- Home
- Feature
- Snake Repellent Plants: పెరట్లో ఈ చిన్న మొక్కలు నాటితే చాలు... పాములు దరిదాపుల్లోకి కూడా రావు
Snake Repellent Plants: పెరట్లో ఈ చిన్న మొక్కలు నాటితే చాలు... పాములు దరిదాపుల్లోకి కూడా రావు
Snake Repellent Plants: వర్షాకాలంలో గుంటలు నీటితో నిండిపోవడం వల్ల పాములు బయటకు వచ్చి పొడి ప్రాంతాలు, మానవ నివాసాల వైపు వస్తుంటాయి. అయితే, కొన్ని ప్రత్యేకమైన మొక్కలను ఇంటి ఆవరణలో లేదా పెరట్లో పెంచడం వల్ల పాములు రాకుండా ఉంటాయి.

వర్షాకాలంలో పాముల భయమా? ఈ మొక్కలతో మీ ఇంటికి ఫుల్ సెక్యూరిటీ
వర్షాకాలం వచ్చిందంటే చాలు... చినుకులు, తేమ వాతావరణం తెచ్చే తిప్పలు అన్నీ ఇన్నీ కావు. బురద, ఆరని దుస్తుల గోల ఒకెత్తయితే, ఈ సీజన్ లో పెరిగే పాముల బెడద మరో పెద్ద తలనొప్పి. ఊళ్లలోనే కాదు, నగరాల్లోని అపార్ట్‌మెంట్లు, విల్లాల్లోకి కూడా పాములు వచ్చేస్తున్న వార్తలు చూస్తూనే ఉన్నాం. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే, వారు బయట ఆడుకునేటప్పుడు ఎంత భయంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే, రసాయనాలు వాడకుండా మన పెరట్లో నాటే కొన్ని సహజసిద్ధమైన మొక్కల ద్వారా పాములను దూరంగా ఉంచవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ మొక్కలేంటో, అవి ఎలా పనిచేస్తాయో ఇక్కడ తెలుసుకుందాం.
ఘాటైన వాసనలతో చెక్ పెట్టే మొక్కలు
పాములకు వాసనను పసిగట్టే శక్తి చాలా ఎక్కువ. అందుకే తీవ్రమైన లేదా ఘాటైన సువాసనలు వచ్చే మొక్కల పరిసరాల్లోకి రావడానికి ఇవి ఇష్టపడవు.
• సర్పగంధ: దీనికే పాతాళ గరుడ, పాతాళ గంధి అనే పేర్లు ఉన్నాయి. ఆయుర్వేదంలో ఎక్కువగా వాడే ఈ మొక్క వేర్లు, ఆకుల నుంచి వచ్చే ఘాటైన వాసన పాములకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తుంది.
• వెల్లుల్లి, ఉల్లి: మన వంటగదిలో వాడే వెల్లుల్లి, ఉల్లి మొక్కల్లో ఉండే సల్ఫర్, అల్లిసిన్ రసాయనాలు సహజ సిద్ధమైన స్నేక్ రిపల్లెంట్ లా పనిచేస్తాయి. వెల్లుల్లి రెబ్బలను నీటిలో కలిపి ఇంటి చుట్టూ చల్లడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
• దవనం, నిమ్మగడ్డి: పూలల్లో కలిపే దవనం తెచ్చే తాజా సువాసన మనుషులకు నచ్చినా పాములకు శత్రువే. అలాగే నిమ్మగడ్డిలో ఉండే సిట్రోనెల్లా వాసన పాములతో పాటు దోమలను కూడా తరిమికొడుతుంది.
కీటకాలను అదుపు చేసే అందమైన బంతి
మన ఇంట్లో ఎంతో అందంగా పూసే ముద్ద బంతి, కారబ్బంతి పూల మొక్కలు కేవలం తోటకు అందాన్ని ఇవ్వడమే కాదు, పాముల నివారణలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. బంతి పూల వేర్లు, ఆకుల నుంచి వచ్చే ప్రత్యేకమైన వాసన, రసాయనాలు పాములను, ఇతర చిన్న కీటకాలను దూరంగా ఉంచుతాయి. ఇంటి చుట్టూ లేదా కుండీల్లో వీటిని పెంచడం వల్ల క్రిమి కీటకాలు తగ్గడంతో పాటు పాములు ఆకర్షితమయ్యే అవకాశం తగ్గుతుంది.
ఇంటికి మేలు చేసే మూలికా రక్షణ
హిందూ సంప్రదాయంలో విశిష్ట స్థానం ఉన్న తులసి మొక్క నుంచి వచ్చే ఘాటైన మూలికా సువాసన పాములను దరిచేరకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. దీంతో పాటు పుదీనా ఆకుల ఘాటు వాసన కూడా పాములకు ఇష్టం వుండదు. ఇవి ఇంటికి మంచి వాతావరణాన్ని ఇవ్వడంతో పాటు పరిసరాలను సురక్షితంగా ఉంచడంలో ఉపయోగపడతాయి.
ఇతర నివారణ మొక్కలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు
లావెండర్, స్నేక్ ప్లాంట్, కాక్టస్ జాతి ముళ్ళ మొక్కలు వంటివి కూడా పాముల కదలికలను నిరోధిస్తాయి. కాక్టస్ ముళ్ళు పాములకు గుచ్చుకునే ప్రమాదం ఉండటంతో ఆ ప్రదేశాల వైపు అవి వెళ్లవు. అయితే, ఏ ఒక్క మొక్క కూడా పాములకు 100 శాతం పూర్తి రక్షణ ఇవ్వదని గుర్తుంచుకోవాలి. ఇవి కేవలం సహాయక మార్గాలు మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు.
మొక్కలతో పాటు ఇవి తప్పనిసరి
మొక్కలు నాటడంతో పాటు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.
• ఇంటి చుట్టూ పొదలు, పొడవైన గడ్డి పెరగకుండా ఎప్పటికప్పుడు తొలగించాలి.
• రాళ్ల కుప్పలు, పాత చెత్త, ఎండు కట్టెలు ఇంటికి దగ్గరగా నిల్వ ఉంచకూడదు.
• పాములకు ప్రధాన ఆహారమైన ఎలుకలు ఇంట్లో లేకుండా చూసుకోవాలి.
• ఒకవేళ పరిసరాల్లో పాము కనిపిస్తే స్వయంగా పట్టుకోవడానికి ప్రయత్నించకుండా అటవీ శాఖ లేదా స్నేక్ రెస్క్యూ టీమ్‌కు సమాచారం అందించడం మంచిది.

