- Home
- Feature
- పేదరికం నుంచి పుట్టిన నీలిరంగు మాత్ర.. వయాగ్రా, దీన్ని మొదట గుండెనొప్పి కోసం కనిపెట్టారని తెలుసా?
పేదరికం నుంచి పుట్టిన నీలిరంగు మాత్ర.. వయాగ్రా, దీన్ని మొదట గుండెనొప్పి కోసం కనిపెట్టారని తెలుసా?
వయాగ్రా.. ఒక ఔషధం. ఒకప్పుడు దీన్ని కనిపెట్టిన కారణం వేరు. గుండె కోసం కనిపెడితే అది మగవారి లైంగిక సమస్యకు పరిష్కారంగా మారింది. దీని పుట్టుక వెనుక ఆసక్తికరమైన నిజాలు ఉన్నాయి.

నిరుద్యోగం పెరిగిపోయి...
ప్రపంచ ప్రసిద్ధి చెందిన నీలిరంగు మాత్ర 'వయాగ్రా'. ఎంతో మంది మగవారికి లైంగిక సమస్యకు ఇది దివ్యౌషధం. దీని పుట్టుక వెనుక ఒక ఆసక్తికరమైన కథ దాగుంది. వెల్స్ దేశం దక్షిణ ప్రాంతంలోని 'మెర్తిర్ టిడ్‌ఫిల్' అనే చిన్న పారిశ్రామిక పట్టణంలో దీన్ని ప్రయాణం మొదలైంది. 1990ల ఆరంభంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం వచ్చి, అక్కడి కర్మాగారాలు ఒక్కొక్కటిగా మూతపడ్డాయి. దీంతో ఎంతో మంది ఉద్యోగం కోల్పోయి రోడ్డునపడ్డారు. మాజీ ఉక్కు కార్మికులు, ఇతర నిరుద్యోగ పురుషులు కుటుంబాలను పోషించుకోవడానికి నానా తంటాలు పడ్డారు. అలాంటి కష్ట సమయంలో ఆ పట్టణంలోనే ఉన్న 'సింబెక్' రీసెర్చ్ సెంటర్‌లో నిర్వహించే క్లినికల్ ట్రయల్స్ వారికి కొంత డబ్బు సంపాదించే మార్గం వచ్చింది.
గుండెనొప్పి కోసం కనిపెట్టిన మందు
ప్రముఖ ఔషధ సంస్థ 'ఫైజర్' తయారుచేసిన 'సిల్డెనాఫిల్' అనే కొత్త మందును గుండెనొప్పి (యాంజైనా) నివారణ కోసం పరిశోధకులు పరీక్షిస్తున్నారు. ఉద్యోగాలు లేక స్థానికంగా ఉండే మగవారు స్వచ్ఛందంగా వయాగ్రా మాత్ర.. క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొన్నారు. ఆ మాత్రలు వేసుకున్నారు. అయితే గుండె సమస్యలపై ఆ ఔషధం అనుకున్నంత పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ పరిశోధకులను ఆశ్చర్యపరుస్తూ ఒక వింత జరిగింది. ఆ మాత్ర వేసుకున్న పురుషుల్లో రక్తప్రసరణ పెరిగి, అంగస్తంభన రూపంలో బలమైన సైడ్ ఎఫెక్ట్ కనిపించింది. ఆ అనుభవాన్ని వెంటనే ఆ విషయాన్ని శాస్త్రవేత్తలకు స్పష్టంగా చెప్పారు.
వయాగ్రా.. ఒక దివ్యౌషధం
ఆ వాలంటీర్లు దాపరికం లేకుండా చెప్పిన ఆ సమాచారమే వైద్యరంగంలో పెనుమార్పుకు దారితీసింది. గుండె ఔషధంగా విఫలమైనప్పటికీ, అంగస్తంభన లోపాలకు ఇది దివ్యౌషధమని పరిశోధకులు గ్రహించారు. అలా అది ‘వయాగ్రా’ పేరుతో ప్రపంచవ్యాప్తంగా అడుగుపెట్టి ముఖ్యమైన ఆరోగ్యసమస్యను తీర్చింది. ఒకవేళ ఆ పట్టణంలోని పురుషులు డబ్బు కోసం ఆ ప్రయోగాల్లో పాల్గొనకపోయినా, లేదా తమకు ఎదురైన ఆ అనుభవాన్ని బయటకు చెప్పడానికి సిగ్గుపడి దాచేసి ఉన్నా.. వయాగ్రా ఇప్పుడు ఉండేదే కాదు.
