసర సమయాల్లో త్వరగా డబ్బులు రావడం, పెద్దగా డాక్యుమెంట్లు అవసరం లేకపోవడంతో చాలామంది దీన్ని వాడుతున్నారు. అందుకే పెద్దపెద్ద బ్యాంకుల నుండి చిన్నచిన్న ఆర్థిక సంస్థలు సైతం గోల్డ్ లోన్ బిజినెస్ లో దిగిపోయాయి.
అయితే గోల్డ్ లోన్ తీసుకునేటప్పుడు కస్టమర్లే తమ దేవుళ్ళు అని చెప్పే ఫైనాన్స్ సంస్థలు… లోన్ చెల్లించి బంగారం తిరిగి తీసుకునేటప్పుడు మాత్రం ఇబ్బంది పెడతాయి. కొన్నిసార్లు పూర్తి లోన్ క్లియర్ చేసిన బంగారం తిరిగి పొందేందుకు నానా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అందుకే గోల్డ్ లోన్ తీసుకునేటప్పుడు వడ్డీ మాత్రమే కాదు అగ్రిమెంట్ కండిషన్లు, నగలు తిరిగి ఇచ్చే ప్రాసెస్, బ్యాలెన్స్, ఛార్జీలు, అకౌంట్ క్లోజింగ్ గురించి కూడా మీరు స్పష్టంగా తెలుసుకోవాలి.
ఈ డాక్యుమెంట్స్ జాగ్రత్త
సాధారణంగా మీరు కట్టాల్సిన డబ్బు మొత్తం కట్టేసి, లోన్ అకౌంట్ క్లోజ్ చేశాక బ్యాంక్ మీ నగలను తిరిగి ఇచ్చేస్తుంది. "లోన్ కట్టేసినా బ్యాంక్ ఎప్పటికీ నగలను తన దగ్గరే ఉంచుకోవచ్చు" అనే రూల్ ఎక్కడా లేదు. ఒకవేళ నగలు ఇవ్వడంలో లేట్ అయితే, ముందుగా మీ లోన్ అకౌంట్ నిజంగానే క్లోజ్ అయిందో లేదో మీరు చెక్ చేసుకోవాలి.
కొన్నిసార్లు మీకు సంబంధించిన వేరే లోన్ బ్యాలెన్స్ ఉందని, లేదా అగ్రిమెంట్ కండిషన్స్, ఇతర చట్టపరమైన కారణాలు ఉన్నాయని బ్యాంక్ చెప్పొచ్చు. అలాంటప్పుడు వాళ్లు నోటితో చెబితే ఒప్పుకోకండి, ఆ కారణాన్ని రాతపూర్వకంగా అడిగి తీసుకోండి. మీరు డబ్బులు కట్టిన రసీదు, అకౌంట్ క్లోజర్ లెటర్, కుదవపెట్టిన రసీదు లాంటి డాక్యుమెంట్లను జాగ్రత్తగా దాచుకోండి. రేపు ఏదైనా సమస్య వస్తే ఇవే మీకు ఆధారాలు.
గోల్డ్ ఇవ్వకపోడానికి కారణమేంటో తెలుసుకొండి
లోన్ మొత్తం కట్టేసిన తర్వాత కూడా బ్యాంక్ నగలు ఇవ్వకపోతే ముందుగా కంగారు పడకుండా కారణం ఏంటని బ్యాంక్‌ను అడగండి. "ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది?", "నా లోన్ అకౌంట్ క్లోజ్ అయిందా?", "నగలు ఎందుకు ఇవ్వట్లేదు?" అని మీరు స్పష్టంగా అడగొచ్చు. వీలైతే ఈ సమాచారాన్ని రాతపూర్వకంగా లేదా బ్యాంక్ అఫీషియల్ కంప్లైంట్ సెల్ ద్వారా తీసుకోవడం మంచిది. మీరు కట్టిన డబ్బులు అకౌంట్‌లో సరిగ్గా జమయ్యాయో లేదో కూడా చెక్ చేసుకోండి.
కొన్నిసార్లు మీరు లాస్ట్ ఈఎంఐ కట్టేసినా, అకౌంట్ క్లోజింగ్ ప్రాసెస్ ఇంకా పూర్తి కాకపోవచ్చు. అందుకే కేవలం రసీదు చూసుకుని లోన్ తీరిపోయిందని అనుకోకుండా బ్యాంక్ దగ్గర అకౌంట్ స్టేటస్ కన్ఫర్మ్ చేసుకోవడం సేఫ్. అలాగే మీరు సంతకం చేసిన లోన్ అగ్రిమెంట్‌లో నగలు తిరిగి ఇచ్చే కండిషన్లు ఏమైనా ఉన్నాయేమో చూడండి. వేరే లోన్ కోసం ఈ నగలను ఆపుతున్నామని బ్యాంక్ చెబితే, దానికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా అడిగి తెలుసుకోండి.
ఆర్బిఐకి ఫిర్యాదు చేయండి
బ్యాంక్ చెప్పే కారణం సరైనది కాదని మీకు అనిపిస్తే, తర్వాతి స్టెప్‌గా ఆ బ్యాంక్ గ్రీవెన్స్ ఆఫీసర్‌ను కలవండి. కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ ఫిర్యాదు నంబర్ లేదా రసీదు కచ్చితంగా తీసుకోండి. దీనివల్ల తర్వాత ఈ కంప్లైంట్‌ను ముందుకు తీసుకెళ్లడానికి వీలవుతుంది. బ్యాంక్‌కు కంప్లైంట్ ఇచ్చినా సమస్య తీరకపోతే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేసే అవకాశం మీకు ఉంటుంది.
ఆర్బీఐ నిబంధనల ప్రకారం… ముందుగా సంబంధిత బ్యాంక్ లేదా ఫైనాన్స్ కంపెనీకే మీరు కంప్లైంట్ ఇవ్వాలి. ఆ కంప్లైంట్‌ను 30 రోజుల్లోగా వాళ్లు పరిష్కరించకపోయినా లేదా వాళ్లు ఇచ్చిన సమాధానం మీకు నచ్చకపోయినా, అప్పుడు మీరు ఆర్బీఐ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయొచ్చు. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల సేవలలో లోపాలు ఉంటే పరిష్కరించడానికి ఆర్బీఐ ఈ ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేసింది.
కంప్లైంట్ ఇచ్చే ముందు లోన్ డాక్యుమెంట్, డబ్బులు కట్టిన రసీదులు, బ్యాంక్ స్టేట్‌మెంట్, కుదవపెట్టిన రసీదు, బ్యాంక్‌కు ఇచ్చిన కంప్లైంట్ కాపీ, వాళ్లు ఇచ్చిన రిప్లై అన్నీ మీ దగ్గర రెడీగా ఉంచుకోండి. "ఆర్బీఐకి కంప్లైంట్ చేయగానే వెంటనే నగలు వచ్చేస్తాయి" అని అనుకోవద్దు. మీరు ఇచ్చే డాక్యుమెంట్లు, వాళ్ల సర్వీస్‌లో ఉన్న లోపం ఆధారంగానే యాక్షన్ ఉంటుంది. అందుకే లోన్ తీసుకునే ముందే అగ్రిమెంట్ పూర్తిగా చదవడం, లోన్ తీరిపోగానే అకౌంట్ క్లోజర్ రికార్డులు తీసుకోవడం చాలా ముఖ్యం.

