Facts : పుట్టగానే పిల్ల తేళ్లు తల్లిని తినేస్తాయా? లేదా పిల్లల్నే తల్లి తేలు తింటుందా?
Facts : పుట్టిన వెంటనే తేలు పిల్లలు కన్నతల్లినే తినేస్తాయని ఓ ప్రచారం ఉంది. అయితే తల్లి తేలే పిల్లల్ని తింటుందనే మరో ప్రచారం కూడా ఉంది. ఈ రెండిట్లో ఏది నిజం... సైన్స్, జంతుశాస్త్రం ఏం చెబుతున్నాయి?

తేళ్ల గురించి ఆసక్తికర విషయాలు...
Facts : తల్లిపిల్లల ప్రేమ గురించి చాలా గొప్పగా చెబుతుంటారు... మనుషులే కాదు జంతువులు కూడా తమ బిడ్డల రక్షణ కోసం ఏమైనా చేస్తాయి. అందుకే పిల్లలను కాపాడే విషయంలో తల్లిని మించిన యోధులు లేరనే సినిమా డైలాగులు వచ్చాయి.
అయితే తల్లి ప్రేమకు నిదర్శనంగా తేళ్ళు నిలుస్తాయని... ఇవి తమ పిల్లల కోసం ప్రాణత్యాగం చేస్తాయనే ప్రచారం ఉంది. తేలు పిల్లలు తల్లి గర్భంలోంచి బయటకే రాగానే జన్మనిచ్చిన తల్లిని తినేస్తాయని చెబుతుంటారు. పిల్లలు ఇలా శరీరాన్ని తింటుంటే ఆ తల్లి తేలు ఓవైపు నొప్పిని భరిస్తూనే మరోవైన పిల్లలను అహారంగా మారినందుకు ఆనందంగా ఉంటుందని చెబుతారు.
అయితే తేళ్లు విషయంలో మరో ప్రచారం కూడా ఉంది. తల్లి తేలును పిల్లలు తినడం కాదు... పిల్ల తేళ్లను తల్లే తింటుందట. ఇలా తేళ్ల విషయంలో రెండు రకాల ప్రచారాలు సాగుతాయి... కథలు కథలుగా చెప్పుకుంటారు. మరి ఈ రెండు ప్రచారాల్లో ఏది నిజం...? తేళ్ల గురించి ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
పిల్ల తేళ్లు తల్లిని తినేస్తాయా..?
అరిజోనా స్టేట్ యూనివర్సిటీ జర్నల్ ప్రకారం... పిల్ల తేళ్లు తల్లిని వేటాడటం చాలా అరుదు. అయితే పిల్ల తేళ్లు తమను తాము రక్షించుకోవడానికి పుట్టగానే తల్లి వీపుపైకి ఎక్కుతాయి. సుమారు 10 నుంచి 20 రోజుల పాటు అవి తల్లి వీపుపైనే ఉంటాయి. ఈ సమయంలో తల్లి తేలు వాటిని కాపాడుతుంది... ఇతర జీవుల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఇలా పిల్లలను కాపాడే క్రమంలో తల్లితేలుకు ఆకలి, దప్పిక వల్ల చనిపోతుంది... అందువల్లే పిల్లలే తల్లిని చంపుతాయనే ప్రచారం మొదలయ్యింది. తేలు పిల్లలు తల్లిని తింటాయనేది కేవలం అపోహ మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు.
తల్లి తేలు పిల్లల్ని తింటుందా..?
తల్లి తేలు తన పిల్లలను తానే తింటుందనే ప్రచారంలో మాత్రం కొంత నిజం ఉందట. కొన్నిసార్లు అహారం దొరక్క ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తే మాత్రం తన పిల్లల్నే తల్లి తేలు తిటుంది. అయితే కేవలం పిల్లల్లో బలహీనంగా ఉన్నవాటిని తల్లితేలు తింటుంది... దీంతో మిగతా పిల్లలకు సరైన పోషణ, రక్షణ అందించగలదు.
తేలు గుడ్లు పెడుతుందా..? నేరుగా బిడ్డలకు జన్మనిస్తుందా..?
తల్లి తేలు గుడ్లు పెట్టకుండా నేరుగా పిల్లలకే జన్మనిస్తుంది. ఈ ప్రక్రియను 'స్కార్పియోనింగ్' (Scorpioning) అంటారు. ఓ తేలు ఒకేసారి 10 నుంచి 100 పిల్లలకు జన్మనివ్వగలదు. పుట్టినప్పుడు పిల్లల శరీరం చాలా మృదువుగా ఉంటుంది. అందుకే వాటిని తన వీపుపైన పెట్టుకుని మోస్తుంది. చర్మం గట్టిపడే వరకు అలానే ఉండి తర్వాత తల్లి వీపును వదిలేస్తాయి… సొంతంగా అహారాన్ని సంపాదించుకుంటాయి. అప్పటివరకు తల్లి శరీరంనుండి విడుదలయ్యే ప్రత్యేక ద్రవాలే వాటికి అహారం.
కన్నతల్లినే తినే పిల్లలు..?
కొన్ని జాతుల సాలీడులు, సూడోస్కార్పియన్స్‌లో (Pseudoscorpions) పిల్లలు తల్లిని తినేస్తాయి. అయితే ఇలాంటి జాతులు చాలా అరుదు. సాధారణ తేళ్లలో ఇది జరగదు. పైగా తల్లి తేలు తన బలహీనమైన పిల్లలను తినేస్తుంది. దీనివల్ల మిగిలిన బలమైన పిల్లలకు మంచి పోషణ అంది, అవి బతికే అవకాశం పెరుగుతుంది.

