Cashew : కేవలం రూ.300-400 కే కిలో జీడిపప్పు... ఎక్కడో కాదు మన తెలుగు రాష్ట్రంలోనే...
మీకోసమే లేదంటే మీ పిల్లల కోసమో జీడిపప్పు కొనాలని మార్కెట్ కి వెళితే అక్కడి ధరలు అవాక్కయ్యేలా ఉంటాయి. కిలో జీడిపప్ప రూ.800-1000 ఉంటుంది. అయితే కొన్నిచోట్లు రూ.300-400 కి కూడా కిలో జీడిపప్పు పొందవచ్చు. ఇంత తక్కువధర ఎక్కడో తెలుసా?

తక్కువ ధరకే జీడిపప్పు దొరికే ప్రాంతాలివే...
Cashew Price : జీడిపప్పు అనగానే ప్రతి ఒక్కరికి నోరూరుతుంది. పాయసం, స్వీట్లు, వివిధ వంటకాల్లో రుచిని పెంచడానికి లేదా రోజువారీ ఆరోగ్యానికి జీడిపప్పు ఎంతో మేలు చేస్తుంది. అయితే బయట సాధారణ రిటైల్ మార్కెట్‌లో కిలో జీడిపప్పు రూ. 800 నుండి రూ. 1000 వరకు పలుకుతోంది. రోడ్డుపక్కన చిన్నచిన్న వ్యాన్లు, ఆటోల్లో కూడా రూ.500-600 కిలో జీడిపప్పు అనే బోర్డు పెట్టుకుని అమ్ముతుండటం చూస్తుంటాం... ఇది అంత నాణ్యంగా ఉండదు. అయితే కొన్నిచోట్ల మార్కెట్ కంటే చాలా తక్కువ ధరకే ఇంకా చెప్పాలంటే రోడ్డుపక్కన కంటే తక్కువకే జీడిపప్పు కొనుగోలు చేయవచ్చు... అదీ అత్యంత నాణ్యమైనది. ఇలా హోల్‌సేల్ రేట్లలో నాణ్యమైన జీడిపప్పు తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కడ కొనుగోలు చేయవచ్చో ఇక్కడ తెలుసుకుందాం.
1. పలాస (శ్రీకాకుళం)
జీడిపప్పు అనగానే తెలుగు ప్రజలకు టక్కున గుర్తుకువచ్చేది పలాస. తెలుగు రాష్ట్రాల్లోనే జీడిపప్పుకు ఈ ప్రాంతం చాలా ఫేమస్. నేరుగా, చాలా తక్కువ ధరకు దొరికే ప్రధాన కేంద్రం శ్రీకాకుళం జిల్లాలోని పలాస - కాశీబుగ్గ ప్రాంతం. ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద జీడిపప్పు ఉత్పత్తి, హోల్‌సేల్ మార్కెట్ కేంద్రంగా పేరొందింది. ఇక్కడ వందలాది ప్రాసెసింగ్ యూనిట్లు నడుస్తున్నాయి... ఫ్యాక్టరీల వద్ద నుంచే హోల్‌సేల్ రేట్లకు జీడిపప్పు కొనుగోలు చేయవచ్చు.
ధరల వివరాలు : బయట బహిరంగ మార్కెట్‌లో కిలో రూ. 800 నుండి రూ. 1000 వరకు ఉంటే, పలాస ప్రాసెసింగ్ యూనిట్ల దగ్గర నాణ్యతను బట్టి కిలో రూ.400 నుండి రూ. 600 మధ్యలోనే దొరుకుతుంది. అంటే సాధారణ ధర కంటే రూ. 300 నుండి రూ. 400 వరకు తక్కువకే పొందే అవకాశం ఉంటుందన్నమాట.
2. జంగారెడ్డిగూడెం (పశ్చిమ గోదావరి)
పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం ప్రాంతం కూడా నాణ్యమైన జీడిపప్పు విక్రయాలకు ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతం చుట్టుపక్కల జీడి తోటల సాగు విస్తారంగా ఉంటుంది. ఇలా స్థానికంగానే జీడి తోటల పెంపకం, సేకరించిన పిక్కలను శుద్ధి చేసే ప్రాసెసింగ్ యూనిట్లు అందుబాటులో ఉండటం వల్ల మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. అందుకే ఇక్కడ వినియోగదారులకు నాణ్యమైన జీడిపప్పు తక్కువ ధరకే లభిస్తుంది.
3. మోరి (కోనసీమ)
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని మోరి గ్రామం జీడిపప్పు ప్రియులకు ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. సాధారణంగా యంత్రాల ద్వారా ప్రాసెస్ చేసే జీడిపప్పుకు, ఇక్కడ తయారుచేసే పప్పుకు చాలా తేడా ఉంటుంది. ఇక్కడ నేటికీ సంప్రదాయ పద్ధతిలో నిప్పులపై కాల్చి జీడిపప్పును వేరు చేస్తారు. ఇలా సంప్రదాయ రీతిలో కాల్చిన జీడిపప్పు ప్రత్యేకమైన సువాసనతో, కమ్మని రుచితో ఉంటుంది. ఈ నాటు పప్పును నేరుగా మోరి గ్రామంలోనే అనుకూలమైన ధరలకు కొనుగోలు చేయవచ్చు.
జీడిపప్పు ధరలో ఇంత వ్యతాసమా..!
వివిధ రకాల జీడిపప్పు గ్రేడ్‌లు, వాటి సాధారణ మార్కెట్ ధరలు, ఉత్పత్తి కేంద్రాల వద్ద లభించే హోల్‌సేల్ ధరల మధ్య వ్యత్యాసాన్ని పరిశీలిస్తే... పలాసలో అతి తక్కువ ధరకు నాణ్యమైన జీడిపప్పు లభిస్తుంది. సాధారణ మార్కెట్లలో రూ.800-1000 కి లభించే అత్యుత్తమ రకం జీడిపప్పు పలాసలో రూ. 400 - రూ. 600 లభిస్తుంది.
రెండు బద్దల పప్పు (Splits)బయట మార్కెట్లో రూ.700 - రూ.800 ఉంటే పలాసలో రూ.450 - రూ.500 ఉంటుంది. అదే కాస్త నాణ్యత తక్కువగా ఉండే చిన్న ముక్కల పప్పు (Pieces) బయట మార్కెట్లో రూ. 600 - రూ. 700 ఉంటే పలాసలో రూ.300 - రూ.400 ఉంటుంది. అంటే పలాస వంటి ప్రధాన వ్యాపార స్థలాల నుండి జీడిపప్పు నేరుగా కొనుగోలు చేసినప్పుడు ప్రతి కిలోపై భారీగా పొదుపు చేసుకోవచ్చు.
రూ. 30 కే కేజీ జీడిపప్పు... నిజమేనా?
సోషల్ మీడియాలో తరచూ "కేవలం రూ. 30 లేదా రూ. 50 కే కేజీ జీడిపప్పు లభిస్తోంది" అని కొన్ని వార్తలు, వీడియోలు హల్‌చల్ చేస్తుంటాయి. కానీ ఇందులో అసలు నిజం వేరే ఉంది. ఈ వార్తలు జార్ఖండ్ రాష్ట్రంలోని జామ్‌తారా జిల్లాకు చెందిన 'నాలా' అనే గ్రామానికి చెందినవి. అక్కడ అంత తక్కువ ధరకే జీడిపప్పు పిక్కలు లభించేది నిజమే... కానీ ఇవి మనం నేరుగా తినే తెల్లటి జీడిపప్పు (Cashew Kernels) కాదు.
ఈ నాాలా గ్రామానికి చెందిన గిరిజనులు రోడ్డు పక్కన పెట్టి అమ్మేవి శుద్ధి చేయని పచ్చి జీడిపిక్కలు (Raw Cashew Nuts). ఈ పచ్చి జీడిపిక్కల పొట్టులో హానికరమైన నూనె పదార్థం ఉంటుంది. వాటిని ఫ్యాక్టరీల్లో కాల్చి, బాయిల్ చేసి, పొట్టు ఒలిచి శుద్ధి చేసిన తర్వాతే తినదగిన పప్పు వస్తుంది. కాబట్టి మనం వీటిని శుద్దిచేయకుండా తినడం ప్రమాదకరం. ఏపీలో కానీ దేశంలో మరెక్కడైనా కానీ తినడానికి సిద్ధంగా ఉన్న నాణ్యమైన జీడిపప్పు రూ. 30 లేదా రూ. 50 కి లభించడం అనేది పూర్తిగా ఒక అపోహ మాత్రమే.
మీరు మంచి నాణ్యమైన, రుచికరమైన జీడిపప్పును తక్కువ ధరకే పొందేందుకు సోషల్ మీడియాలోని పుకార్లను నమ్మకుండా... శ్రీకాకుళం జిల్లాలోని పలాస, పశ్చిమ గోదావరిలోని జంగారెడ్డిగూడెం, లేదా కోనసీమలోని మోరి వంటి ప్రాంతాలకు వెళ్లవచ్చు. ఇక్కడి ప్రాసెసింగ్ కేంద్రాలను లేదా వారి అధికారిక హోల్‌సేల్ డిస్ట్రిబ్యూటర్లను ఆశ్రయించడం ద్వారా నాణ్యమైన జీడిపప్పు, చాలా తక్కువ ధరకే పొందవచ్చు.

